
సాక్షి, అమరావతి : భవగుత్తు రఘురామ్ శెట్టి అలియాస్ బీఆర్ శెట్టి... అబుదాబీలో స్థిరపడిన భారతీయ సంపన్నుడు... ఇప్పుడు ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్నాడు. గత ప్రభుత్వ హయాంలో ఆయన అమరావతిలో వంద ఎకరాల్లో బీఆర్‌ఎస్ మెడిసిటీ హెల్త్‌కేర్ అండ్ రీసెర్చ్ సెంటర్, కృష్ణా నది మధ్య ఉన్న ద్వీపాల్లో భారీ గోల్ఫ్ కోర్స్ ఏర్పాటు చేస్తానని ప్రతిపాదనలు పంపారు. ధనవంతుడైన బీఆర్ శెట్టి తనను చూసి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చారంటూ మాజీ సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే బీఆర్ శెట్టి అన్నీ దొంగ లెక్కలే చూపించారంటూ ‘మడీ వాటర్స్’ సంస్థ బయటపెట్టింది.
70 శాతం క్షీణించిన షేర్ ధరలు :
ఎన్‌ఎంసీ హెల్త్‌కేర్ పేరుతో అబుదాబీతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు చోట్ల బీఆర్ శెట్టి ఆస్పత్రులను ఏర్పాటు చేశారు. ఈ సంస్థను ఏకంగా లండన్ స్టాక్ ఎక్సే్ఛంజ్ కూడా నమోదు చేశారు. అయితే ఈ సంస్థ ప్రకటిస్తున్న ఆదాయ వ్యయాలపై ఓ కన్నేసి ఉంచిన ప్రముఖ షార్ట్ సెల్లింగ్ (షేర్ల పతనంపై అంచనా వేస్తుంది) సంస్థ ‘కార్సన్ బ్లాక్’ అసలు విషయం తేల్చమంటూ మడీ వాటర్స్‌కు బాధ్యతలు అప్పచెప్పింది. ఇందులో విస్తుపోయే అంశాలు బయటపడ్డాయి. బీఆర్ శెట్టి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయారని, చివరికి తన వాటాగా ఉన్న షేర్లను బ్యాంకులకు తనఖా పెట్టడమే కాకుండా, ఇతర భాగస్వాములకూ వాటాలు విక్రయించిన విషయాన్ని వెల్లడించింది. విదేశీ సంస్థలను అధిక ధరకు కొనుగోలు చేసినట్లుగా అకౌంట్స్‌లో చూపించారని, ఖాతాల్లో నగదు నిల్వలను ఎక్కువ చేసి చూపారని పేర్కొంది. వాస్తవ రుణాలను కూడా తక్కువ చేసి చూపిన వైనాన్ని బయటపెట్టింది. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఎన్‌ఎంసీ షేరు ధర సుమారు 70 శాతం క్షీణించింది. దీంతో తనఖా పెట్టిన షేర్లను ఫస్ట్ అబుదాబీ బ్యాంక్, ఫాల్కన్ ప్రైవేట్ బ్యాంకులు అమ్మేశాయి. ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో రెండు రోజుల క్రితం చైర్మన్ పదవి నుంచి బీఆర్ శెట్టి తప్పుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment