పట్టాలు సరే.. స్థలాలు ఎక్కడ?
- రెవెన్యూ అధికారులకు లబ్ధిదారుల ప్రశ్న
- కలకలం రేపిన వికలాంగుడిఆత్మహత్యాయత్నం
- జిల్లావ్యాప్తంగా 10వేలకుపైగా బాధితులున్నట్లు అంచనా
కర్నూలు(అగ్రికల్చర్): తాంబూలాలు ఇచ్చేశాం... ఇక తన్నుకుచావండి అన్నట్టుగా ఉంది రెవెన్యూ అధికారుల తీరు. రాజకీయ నాయకుల నుండి వచ్చే సిఫార్సులు, ఇతరత్రా వచ్చే ఒత్తిళ్లకు లొంగి పేదలకు హడావుడిగా ఇంటి స్థలాలు ఇస్తూ పట్టాలు ఇస్తున్నారు.. అయితే ఏళ్లు గడుస్తున్నా ఆ పట్టాలకు సంబంధించిన స్థలాలు మాత్రం చూపడంలేదు. ఈ విషయంలో ఒక్కరు, ఇద్ద రు కాదు... వేలాదిగా లబ్ధిదారులు ఇక్కట్లు పడుతున్నా అధికారుల తీరులో మార్పులేకపోవడం గమనార్హం.
కల్లూరు మండలం వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన వికలాంగుడు రాముడికి పట్టా ఇచ్చినప్పటికీ స్థలం చూపడంలో కల్లూరు తహశీల్దార్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ గత సోమవారం కలెక్టరేట్‌లో జరిగిన మీ కోసం కార్యక్రమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇందుకు స్పందిం చిన కలెక్టర్ వెంటనే అతనికి ఇంటి స్థలం చూపించాలని కర్నూలు ఆర్డీఓ, కల్లూరు తహశీల్దార్‌ను ఆదేశించారు. దీంతో వారు ఆగమేఘాల మీద ఆత్మహత్య యత్నానికి పాల్పడిన రాముకు ఇంటిస్థలం చూపారు. అయితే ఈ సమస్య రాము ఒక్కడిదే కాదు.. జిల్లా వ్యాప్తంగా 10వేల మంది ఉంటారని అంచనా. నగరంలోనే దాదాపు 5వేల మంది ఉన్నట్లు సమాచారం.
2009 వరదల కారణంగా..
2009లో కర్నూలుకు వరదలు రావడంతో పునరావాసం కింద నగరవాసులకు కల్లూరు మండలం తడకనపల్లి, కర్నూలు మండలం రుద్రవరంలో ఇంటి స్థలాలు కేటాయించారు. సుమారు 50వేల మందికి 2011లో అప్పటి చిన్ననీటి పారుదలమంత్రి టీజీ వెంకటేష్ ఆదేశాల మేరకు అధికారులు ఆగమేఘాల మీదు ఈ పని చేశారు. నాలుగేళ్లవుతున్నా ఇప్పటి వరకు స్థలాలు చూపకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. లబ్ధిదారులు మాత్రం పట్టాలు చేతపట్టుకుని స్థలాలు చూపాలంటూ అధికారులు, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే వైఎస్‌ఆర్‌సీపీ నేత ఎస్వీ మోహన్‌రెడ్డి కూడా తడకనపల్లి, రుద్రవరంలో కర్నూలు, కల్లూరు వాసులకు పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపాలని ఏడాది నుంచి కోరుతున్నారు. కానీ అధికార యంత్రాంగం చెవికెక్కించుకోలేదు.
- కల్లూరు మండలం తడకనల్లిలో 2011లో సర్వే నెం. 337, 338లో కర్నూలుకు చెందిన వేలాది మందికి పట్టాలు ఇచ్చారు.
- కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామానికి చెం దిన 1000మంది సర్వేనెంబరు 277లో, 2013లో ఇంటి స్థలాలు ఇస్తూ పట్టాలు ఇచ్చారు.
- కర్నూలు మండలం రుద్రవరంలో నగరానికి చెందిన 2వేల మందికి 2012లో పట్టాలిచ్చారు.