రోడ్డు ప్రమాదంలో తమ ఏకైక కుమారుడు సుక్రు మరణించడంతో గుండెలవిసేలా రోదిస్తున్న గోగ్య తండాకు చెందిన దంపతులు గోబ్రియ, చావ్లీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/జడ్చర్ల: పొట్టకూటికోసం పనికి వెళ్లొస్తూ.. 13 మంది కూలీలు విగత జీవులుగా మారారు. కాసేపట్లోనే ఇంటికి చేరుకుంటామని అనుకుంటుండగానే.. లారీ రూపంలో మృత్యువు కబళించింది. 13 మందిని బలితీసుకుని వారి కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండ లం కొత్తపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆదివారం సాయంత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 12 మంది కూలీలు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో మహిళ చికిత్స పొందుతూ చనిపోయింది. మృతుల్లో 10 మంది మహిళలే. తీవ్రంగా గాయపడిన ఐదు గురికి మహ బూబ్‌నగర్‌లోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విష మంగా ఉంది. జడ్చర్ల నుంచి కోదాడవైపు అతి వేగంగా వెళ్తున్న లారీ (టీఎస్ 29టీ 5488) ఎదు రుగా వస్తున్న బాధితులు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతు లంతా మిడ్జిల్ మండలం కొత్తపల్లి వారే కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వాడ్యాల టు కొత్తపల్లి
మిడ్జిల్ మండలం కొత్తపల్లి, గోక్యతండాకు చెందిన 17 మంది కూలీలు పక్కనే ఉన్న వాడ్యాల గ్రామానికి వరి నాటే పనికి వెళ్లారు. గోక్యతండాకు చెందిన సుక్రు, మరో ఇద్దరితో కలిసి వాడ్యాలలో 20 ఎకరాల భూమిని కౌలుకు తీసుకోగా.. ఆ పొలంలో పనిచేసేందుకు వీరంతా అక్కడకు వెళ్లారు. అక్కడ వరినాట్లు వేసి మళ్లీ ఆటోలో సాయంత్రం 6 గంటలకు కొత్తపల్లికి తిరుగుపయనమయ్యారు. మరో ఐదు నిమిషాల్లో కొత్తపల్లికి చేరుకుంటారను కుంటుండగానే సాయంత్రం 6.45 నిమిషాలకు ఎదురుగా, వేగంగా వస్తున్న లారీ వీరు ప్రయాణి స్తున్న ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ఆటో నుజ్జునుజ్జయింది. ప్రమాదంలో గాయపడ్డ వారిని కాపాడేందుకు స్థానికులతోపాటు.. ఆ మార్గంలో వెళ్తున్న వారు తమవంతు ప్రయత్నం చేశారు. ప్రమా దంలో చెల్లాచెదురుగా పడి ఉన్న మృత దేహాలతో పాటు క్షతగాత్రులను ఓ పక్కకు చేర్చారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించేందుకు 108 సకాలంలో రాకపోవడంతో రోడ్డు మార్గంలో వెళ్తున్న ప్రైవేటు వాహనాలను ఆపి మహబూబ్‌నగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగినా.. 108 అంబులెన్స్ గంటన్నర ఆలస్యంగా రావడంతో వ్యాన్‌ను స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విషాదంలో కొత్తపల్లి
ప్రమాదంలో చనిపోయిన వారందరూ మిడ్జిల్ మండలం కొత్తపల్లికి చెందిన వారే కావడంతో మండలంలో విషాదం నెలకొంది. ముదిగొండ వెంకటమ్మ (45), నెల్లికంట చంద్రమ్మ (45), బెల్లెపోగు వెంకటమ్మ (45), బెండేరు ఎల్లమ్మ (50), వడ్డె చెన్నమ్మ (50), ముడావత్ బిచాని (50), రాగుల శివలీల (45), మంగళగిరి బాలమణి (48), చిక్కొండ సాలమ్మ (50), ముడావత్ శివాజి (45), ముడావత్ చాందీ (42), ముడావత్ సక్రు అలియాస్ నేపాల్ (30) ఘటనాస్థలంలోనే చనిపోగా.. బొంకూరి పార్వతమ్మ (38) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. ముడావత్ సక్రునాయక్, రాగుల ఇంద్రమ్మ, రాగుల జంగమ్మ, ఎరుకలి ఈదమ్మ, ముడావత్ దేవిలకు పాలమూరు ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.
