
ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో ఆర్వో ప్లాంట్లు
మంత్రి అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం : రాష్ర్టంలోని 329 ఫ్లోరైడ్ బాధిత గ్రామాల్లో రూ.13 కోట్లతో ఆర్‌వో ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.ఎస్సీ సబ్‌ప్లాన్‌లో రూ.350 కోట్లతో ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు నిర్మాణాలు చేడతామన్నారు.రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 3,400 కార్యదర్శుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీటిలో 2,400 పోస్టులను సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. రాష్ర్టంలో 13 వేల గ్రామ పంచాయతీలను ప్రణాళికపరంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
పంచాయతీ ఉపాధి నిధులు రూ.1680 కోట్లతో గ్రామాల్లో చేపట్టిన పనులను ఏప్రిల్ నెలాఖరునాటికి పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. నిర్మాణదశలో ఉన్న 789 పనులను పూర్తి చేసేందుకు రూ. వెయ్యి కోట్లతో ప్రతిపాదించామన్నారు. జిల్లాలో రూ.7.8 కోట్లతో ఎస్సీ నివాసిత ప్రాంతాల్లో రోడ్లు వేస్తామన్నారు. ఎస్టీ సబ్‌ప్లాన్‌లో రూ.220 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గంలో రూ.5కోట్ల 20 లక్షలతో అన్ని గిరిజన గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించేందుకు నిర్ణయించామన్నారు.
రాష్ర్టంలో తొలి విడతగా 6 లక్షల తెల్ల రేషన్ కార్డుల మంజూరుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. హుద్‌హుద్ తుపానుకు దెబ్బతిన్న పంచాయతీరోడ్ల మరమ్మతులకు రూ.150 కోట్లు మంజూరు కాగా, వీటిలో నర్సీపట్నం నియోజకవర్గానికి రూ.35 కోట్లు కేటాయించామన్నారు. డంపింగ్‌యార్డుల నిర్మాణం ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు.