రెవెన్యూ సదస్సులకు సిద్ధం కావాలి | Revenue needs to prepare for conferences | Sakshi
Sakshi News home page

రెవెన్యూ సదస్సులకు సిద్ధం కావాలి

Published Tue, Jan 28 2014 3:23 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM

Revenue needs to prepare for conferences

కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గ్రామ రెవెన్యూ సదస్సుల నిర్వహణకు అధికారులు సన్నద్ధం కావాలని జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ ఆదేశించారు. ఫిబ్రవరి 10 నుంచి 25 వరకు సదస్సులు నిర్వహించాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం తహసీల్దార్లు, వీఆర్‌ఓలు, ఆర్డీఓలు ఇతర రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి మాట్లాడారు. పహణీల కంప్యూటరైజేషన్ పూర్తి చేయాలని కోరారు. తహసీల్దార్ల అధ్యక్షతన మాత్రమే గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించి సర్పంచ్‌లను భాగస్వాములను చేయాలని కోరారు. ఈ నెల 31లోగా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించి రెవెన్యూ సదస్సులపై వివరించి వారి అభిప్రాయాలు స్వీకరించాలని ఆదేశించారు. 
 
 గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో పరిష్కరించిన భూ సమస్యలపై సభలో చదివి వినిపించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఇతర బలహీన వర్గాలకు ఇచ్చిన భూములను గుర్తించి సాగుకు యోగ్యంగా తయారు చేసే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. గ్రామాల్లో శ్మశానవాటికలకు ప్రభుత్వం భూమిని కేటాయించాలని, లేనిచో కొనుగోలు చేసేందుకు ప్రతిపాదించాలని తహసీల్దార్లకు సూచించారు. ఈసారి రెవెన్యూ సదస్సుల్లో నూతనంగా నివేశన స్థలాల అంశం కేటాయించినందున అందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫిబ్రవరి 4న హైదరాబాద్‌లో రెవెన్యూ సదస్సులపై జాయింట్ కలెక్టర్లతో జరిగే సమావేశానికి సమగ్ర సమచారం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్పెషల్ కలెక్టర్ ప్రసాదరావు, డీఆర్‌ఓ అంజయ్య, చంద్రవన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement