ప్రాణం తీసిన నిద్రమత్తు
Published Wed, Apr 2 2014 3:42 AM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
ఫిరంగిపురం, న్యూస్‌లైన్ :నిద్ర మత్తు లారీ క్లీనర్ ప్రాణాలు తీసింది. డ్రైవర్‌కు నిద్ర ముంచుకురావడంతో లారీని తాను నడుపుతానంటూ స్టీరింగ్ చేతబట్టిన క్లీనర్ కొద్ది సేపటికే కనురెప్ప వాలడంతో ప్రమాదం చోటుచేసుకొని ప్రాణాలు కోల్పోయాడు. మంగళవారం తెల్లవారుజామున ఫిరంగిపురం మండలం మేరికపూడి గ్రామంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురానికి చెందిన లారీ డ్రైవర్ ఇస్రాయిలు, అతని మేనల్లుడు క్లీనర్ పందిరి రాంబాబు(20) కాకినాడ నుంచి యూరియా లోడు లారీతో నరసరావుపేట బయలుదేరారు. పేరేచర్ల వద్దకు వచ్చేసరికి డ్రైవర్ నిద్ర వస్తోందని,
రోడ్డు పక్కన లారీ నిలిపి నిద్రపోదామని చెప్పాడు. అయితే లారీని నేను నడుపుతాను నీవు నిద్రపో అంటూ క్లీనర్ డ్రైవింగ్ చేపట్టాడు. మేరికపూడి గ్రామ సమీపానికి వచ్చే సరికి నిద్రమత్తులో ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బసివిరెడ్డిపల్లి నుంచి మిర్చిలోడుతో వస్తున్న టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీకొట్టించాడు. ఈ ప్రమాదంలో లారీ నడుపుతున్న రాంబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. టాటా మ్యాజిక్‌లో ఉన్న డ్రైవర్ యనమాల రమేష్ , అతని స్నేహితుడు నల్లబోతు ఆంజనేయులుకు తీవ్రగాయాలవడంతో 108 సిబ్బంది నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. లారీ డ్రైవర్ ఇస్రాయిలు, మిర్చి రైతు బ్రహ్మానందరెడ్డి స్వల్పగాయాలతో బయటపడ్డారు. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు.
Advertisement
Advertisement