సాక్షి, గుంటూరు: టీడీపీ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యడవల్లి సొసైటీని యథావిధిగా కొనసాగించుకోవచ్చని రివిజన్ అథారిటీ తీర్పునిచ్చింది. కాగా గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం యడవల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 381లో 416 ఎకరాల భూమి ఉంది. దీనిని 1975లో 250 మంది పేదలకు ప్రభుత్వం కేటాయించింది. ఈ క్రమంలో ఆ భూమిలో 2వేల కోట్ల విలువైన గ్రానైట్ ఉందంటూ.. దాన్ని కాజేయటానికి పుల్లారావు.. భూములు లాక్కునే ప్రయత్నం చేశారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు తెలియకుండా వారి సొసైటీని రద్దు చేయించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అప్పట్లో పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. పేదల తరపున రివిజన్ పిటిషన్ వేశారు.
ఈ నేపథ్యంలో యడవల్లి సొసైటీ రద్దు కరెక్టు కాదని, దాన్ని యథావిధిగా కొనసాగించుకోవచ్చని రివిజన్ అథారిటీ గురువారం తీర్పునిచ్చింది. ఈ విషయం గురించి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజినీ మాట్లాడుతూ.. ‘‘ఇది ప్రత్తిపాటి పుల్లారావుకు చెంపపెట్టు. పేదల భూములను లాక్కోవాలనుకున్నందుకు తగిన శాస్తి జరిగింది’’ అని పేర్కొన్నారు. (చదవండి: బంగారం పండుతుంటే ఉప్పు నేలంటున్నారు..)
అప్పట్లో మంత్రిగా చక్రం తిప్పిన ప్రత్తిపాటి
పత్తి వ్యాపారంతో మొదలు పెట్టి కోటాను కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నమాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన నియోజకవర్గ పరిధిలో గ్రానైట్ పరిశ్రమ స్థాపించాలని చాలా ఏళ్ల క్రితమే ప్రణాళిక రచించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తన ప్రణాళికను కార్యరూపంలో పెట్టడానికి పావులు కదిపారు. తన చేతులకు మట్టి అంటకుండా అధికారికంగానే వ్యవహారాన్ని నడిపించారు. దళితులు సాగుచేస్తున్న భూముల్లో ఏ మేరకు గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయో తెలుసుకునేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి జియాలజిస్టులను పిలిపించి సర్వే చేయించారు. దాదాపు రూ.2 వేల కోట్ల విలువ చేసే బ్లాక్ పెరల్ గ్రానైట్ ఉన్నట్టు అంచనాకు వచ్చారు.
ఆ భూమిలో ఉప్పు శాతం ఎక్కువగా ఉన్నందున సాగుకు యోగ్యమైనది కాదని వ్యవసాయ శాఖ, ఆ సొసైటీ ఎన్నో ఏళ్ల నుంచి రికార్డులను సక్రమంగా నిర్వహించడం లేదని సహకార శాఖ, ఆ భూముల్లో విలువైన గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయని మైనింగ్ శాఖ, గ్రానైట్ నిక్షిప్తమై ఉన్న భూమిని పారిశ్రామికవేత్తలకు అమ్ముకునేందుకు దళితులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ విజిలెన్స్ శాఖలు వేర్వేరుగా నివేదికలు ఇచ్చేలా చేశారు. ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం దళితుల సొసైటీని రద్దు చేసి, ఆ భూములను ప్రభుత్వ భూములుగా ప్రకటించింది. 2015 ఫిబ్రవరిలో దళితులకు ఇచ్చిన పట్టాలను కూడా రద్దు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment