నేను, బాబు.. లోకేశ్‌కు సలహాలిస్తాం: అయ్యన్న
సాక్షి, విశాఖపట్నం: తాను, సీఎం చంద్రబాబు... లోకేశ్‌కు సూచనలు, సలహాలిస్తామని, ఆయనకు రాజకీయ అనుభవం లేకపోయినా మంత్రిగా రాణిస్తారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. లోకేశ్ రాబోయే రోజుల్లో టీడీపీకి నాయకత్వం వహిస్తారని ఆయన జోస్యం చెప్పారు. పంచాయతీరాజ్‌శాఖ నుంచి ఆర్‌అండ్‌బీ శాఖకు మార్పు జరిగాక విశాఖ వచ్చిన ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ఏపీలో మంత్రి పదవులిచ్చిన నలుగురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయిస్తే తానూ చేస్తానని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం చంద్రబాబుకు విసిరిన సవాల్‌పై ప్రశ్నించగా.. అయ్యన్న సూటిగా స్పందించలేదు. పార్టీ మారిన తలసానికి నైతిక విలువలపై మాట్లాడే హక్కు లేదన్నారు.
మీరు వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రిపదవులిచ్చారు.. వారికి ఈ నైతిక హక్కు వర్తించదా? అని విలేకరులు ప్రశ్నించగా.. అది వేరు.. ఇది వేరు అంటూ మంత్రి తప్పించుకున్నారు. ఇలాంటి అంశాలపై కొన్ని ఇబ్బందులున్నా వాటిని తమ నాయకుడు చంద్రబాబు సమర్థవంతంగా సరిచేస్తారని చెప్పారు. తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై మీ పార్టీవారే ఫిర్యాదు చేశారు.. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులెలా ఇస్తారు? దీనిని మీరెలా సమర్థించుకుంటారు? అన్న ప్రశ్నకు తెలంగాణలో ఆ నిర్ణయం జరిగినప్పుడు మీ ప్రెస్‌వాళ్లు ఏం మాట్లాడలేదు.. అని దాటవేసే ప్రయత్నం చేశారు. కొన్ని సందర్భాల్లో రాజకీయ నిర్ణయాలు తీసుకుంటారు. మీరు అర్థం చేసుకోవాలి.. అని ముక్తాయించారు. కేబినెట్‌లో 26 మందికి మించి స్థానం లేదన్న సంగతిని పదవులు దక్కని సీనియర్లు అర్థం చేసుకోవాలని చెప్పారు.