‘తారు’మారు | Roads Works Is ‎Crumbling Nellore | Sakshi
Sakshi News home page

‘తారు’మారు

Published Wed, Aug 8 2018 10:11 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

Roads Works Is ‎Crumbling Nellore - Sakshi

లేచిపోయిన బీటీపై అతుకులు వేస్తున్న దృశ్యం

యాభై ఏళ్ల ఆ గ్రామస్తుల కలలు కల్లలు అయ్యాయి.. ఐదు దశాబ్దాలుగా ఆ గ్రామానికి రోడ్డు లేదు. ఇటీవల బీటీ రోడ్డు వేసేందుకు రూ.50 లక్షలు మంజూరు కావడంతో తమ సమస్య పరిష్కారమవుతుందని భావించారు. యాభై ఏళ్లపాటు గ్రావెల్‌ రోడ్డుపై కష్టాల ప్రయాణం చేసిన పెళ్లకూరు మండలం చవటకండ్రిగ గ్రామస్తులు తమకు మంచిరోజులొచ్చాయని అనుకున్నారు. అయితే బీటీ రోడ్డు పనుల్లో కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించక రోడ్డు వేసిన 24 గంటల లోపే పెచ్చులు పెచ్చులుగా లేచిపోతోంది. లేచిపోయిన బీటీరోడ్డుకు మళ్లీ అతుకులు వేస్తున్నారు. బీటీ రోడ్డు నిర్మాణంలో కాంట్రాక్టర్‌ నాణ్యతకు పాతరేయడంపై గ్రామస్తులు ఆగ్రహించి  పనులను అడ్డుకోవడంతో ఇక్కడ కాకపోతే మరోచోట రోడ్డు వేయిస్తామని సైట్‌ ఇంజినీరు గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. పనులు నాసిరకంగా జరుగుతున్న విషయాన్ని సాక్షి ముందుగానే హెచ్చరిస్తూ గత నెల 7వ తేదీన ‘అర్ధశతాబ్దపు ఆశలపై అవినీతి దారులు’ శీర్షికతో కథనం కూడా ప్రచురించింది. అధికారులను హెచ్చరించింది. అయినా అధికారులు స్పందించలేదు. 

పెళ్లకూరు(నెల్లూరు): పనులు చేజిక్కించుకున్నామా.. అధికారులకు పర్సంటేజ్‌లు చెల్లించేశామా.. నాసిరకంగా పనులు పూర్తి చేసి చేతులు దులుపుకొని దర్జాగా బిల్లులు చేసుకున్నామా అనే తీరులో రోడ్డు పనులు నాసిరకంగా చేస్తున్నారు. పెళ్లకూరు మండలంలోని పునబాక పంచాయతీ, చవటకండ్రిగ గ్రామానికి వెళ్లే గ్రావెల్‌ రోడ్డును రూ.50 లక్షల నిధులతో బీటీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. ప్రాథమిక దశ పనులు పూర్తయిన అనంతరం జూలై 27న బీటీ పనులు చేపట్టారు. బీటీ వేసిన రెండు గంటలకే తేలికపాటి సైకిళ్లు, స్కూటర్లు వెళ్లగా రోడ్డు పెచ్చులు, పెచ్చులుగా లేచిపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చి పనులను అడ్డుకొని నిలిపేశారు. ప్రాథమిక దశ పనుల్లో కూడా నాణ్యత లేని కంకర, సరైన వాటర్‌ క్యూరింగ్‌ చేయకపోవడం, రోడ్డు మార్జిన్‌ పనులు గ్రావెల్‌కు బదులుగా మట్టితో ఏర్పాటు చేయడంలో ఆ శాఖ సిబ్బంది(సైట్‌ ఇంజినీర్‌) కీలకపాత్ర పోషించాడని, పనులను నాసిరకంగా చేయిస్తున్నాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం బీటీ పనుల్లో కూడా నాణ్యత, నిబంధనలు పాటించకుండా పనులన్నీ నాసిరకంగా చేయడంతో రోడ్డు పెచ్చులు, పెచ్చులుగా లేచిపోతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కోల్డ్‌మిక్చర్‌ పేరుతో నాసిరకం పనులు 
ఎస్సీ సబ్‌ప్లాన్‌ కింద రూ.50 లక్షల నిధులతో చేపట్టిన బీటీరోడ్డును కోల్డ్‌మిక్చర్‌ పేరుతో పనులన్నీ నాసిరకంగా చేస్తుండడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తారుకు(హాట్‌మిక్చర్‌) బదులుగా కంకరకు ఒక రకమైన ద్రావణాన్ని కలిపి ఎలాంటి యంత్రాలు లేకుండా కూలీలతో రోడ్డుపై పరిచి చేతులతో చదును చేయించి రోలింగ్‌ చేయించారు. దీంతో రోడ్డంతా ఎత్తు, పల్లాలుగా మారింది. రోడ్డు అంచులు దూది పిందెలు మాదిరి ఊడిపోతూ తేలికపాటి వాహనాలు వెళ్లినా బద్దలుగా పగిలిపోతోంది. రోడ్డు పనులను కళ్లరా చూస్తున్న గ్రామస్తులు ఆగ్రహంతో పనులను అడ్డుకున్నారు.

