సాక్షి, ఒంగోలు: అర్ధరాత్రి హైవేపై దొంగ–పోలీసు ఆట గమ్మత్తుగా సాగింది. ద్విచక్ర వాహనంపై దొంగలు, నాలుగు చక్రాల వాహనంలో పోలీసులు వెరసి రైట్ రూట్, రాంగ్‌రూట్‌లో సాగిన వేట ఒక వైపు భయం భయంగా మరో వైపు ఛాలెంజింగ్‌గా సాగింది. ఈ క్రమంలో దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ ఆటలో ఎట్టకేలకు పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు తప్పించుకున్నారు. ఈ సంఘటన స్థానిక ఒంగోలు–మేదరమెట్ల మధ్య జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
ఆగిన లారీలే లక్ష్యం
నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు మోటారు బైకుపై వేటకు బయల్దేరారు. వీరు కేవలం ఆగిన లారీలను టార్గెట్‌గా చేసుకొని అందులో ఉన్న సొత్తు కాజేయడం లక్ష్యం. ఈ క్రమంలోనే వీరు పలు వాహనాల్లో సొత్తు కాజేశారు. ఇలా వీరు జిల్లాలోని మేదరమెట్ల వరకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌కు ఇవతల పైపుల ఫ్యాక్టరీ సమీపంలో ఆగిన లారీలో సొత్తు కోసం తచ్చాడుతుండడాన్ని ఓ లారీ డ్రైవర్ గమనించాడు. అతను హైవేపై ఒంగోలు వైపు వెళ్తున్న పోలీస్ హైవే పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. మొత్తం ముగ్గురు యువకులు ఉన్నారని, వారంతా అనుమానాస్పదంగా ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు వాహనాన్ని వెనక్కు తిప్పారు. అదీ రాంగ్‌రూట్‌లో.
రెండు గంటలకుపైగా కొనసాగిన ఛేజింగ్
వాస్తవానికి మేదరమెట్ల వైపు నుంచి ఒంగోలు వైపునకు వాహనాలు హైవేకు తూర్పు మార్గంలో వస్తుంటాయి. నిందితులు అదే మార్గంలో ఉన్నట్లు లారీ డ్రైవర్ చెప్పడంతో నిందితులు తప్పించుకోకూడదనే ఉద్దేశంతో హైవే పెట్రోలింగ్ సిబ్బంది డేంజర్ సిగ్నల్స్ వేసుకుంటూ రాంగ్‌రూట్‌లో వేట ప్రారంభించారు. మద్దిపాడు సమీపంలో ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు వెళ్తున్నట్లు గమనించడం, వారు మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు అనుమానం రావడంతో వారిని ఆపేందుకు యత్నించారు. వారు పోలీసు వాహనాన్ని చూసి వేగంగా ముందుకు దూకించారు. పోలీసులు తమ వాహనాన్ని తిప్పుకొని వెంటాడారు.
ఏడుగుండ్లపాడు వద్దకు రాగానే నిందితులు మళ్లీ అదే రూట్లో మేదరమెట్ల వైపుకు మళ్లించారు. ఇలా మూడు నాలుగు సార్లు పోలీసులను ముప్పతిప్పలు పట్టించారు. పోలీసులకు వారిలో ఉన్న అనుమానం నిజమే అన్న భావన వ్యక్తమైంది. మళ్లీ వారు వెంటాడగా శ్రీ ప్రతిభ డిగ్రీ కాలేజీ సమీపంలోని ఒక పొగాకు కంపెనీ వద్ద హైవే ఫెన్సింగ్‌కు తమ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ముగ్గురు యువకులు పలాయనం చిత్తగించారు. ఓ యువకుడు పొగాకు గోడౌన్ గేటు దూకి తప్పించుకునేందుకు చేసిన యత్నించాడు. పోలీసులు సైతం గేటు దూకి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
నిందితుల గుట్టురట్టు
నిందితుడు పోలీసుల ఎదుట నోరు విప్పాడు. హైవేపై ఆగి ఉన్న లారీల్లో సొత్తు కాజేయడమే లక్ష్యంగా నెల్లూరు జిల్లా నుంచి బయల్దేరినట్లు అంగీకరించాడు. ముగ్గురిలో ఒకరు లారీ వెనుక భాగంలో పరిశీలిస్తుంటే రెండో వ్యక్తి లారీ ముందు భాగంలో ఉంటూ సూచనలు చేస్తుంటాడు. మూడో వ్యక్తి లారీ క్యాబిన్‌లోకి ఎక్కి సొత్తు కాజేస్తుంటామని పేర్కొన్నారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనం చోరీ చేసిందిగా భావిస్తున్నారు.
అసలు నంబర్‌కు బదులు దొంగ స్టిక్కర్ అంటించి నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక నిందితుని వద్ద ఉన్న రూ.39 వేలకుపైగా నగదు ఎక్కడెక్కడ చోరీ చేశారన్న సమాచారం పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పారిపోయిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బృందాలుగా విడిపోయి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వారు కూడా పట్టుబడితేగానీ అసలు వీరు ఎప్పటి నుంచి నేరాలకు పాల్పడుతున్నారు.. ఇప్పటికి ఎన్ని నేరాలు చేశారు.. తదితర వివరాల గుట్టు వెల్లడయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment