టీడీపీలో వర్గపోరు | Rift in khammam TDP | Sakshi
Sakshi News home page

టీడీపీలో వర్గపోరు

Published Tue, Oct 29 2013 3:23 AM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM

Rift in khammam TDP

సత్తుపల్లి, న్యూస్‌లైన్: ‘వదలమంటే పాముకు కోపం...పట్టమంటే కప్పకు కోపం’ అనే రీతిలో సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల పరిస్థితి తయారైంది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సోమవారం సత్తుపల్లి, వేంసూరు, దమ్మపేట, పెనుబల్లి మండలాలలో పర్యటించారు. సత్తుపల్లి, ఖమ్మం ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, తుమ్మల నాగేశ్వరరావు వర్గీయులు పలువురు పర్యటనకు దూరంగా ఉన్నారు. ‘సత్తుపల్లిలో నామా నాగేశ్వరరావు పర్యటన ఉంది.. జిల్లా పార్టీ నుంచి ఏ సమాచారం లేదు.. నామా పర్యటనకు వెళ్లాలా వద్దా?’ అని సత్తుపల్లికి చెందిన ఓ ముఖ్య నాయకుడు ఖమ్మం ఎమ్మెల్యేకు ఫోన్ చేసి అడిగినట్లు సమాచారం.
 
 దీనిపై ఆయన స్పందిస్తూ  ‘నాకు అక్కడ మంట పెడుతుంటే.. మీరు పూలతో స్వాగతం పలుకుతారా..?’అని ఆయన ఘాటుగా స్పందించినట్లు తెలిసింది. ఈ మేరకే సత్తుపల్లి మండల నాయకత్వం ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటనకు దూరంగా ఉందని తెలిసింది. పనిలో పనిగా వెళ్లిన ఒకరిద్దరి సమాచారం కూడా సేకరించేపనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీ నామా నాగేశ్వరరావు తన సొంత వర్గాన్ని ఏర్పరుచుకునే పనిలో భాగంగా పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు ప్రాధాన్యం కల్పిస్తూ.. పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని సండ్ర, తుమ్మల వర్గీయులు ఆగ్రహంగా ఉన్నారు.
 
 ఎంపీ నిధులతో నిర్వహించే పనుల కేటాయింపుల్లో స్థానిక నాయకత్వానికి కనీస సమాచారం కూడా ఇవ్వటం లేదని.. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే పనులు అప్పగిస్తున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఎంపీ నియోజకవర్గాలకు పర్యటనకు వచ్చినప్పుడు జిల్లా పార్టీ నుంచి గానీ, ఎంపీ కార్యాలయం నుంచి గానీ పార్టీ బాధ్యులకు సమాచారం ఇవ్వరా? అని నిలదీస్తున్నారు. పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరించి కొందరిని వర్గంగా తయారు చే సుకుంటూ పార్టీ ప్రయోజనాలను మం టగలుపుతున్నారని తుమ్మల వర్గీయు లు ఆగ్రహావేశాలు వెళ్లగక్కుతున్నారు.
 
 ‘సండ్ర’కు తప్పని తిప్పలు...
 సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆర్థిక అవసరాల కోసం ఎంపీ నామా నాగేశ్వరరావు జపం చేస్తూ.. ఎంపీ పర్యటనకు తన వర్గీయులు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారంటూ నామా వర్గీయులు ధ్వజమెత్తుతున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మండలానికి రూ.10 లక్షల చొప్పున రూ.50 లక్షలు నామా నాగేశ్వరరావు నుంచి తీసుకొని..గెలిచిన సర్పంచ్‌లను కూడా వెళ్లవద్దంటూ హుకుం జారీ చేయడం ఎంతవరకు సబబు అని ఎంపీ వర్గీయులు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే డబుల్‌గేమ్ వల్ల పార్టీ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. కార్యకర్తలకు పనులు పంచి పెడుతున్నా.. అడ్డు పడుతున్నారని ఆరోపణలు గుప్పిస్తున్నారు.  వేం సూరు,పెనుబల్లి మండలాల్లో ఎమ్మెల్యే అనుచరులు నామా పర్యటనలో పాల్గొనడాన్ని తుమ్మల వర్గీయులు తప్పుబడుతున్నారు. సోమవారం ఉదయం సత్తుపల్లి రావాల్సిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఎంపీ పర్యటన ఉండటంతో వాయిదా వేసుకున్నట్లు తెలిసింది.  
 
 తుమ్మల సొంత మండలంలో...
 తుమ్మల నాగేశ్వరరావు సొంత మండలమైన దమ్మపేటలో ఆయనకు అత్యంత సన్నిహితులైన దొడ్డాకుల రాజేశ్వరరావు, కాసాని వెంకటేశ్వరరావు, ఆలపాటి రామచంద్రప్రసాద్, బండి పుల్లారావు, పానుగంటి సత్యం, మెచ్చా నాగేశ్వరరావు ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటనలో హుషారుగా పాల్గొనడం చర్చనీయాంశంగా మారిం ది. సత్తుపల్లి మండలంలో తుమ్మల అనుచరులు దూరంగా ఉండి.. ఆయన సొంత మండలంలో పర్యటనకు వెళ్లటంపై ఆరాలు మొదలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement