మానవపాడు (అలంపూర్): తల్లి, కుమారుడు బైక్‌పై వెళ్తుండగా.. ప్రమాదవశాత్తు వెనక కూర్చున్న తల్లి చీర టైర్లలో చుట్టుకోవడంతో అదుపుతప్పి కిందపడింది. తలకు గాయం కావడంతో చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించగా.. అక్కడ వైద్యసిబ్బంది అందుబాటులో లేరు. కుమారుడు 25 నిమిషాల పాటు తల్లిని కాపాడుకునేందుకు ఎంతో యత్నించాడు. కానీ.. చివరికి కళ్లెదుటే కన్నతల్లి తుదిశ్వాస విడిచింది. ఈ విషాదకర సంఘటన మానవపాడు స్టేజీ వద్ద శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది.
ఎస్‌ఐ గురుస్వామి, మృతురాలి కుమారుడు తెలిపిన వివరాలిలా.. నాగర్‌కర్నూల్ జిల్లా లింగాలకు చెందిన తిమ్ములమ్మ (50) ఏపీ రాష్ట్రం కర్నూలు జిల్లా సి.బెలగల్‌లోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఈమె భర్త గతంలో గుండెపోటుతో మృతి చెందాడు. వీరికి కుమారుడు వెంకటేశ్వర్లు, కూతు రు లక్ష్మీదేవి ఉన్నారు. కుమారుడికి గతంలో వివా హం చేయగా.. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా విడాకులకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు కొల్లాపూర్ కోర్టులో నడుస్తోంది.
ప్రమాదవశాత్తు బైక్ టైర్‌లో చీర చుట్టుకుని..
కొల్లాపూర్ కోర్టులో శుక్రవారం హాజరుకావాల్సి ఉండగా.. తల్లి తిమ్ములమ్మ, కుమారుడు వెంకటేశ్వర్లు కలిసి బైక్‌పై సి.బెలగల్ నుంచి ఉదయాన్నే బయల్దేరారు. మార్గమాధ్యంలోని మానవపాడు స్టేజీ వద్దకు చేరుకోగానే వెనక టైర్‌లో చీర చుట్టుకుని అదుపుతప్పి కింద పడడంతో తల్లికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుమారుడు, చుట్టుపక్కల వారి సాయంతో సమీపంలోని మానవపాడు పీహెచ్‌సీకి తరలించారు. ఉదయం 8 గంటలకు అక్కడికి చేరుకోగా.. సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో పాటు తలుపులు మూసి ఉన్నాయి.
వెంటనే కుమారుడు 108కు ఫోన్ చేశాడు. 8.25 గంటలకు ప్రైవేట్ వాహనంలో 108వాహనం వచ్చే రూట్‌లో ఎదురుగా వెళ్లారు. మధ్యలో వాహనం కనిపించింది. అందులోని సిబ్బంది పరీక్షించగా.. అప్పటికే మృతి చెందిందని చెప్పడంతో కుమారుడు కన్నీరుమున్నీరుగా విలపించాడు. విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ మానవపాడు పీహెచ్‌సీకి చేరుకుని వివరాలు సేకరించి మృతదేహాన్ని అలంపూర్ సీహెచ్‌సీలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అందుబాటులో లేని సిబ్బంది..
పీహెచ్‌సీలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతోనే తన తల్లి మృతి చెందిందని కుమారుడు వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఇదిలాఉండగా, ఈ సంఘటనపై డాక్టర్ సవితను వివరణ కోరగా.. సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment