అమ్మానుషం
కడప అర్బన్: మానవవత్వం మంటగలుస్తోంది.. అమ్మతనం అపహాస్యమవుతోంది.. కన్ను తెరిచి ఈ లోకంలోకి వచ్చిన కొన్ని రోజులకే కొందరు అనాథలుగా మారుతుండగా.. మరికొందరు జంతువులకు ఫలహారమవుతున్నారు. కడప నగరంలో గురువారం వెలుగు చూసిన సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. రిమ్స్‌లో పదిరోజుల పసికందును గుర్తు తెలియని మహిళ వదిలేసి వెళ్లింది. చీటీ రాయించుకుని వస్తానని చెప్పి అక్కడి నుంచి అలాగే ఉడాయించింది. నవమాసాలు మోసి కన్న తన చిన్నారిని ఒంటరి చేసి వెళ్లిపోయింది. రిమ్స్ సీఐ నారాయణ ఆ పసికందును ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని శిశువిహార్‌కు అప్పగించారు. డాక్టర్ నరసింహారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండున్నర నుంచి నాలుగు కిలోల బరువుతో చిన్నారులు జన్మిస్తారన్నారు. రిమ్స్‌లో వదిలేసి వెళ్లిన శిశువు కేవలం ఒకటిన్నర కిలోలు ఉందన్నారు.
బుగ్గవంకలో మరో మృతదేహం
మెత్తటి పరుపుపై ఆ పసిపాప నిద్రపోతున్నట్లుంది. అయితే ఆ పాపలో చలనం లేదు. ఊపిరి ఎప్పుడో ఆగిపోయింది. తమకు భారం అనుకున్నారో.. ఇంకేమిటో గానీ బుగ్గవంకలో గురువారం ఈ చిన్నారి మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. రెండు నెలల వయస్సున్న ఈ చిన్నారి ఎలా మృతి చెందింది అన్న విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం దహనసంస్కారం చేస్తామని పోలీసులు చెప్పారు.