రోడ్డు వద్దని సంతకాలు పెట్టండి 
నిబంధనల ప్రకారం రోడ్డు పనులు చేయడం లేదని, రోడ్డంతా పెచ్చులుగా లేచిపోతుందని గ్రామస్తులంతా పనులను ఆపేశారు. దీంతో రోడ్డు అవసరం లేనట్లుగా గ్రామస్తులంతా సంతకాలు పెట్టాలని, ఇక్కడ కాకపోతే మరోచోట రోడ్డు వేయిస్తామని సైట్‌ ఇంజినీరు గ్రామస్తులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పనులు నాసిరకంగా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల నిబంధనల మేరకు కోల్డ్‌మిక్చర్‌తో పనులు చేయిస్తున్నట్లు ఆశాఖ అధికారులు చెబుతున్నారు. కోల్డ్‌మిక్చర్‌ వేసిన 72 గంటలకు గట్టిపడి రోడ్డు పటిష్టంగా మారుతుందని అధికారులు అంటున్నారు. అయితే 13 రోజులు పూర్తయినా రోడ్డు మాత్రం పటిష్టంగా మారకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా వ్యవసాయ పొలాలు ఉండడం వల్ల భవిష్యత్తులో ట్రాక్టర్లు, వరికోత యంత్రాలు ఈ మార్గంలో తిరుగుతాయి. అలాగే చెంబేడు, చెన్నప్పనాయుడుపేట, పునబాక, అర్ధమాల, అర్లపాడు, బంగారంపేట, నందిమాల, మోదుగులపాళెం, ఊడిపూడి తదితర గ్రామాల ప్రజలు మండల కేంద్రమైన పెళ్లకూరుకు చేరుకోవాలంటే ఈ మార్గం బాగా ఉపయోగకరం. అయితే  కోల్డ్‌మిక్చర్‌ పేరుతో నాసిరకంగా వేసిన రోడ్డు ఎంత కాలం ఉంటుందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

చవటకండ్రిగ రోడ్డుకు ప్రాథమిక దశ పనులు చేస్తుండగా జూన్‌ 3న టిప్పర్‌ అధిక లోడుతో కంకర తీసుకెళుతుండగా వ్యవసాయ కాలువపై నిర్మించిన వంతెన భారీ టన్నేజీ వల్ల కూలిపోయింది. కేవలం రైతుల సౌకర్యార్థం తేలికపాటి వాహనాల్లో ఎరువులు తదితర వ్యవసాయ పనిముట్లు తీసుకెళ్లేందుకు నిర్మించామని, భారీ వాహనాలు వెళ్లేందుకు కాదని ఇరిగేషన్‌ అధికారులు సంబంధిత లారీ యాజమాన్యంపై ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. అదేవిధంగా రోడ్డు పనులు చేయిస్తున్న అధికారులు సైతం కూలిపోయిన వంతెన విషయం పట్టించుకోకుండా వంతెనకు ఇరువైపులా బీటీరోడ్డు పనులు చేస్తుండడం గమనార్హం. తేలికపాటి వర్షానికే కాలువలో నీరు చేరుతుందని, వంతెన కూలిపోవడం వల్ల అత్యవసర సమయాల్లో కష్టాలు తప్పవని గ్రామస్తులు అంటున్నారు. కోల్డ్‌మిక్చర్‌ పేరుతో పనులను నాసిరకంగా చేపట్టి, కూలిన వంతెన పనులు పట్టించుకోకపోవడంపై కలెక్టర్‌ పనులపై పర్యవేక్షించి బీటీరోడ్డుతోపాటు వంతెన పనులు సక్రమంగా చేపట్టేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఆ శాఖ డీఈ చైతన్యకుమార్‌ని వివరణ కోరేందుకు ఫోన్‌ ద్వారా ప్రయత్నించగా స్పందించలేదు. 

అధికారులు పట్టించుకోవడం లేదు 
వ్యవసాయ కాలువపై నిర్మించిన వంతెన టిప్ప ర్‌ వెళ్లడం వల్ల కూలిపోయింది. వంతెన పనులు చేయకుండా కేవలం రోడ్డు పనులు పూర్తి చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఈ విషయంపై ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. – కన్నలి రోశయ్య, చవటకండ్రిగ గ్రామం

వర్షాకాలంలో కష్టాలు తప్పవు
వర్షా కాలంలో వరద ఉ ధృతి వల్ల వ్యవసాయ కా లువలో వరదనీరు అధి కంగా ప్రవహిస్తుంది. వరద ఉధృతి తగ్గే వరకు గ్రా మానికి రాకపోకలు ఉండవు. వ్యవసాయ కాలువపై కూలిపోయిన వంతెన పనులు చేపట్టకుండా వదిలేశారు. వర్షాకాలంలో కష్టాలు తప్పవు. – పసల శేఖర్, చవటకండ్రిగ గ్రామం

పనులన్నీ నాసిరకం
రోడ్డు పనులన్నీ నాసిరకంగా చేస్తున్నారు. గ్రామస్తులంతా కలిసి సిబ్బందిని ప్రశ్నిస్తే నిబంధనల ప్రకా రం వేస్తున్నామంటున్నారు. తేలికపాటి స్కూటర్‌ వెళ్లినా రోడ్డు లేచిపోతోంది. ఇంత అధ్వానంగా రోడ్డు పనులు ఎక్కడా చేపట్టి ఉండరు. మేమంతా అమాయకులైన దళితులం కాబట్టి అధికారులు, సిబ్బంది పట్టించుకోవడం లేదు.  – గంధం వెంకటయ్య, చవటకండ్రిగ గ్రామం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement