జిల్లా పరిషత్, న్యూస్‌లైన్: నిత్యం రద్దీగా ఉండే పరకాల-భూపాలపల్లి రోడ్డును దశల వారీగా అభివృద్ధి చేయూలని ప్రభుత్వం సంకల్పించింది. పరకాల నుంచి భూపాలపల్లి, కాటారం, మహదేవపూర్ మీదుగా పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం వరకు రహదారి అభివృద్ధికి మొదటి విడతగా ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో రూ 8 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో ముందుగా ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు పరకాల నుంచి భూపాలపల్లి రహదారిలోని 7/0నుంచి 27/0 వరకు రోడ్డును 5.5 మీటర్ల నుంచి 7 మీటర్ల వరకు వెడల్పు చేసేందుకు టెండర్లను ఆహ్వానించి ఖరారు చేశారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనులు మొదలుపెట్టాడు.
రోడ్డుకిరువైపులా మట్టితీసి కంకరచూర, మెటల్‌తో నింపాలి. అరుుతే నిర్దేశించిన ప్రమాణాలను పక్కనబెట్టి పనులు కొనసాగించాడు. మరోవైపు ఆర్థిక సంవత్సరం ముగుస్తుండంతో నిధులు మురిగిపోతాయని భావించిన కాంట్రాక్టర్... అధికారులతో కుమ్మక్కయ్యూడు. బీటీ వేయకుండానే మొత్తం రహదారి పనులు పూర్తయినట్లు మార్చి నెలలో ఎంబీ రికార్డు చేసి బిల్లులు పొందాడు. ఈ వ్యవహారంలో కాంట్రాక్టర్, అధికారులు పెద్ద ఎత్తున పంపకాలు చేసుకున్నట్లు సమాచారం.
క్యూసీ ధ్రువీకరణ లేకుండానే...
పనులు జరుగుతున్న సమయంలోనే క్వాలిటీ కంట్రోల్(క్యూసీ) అధికారులు తనిఖీలు నిర్వహించి నాణ్యత సర్టిఫికెట్ ఇవ్వాలి. ఆ తర్వాతనే బిల్లులను పీఏఓ చెల్లించాల్సి ఉంటుంది. అరుుతే కాంట్రాక్టర్ తన పలుకుబడిని ఉపయోగించి క్యూసీ ధ్రువీకరణ లేకుండానే బిల్లులు పొందినట్లు తెలిసింది. పనులు పూర్తయినట్లు తెలియడంతో ఈ ప్రాంతానికి చెందిన కొందరు దీనిపై క్వాలిటీ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేయగా.. రోడ్డు పనులకు సంబంధించిన రికార్డులందించాలని సబ్ డివిజన్ ఇంజినీర్లకు సూచించారు. అందుకు వారు స్పందించకపోవడంతో ఈ నెల మొదటి వారంలో మరోసారి కోరారు. అరుునా స్పందన లేకపోవడం.. ఈ విషయం వరంగల్ డివిజన్‌లో చర్చనీయాంశంగా మారడంతో క్యూసీ అధికారులు నేరుగా తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల క్రితం రహదారిపై చేపట్టిన పరిశీలనలో బీటీ వేయకుండానే సుమారు రూ కోటి వరకు బిల్లులు పొందినట్లు నిర్ధారణ అయింది. అంతేకాదు... ఈ రహదారిలో పలు చోట్ల బీటీ వేయలేదన్న విషయాలు వారి పరిశీలనలో తేలినట్లు సమాచారం. ఈ మేరకు ఉన్నతాధికారికి క్యూసీ అధికారులు నివేదిక అందజేసినట్లు తెలిసింది.
పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్...
పనులు చేయకుండానే బిల్లులు పొందినట్లు అధికారులకు ఫిర్యాదు అందడంతో సంబంధిత కాంట్రాక్టర్ బీటీ వేసేందుకు పనులు ప్రారంభించాడు. ఎప్పుడో రోడ్డును వెడల్పు చేయగా... ఇప్పుడు రోలింగ్ చేస్తుండడంతో ఆ ప్రాంతం వారు విస్తుపోతున్నారు. కాగా, ఈ రహదారిలో మొత్తం పనులు అసంపూర్తిగా ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం వేస్తున్న బీటీ కూడా నాణ్యత లేకుండా తూతూ మంత్రంగా వేస్తున్నా... పట్టించుకునే నాథుడే కరువయ్యారని స్థానికులు చెబుతున్నారు.
ఉన్నతాధికారి కనుసన్నల్లోనే...
ఆర్‌అండ్‌బీకి చెందిన ఉన్నతాధికారి కనుసన్నల్లోనే ఈ అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమాలను పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోకుండా కేవలం డిప్యూటేషన్‌పై పంపించడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. బీటీ వేయకుండా సుమారు రూ కోటికి పైగా బిల్లులు పొందిన విషయం బయటకు పొక్కడంతో సంబంధిత సబ్ డివిజన్‌కు చెందిన డీఈ, ఏఈ, జేఈలను మహబూబాబాద్ డివిజన్‌కు డిప్యూటేషన్‌పై పంపించినట్లు తెలిసింది. వారి స్థానంలో హన్మకొండ డీఈకి అదనపు బాధ్యతలు అప్పగించి, మరో ఇద్దరు ఇతర ప్రాంతాలకు చెందిన ఏఈలను పరకాల సబ్‌డివిజన్‌కు ఇన్‌చార్జ్‌లుగా నియమించినట్లు తెలిసింది. ఈ వ్యవహారంపై పరకాల ఇన్‌చార్జ్ డీఈ రామకృష్ణను సంప్రదించగా... పనులు పూర్తి కాలేదని, జరుగుతున్నాయని తెలిపారు.