మాజీ ఎంపీ కృష్ణమూర్తికి చెందిన గోడౌన్లలో బైఠాయించి వినూత్న ప్రదర్శనకు దిగిన మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, రెవెన్యూ సిబ్బంది
అమలాపురం టౌన్: మున్సిపాలిటీలో రూ.అర కోటి మేర పేరుకుపోయిన పన్నుల మొండి బకాయిల వసూళ్లకు అధికారులు చేపట్టిన వినూత్న ప్రదర్శనకు బకాయిదారులు దిగివచ్చారు. అమలాపురం మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి తనకున్న లిక్కర్ గోడౌన్లు, క్వాయర్ ఫ్యాక్టరీలకు చెందిన భవనాలకు రూ.7.5 లక్షల వరకు మున్సిపాలిటీకి పన్నుల రూపేణా చెల్లించాల్సి ఉంది. ఈ మొండి బకాయిల వసూళ్లకు మాజీ ఎంపీని పలుమార్లు కలిసినా ఫలితం లేకపోవడంతో మున్సిపల్ అధికారులు ఆ గోడౌన్లను జప్తు చేసేందుకు బుధవారం ఉదయం సిద్ధమయ్యారు. మున్సిపల్ కమిషనర్ సీహెచ్‌వీవీఎస్ బాపిరాజు, రెవెన్యూ అధికారి(ఆర్వో) జి.అమరనాథ్, సీనియర్ అసిస్టెంట్ జి.శ్రీహరి, రెవెన్యూ విభాగం సిబ్బంది బుధవారం ఉదయం 8.30 గంటలకే చేరుకున్నారు. తొలుత గోడకు జప్తు నోటీసు అంటించారు.
ఆ గోడౌన్, క్వాయర్ ఫ్యాక్టరీలోని సిబ్బందిని బయటకు రమ్మని తాళాలు వేసేందుకు ప్రయత్నించారు. ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బందిలో కొందరు రాకపోవడంతో కమిషనర్ బాపిరాజు, ఆర్వో అమరనాథ్, రెవెన్యూ సిబ్బంది నేలపై బైఠాయించి వినూత్న ప్రదర్శన చేపట్టారు. మొండి బకాయిలు పన్నులు చెల్లిస్తేనే వెళతామని మొండికేసి కూర్చున్నారు. ఇంతలో బకాయిదారుడు, గోడౌన్ల యాజమాని మాజీ ఎంపీ కుసుమ కృష్ణమూర్తి అక్కడికి వచ్చారు. కమిషనర్, ఆర్వోలతో కొద్దిసేపు చర్చించారు. తానెందుకు బకాయిలు సకాలంలో చెల్లించలేకపోతున్నానో వివరించారు. మాజీ ఎంపీ వివరణకు అధికారులు సంతృప్తి చెందకుండా బైఠాయింపు కొనసాగించారు. దాదాపు రెండు గంటల పాటు ఈ బైఠాయింపు కొనసాగింది.
రూ.3.50 లక్షల చెల్లింపుతో బైఠాయింపు విరమణ
చివరకు మాజీ ఎంపీ కృష్ణమూర్తి రూ.1.50 లక్షల చెక్కును ఆర్వో అమరనాథ్‌కు అందించారు. అలాగే ఎక్సైజ్ లిక్కర్ గోడౌన్ల కోసం అద్దెకు ఇచ్చిన ఆ భారీ భవనాలకు పేరుకు పోయిన పన్నుల బకాయిలో కొంత అంటే రూ.రెండు లక్షలు ఆ ఎక్సైజ్ లిక్కర్ గోడౌన్ల ఇన్‌చార్జి శ్రీనివాసులు ఇచ్చేందుకు అంగీకరించడంతో రూ.3.50 లక్షల వసూళ్లకు మున్సిపల్ అధికారుల సంతృప్తి చెంది వెనుదిరిగారు. దీంతో ఈ వివాదం అక్కడితో సద్దుమణిగింది. మిగిలిన రూ.నాలుగు లక్షల బకాయిలు త్వరలోనే చెల్లించేందుకు మాజీ ఎంపీ కృష్ణమూర్తి కొంత గడువు నిర్దేశించడంతో దానికి మున్సిపల్ అధికారులు అంగీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment