
తిరుపతి వెళ్లబోతూ.. ఆరుగురి మృతి
వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహబూబ్నగర్ నుంచి తిరుపతి వెళ్తున్న తుఫాన్ వాహనం బోల్తాపడి ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. వైఎస్ఆర్ జిల్లా పుల్లంపేట మండలం పూతనవారిపల్లె వద్ద చాలా ప్రమాదకరమైన మలుపు ఒకటుంది. అక్కడ గతంలో కూడా చాలా ప్రమాదాలు సంభవించాయి. సరిగ్గా అదే ప్రాంతంలో తుఫాన్ వాహనం వేగంగా వస్తుండగా, రోడ్డు మీద ఆరేళ్ల చిన్నారి అడ్డు వచ్చాడు. అతడిని తప్పించే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఆ సమయానికి డ్రైవర్ నిద్రమత్తులో కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
వాహనం చిన్నారి మీదకు ఎక్కేసి, తిరగబడింది. ఆ చిన్నారి సహా వాహనంలో ఉన్న ఐదుగురు కూడా అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. వారికి రాజంపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం వారిని ఇటు కడప గానీ, అటు తిరుపతి గానీ ఆస్పత్రికి తరలించే అవకాశం ఉంది. బాధితులు ఎవరు, ఎక్కడివారన్న విషయం కూడా ఇంతవరకు తెలియలేదు. కేవలం మహబూబ్నగర్ జిల్లా అని మాత్రమే తెలిసింది. ఏ ఊరి వాళ్లో, వారి బంధువులెవరో ఏమీ తెలియలేదు. దాంతో వారికి కూడా సమాచారం తెలియలేదు.