దయనీయంగా ఘటనాస్థలం
మృతదేహాలు.. క్షతగాత్రుల కుటుంబీకుల హాహాకారాలు, ఆర్తదానాలతో ప్రమాదస్థలి వద్ద పరిస్థితి దయనీయంగా మారింది. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకుని మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. చెల్లాచెదురైన శవాలను చూస్తూ తమ వారిని వెతుక్కున్నారు. చనిపోయిన వారిని చూసి ఆ బాధను తట్టుకోలేక గుండెలు పగిలేలా ఏడ్చారు. మిన్నంటిన రోదనలు చూసి అక్కడున్న మిగతా వారందరూ కన్నీళ్ల పర్యంతమయ్యారు. ఈ మృతదేహాలను బాదేపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం వీటికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.
మృతుల్లో భార్యాభర్తలు, తోటికోడళ్లు
ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాద మృతుల్లో భార్య భర్తలు, తోటికోడళ్లు ఉన్నారు. కొత్తపల్లి సమీపంలోని గోగ్యతండాకు చెందిన శివాజీ (45) అతడి భార్య చాందీ (35)లు మృత్యువాత పడ్డారు. కొత్తపల్లికి చెందిన తోటికోడళ్లు జంగమ్మ, ఇంద్రమ్మ, శివలీలు ముగ్గురు చనిపోవడం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. గోగ్యతండాకు చెందిన గోబ్రియ–చావ్లీ దంపతుల ఏకైక కుమారుడు సుక్రు ప్రమాదంలో చనిపోవడంతో తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి తరమూ కావడం లేదు. కూలీ పనులకు వెళ్లి సంతోషంగా వస్తాడనుకున్న కొడుకు విగత జీవిగాపడి ఉండటాన్ని చూసిన తల్లిదండ్రుల రోదన హృదయవిదారకంగా మారింది.
సీఎం విచారం.. తక్షణ సాయానికి ఆదేశం
మహబూబ్‌నగర్‌లో జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబ సభ్యులకు సీఎం ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. వెంటనే సంఘటనాస్థలానికి వెళ్లి సహాయకచర్యలు చేపట్టాలని జిల్లా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను ఆదేశించారు. ఆ సమయంలో హైదరాబాద్‌లో ఉన్న మంత్రి హుటాహుటిన ప్రమాదస్థలానికి వెళ్లారు. బాధిత కుటుంబాలను ఓదార్చారు.
50లక్షల నష్టపరిహారానికి డిమాండ్
ప్రమాద స్థలాన్ని సందర్శించేందుకు వెళ్లిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్, స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని మృతుల కుటుంబీకులు, స్థానికులు ఘెరావ్ చేశారు. మృతుల కుటుంబాలకు రూ.50లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారులు ఎంత నచ్చజెప్పాలని ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో స్థానిక నాయకులు కలగజేసుకుని బాధిత కుటుంబీకులకు నచ్చజెప్పాల్సి వచ్చింది. అనంతరం పాలమూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రి పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి డబుల్ బెడ్రూం ఇవ్వడంతో పాటు వైద్య ఖర్చులను తామే భరిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.
ఆ రోడ్డును పట్టించుకోరా?: తమ్మినేని
కొత్తపల్లి శివారులో జరిగిన ఘోర ప్రమాదం పట్ల సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదం జరిగిన చోట రోడ్డు మలుపుగా ఉందని.. గతంలోనూ చాలాసార్లు ఇక్కడే ప్రమాదం జరిగినా అధికారులు ఆ రోడ్డును ఎందుకు బాగు చేయటం లేదని ఆయన ఓ ప్రకటనలో ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment