ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు
ఆళ్లగడ్డ:
ఎన్నికల విధుల్లో బీఎల్‌ఓల పాత్ర కీలకమని.. అందులో నిర్లక్ష్యం విహ ంచినా..పక్షపాతం చూపినా చర్యలు తప్పవని కలెక్టర్ విజయమోహన్ హెచ్చరించారు. ఆళ్లగడ్డ పట్టణంలోని అమ్మవారిశాలలో సోమవారం బీఎల్‌ఓలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ పరిధిలో పనిచేసే ప్రతి అధికారి నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. బీఎల్‌ఓలు తమ పరిధిలోని ప్రతి ఓటరు పేరు ఓట్ల జాబితాలో ఉండేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు.
డెత్ రిజిష్టర్ చూసి చనిపోయిన వారి పేర్లు తొలగించాలన్నారు. ఓటరు నమోదుకు ఈనెల 11 వతేదీ వరకు వచ్చిన అర్జీలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అలాగే పోలింగ్ బూత్ పరిధిలో ఒకేసారి ఎక్కువ ఓట్లు పెరిగినా, తగ్గినా ఎన్నికల అధికారులు వాటిని పరిశీలించాలని ఆదేశించారు.
ఓట్ల స్లిప్‌లు పంచలేదని ఫిర్యాదులు వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలింగ్ రోజున ప్రతి బీఎల్‌ఓ ఓటరు సహాయ కేంద్రం ఏర్పాటు చేయాలని సూచించారు. వీఆర్వోలు ప్రతి పోలింగ్ స్టేషన్‌కు కరెంట్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని లేకపోతే కష్టమవుతుందన్నారు. ఇప్పటి నుంచి ఓ ప్రణాళికతో పనిచేసి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, తహశీల్దార్‌లు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణ
ఆళ్లగడ్డ టౌన్: ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ప్రశాంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ అన్నారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం రాత్రి ఎన్నికల, పోలీస్ అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి పలుసూచనలు, సలహాలు చేశారు.
నిర్భయంగా ఓటేయ్యండి
శిరివెళ్ల: వచ్చే నెల 8వ తేదీన జరిగే ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని జిల్లా కలెక్టర్ విజయమోహన్ ఓటర్లకు సూచించారు. సోమవారం గోవిందపల్లె గ్రామంలోని ఎస్పీజీ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రంలో కరెంట్, తాగునీటి సదుపాయాలపై తహశీల్డార్ రాంసుబ్బయ్యను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దళిత వాడలో ఓ చెట్టు కింద అరుగుపై కూర్చొని దళితులతో ముచ్చటించారు. ప్రతి ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా.. పోలింగ్ కేంద్రం తెలుసునా అని ఓటర్లను ప్రశ్నించారు.