petroling vehicle
-
ఇద్దరు చిన్నారులు దుర్మరణం..
-
ఇద్దరు చిన్నారులు దుర్మరణం..
సాక్షి, హైదరాబాద్ : నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు స్థానికంగా విషాదాన్ని నింపాయి. మంగళ్‌హాట్, చాంద్రాయణగుట్టలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మూడేళ్ల మరుయం, అయిదేళ్ల హర్షవర్థన్ మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. సీతారాం బాగ్ చౌరస్తా వద్ద హర్షవర్ధన్ అనే అయిదేళ్ల బాలుడిని పెట్రోలింగ్ వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో గాయపడిన బాలుడిని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పెట్రోలింగ్ వాహనం డ్రైవర్ భగవాన్ రెడ్డి పై చర్యలు తీసుకుంటామని సీఐ రంవీర్ రెడ్డి తెలిపారు. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిపై ఆరా తీశారు. (రోడ్డు ప్రమాదాలు తగ్గితే ఊహించని స్థాయిలో..) నిర్లక్ష్యం ఖరీదు ఓ పసి బాలిక మృతి.. మరోవైపు హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మిల్లత్ నగర్ వద్ద ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన మూడేళ్ల మరుయం అనే బాలిక టిప్పర్ టైర్ల కింద పడి నుజ్జునుజ్జయింది. సమాచారం తెలుసుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పాప మృత దేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో స్థానికులు తీవ్ర కోపోద్రిక్తులు అవుతున్నారు. (ఘోర ప్రమాదం; గర్భిణి సహా ఏడుగురు మృతి) -
ఇంటికి వెళ్తే.. కొత్త సమస్యలొస్తున్నాయ్!
సాక్షి, సిటీబ్యూరో: ఈ ఏడాది నుంచి నగర పోలీసు విభాగం ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. బాధితులు పోలీసుస్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా గస్తీ సిబ్బందికే ఫిర్యాదులు ఇచ్చేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇలా చేస్తుండటం వల్ల కొన్ని కొత్త సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కేసుల విచారణపై ప్రభావం, గస్తీ సిబ్బందిపై పని భారంతో పాటు ఠాణాల ఆధునికీకరణ, రిసెప్షన్ల ఏర్పాటు స్ఫూర్తి దెబ్బతింటోందని వ్యాఖ్యానిస్తున్నారు. నగర పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఇంటి వద్దే ఫిర్యాదు స్వీకరించే విధానం విజయవంతమైనట్లు పేర్కొంటున్నారు. కేసుకు ‘పునాది’ ఫిర్యాదే.. ఏ కేసు అయినా ఫిర్యాదు ఆధారంగానే నమోదవుతోంది. దానిపైనే కేసు డైరీలు, అభియోపత్రాలు సైతం రూపొందుతాయి. అంతటి కీలకమైన ఫిర్యాదు ఎంత పటిష్టంగా ఉండే బాధితులకు అంత లాభం. అనేక మంది బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు సవివరంగా చెప్పగలిగినా.. ఆ స్థాయిలో రాసి ఇవ్వలేరు. ఇలాంటి సందర్భాల్లో వాళ్లు ఠాణాకు వచ్చినట్లైతే ఏ జరిగిందో పూర్తిస్థాయిలో వినే సీనియర్ రైటర్లు, ఎస్సైలు, అవసరమైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా వ్యహరించే ఇన్స్పెక్టర్లు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ ఫిర్యాదు పకడ్బందీగా తయారు చేయడానికి సహకరిస్తాయి. గస్తీ సిబ్బందిలో అత్యధికులు కొత్త కానిస్టేబుళ్లు ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఈ అంశాలపై పట్టులేకపోవడం, బాధితులు అంత పక్కాగా ఫిర్యాదు రాసి ఇవ్వలేకపోతున్నారు. దీని ప్రభావం ఇప్పుడు కేసు నమోదుపై లేకపోయినా.. భవిష్యత్తులో కేసు విచారణ సందర్భంలో కచ్చితంగా ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆ నేరాలకు ఎప్పటి నుంచో... ప్రస్తుతం ఉన్నతాధికారులు అన్ని రకాలైన ఫిర్యాదుల్నీ ఇంటి వద్దే స్వీకరించాలని చెబుతున్నారు. ఈ విధానంలో ఠాణాలవారీగా ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? అనేది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. దీంతో కొందరు ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితుల్ని సైతం ఇంటికి వెళ్లమని చెప్పి, గస్తీ సిబ్బందిని పంపిస్తున్నారు. ఈ కొత్త విధానం ఇప్పటికే పెట్రోలింగ్, డయల్– 100 కాల్స్ విజిట్, నేరగాళ్ల ఇళ్లకు వెళ్లి పరిశీలన... ఇలా తలకుమించిన భారంతో పని చేస్తున్న గస్తీ సిబ్బందిపై అదనపు ఒత్తిడికి కారణం అవుతోంది. హత్య, ఆత్మహత్య, హత్యాయత్నం, చోరీ వంటి కేసుల్లో నేర స్థలికి వెళ్లిన పోలీసులు అక్కడే ఫిర్యాదు స్వీకరించే విధానం కొన్నేళ్లుగా అమలులో ఉంది. దీనికి అదనంగా ప్రస్తుతం అన్ని రకాలైన కేసులు అంటూ చెబుతున్న ఉన్నతాధికారులు కొత్త తలనొప్పులకు కారణమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగర కమిషనరేట్ పరిధిలో దాదాపు ఇలాంటి ప్రయోగమే గతంలో జరిగింది. పోలీసుస్టేషన్లలో కాకుండా ఏరియాల వారీగా ఫిర్యాదులు స్వీకరించడానికి సబ్– కంట్రోళ్లు ఏర్పాటు చేశారు. వీటి కోసం భారీగా ఖర్చు చేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. గరిష్టంగా రెండేళ్లు కూడా పని చేయకుండానే ఇది మూలనపడి, నిర్మాణాలు వృథాగా మారాయి. రూ.కోట్ల వెచ్చించింది ఎందుకు? రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే బాధితులకు మెరుగైన సేవలు అందించడానికి పోలీసు విభాగం పెద్ద పీట వేస్తూ వచ్చింది. ఇందులో భాగంగానే ప్రతి పోలీసుస్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ప్రత్యేకంగా రిసెప్షన్లకు రూపం ఇచ్చి, అక్కడ పని చేసే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. ఠాణాకు వచ్చిన బాధితులకు మంచి వాతావరణం కల్పించడం, వారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవడం, సత్వర సేవలు అందించడం కోసమే వీటికి భారీగా నిధులు సైతం ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇప్పుడు అసలు బాధితుడు ఠాణాకే రాకుండా చేసేస్తే వారికి పోలీసుస్టేషన్లు, అక్కడి అధికారులపై సదభిప్రాయం కగిలే ఆస్కారం.. సత్సంబంధాలు ఏర్పరుచుకునే అవకాశం ఉండదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంటికి వెళ్లి ఫిర్యాదులు స్వీకరించే విధానంలో ప్రస్తుతం లాభాలు కనిపిస్తున్నా.. భవిష్యత్తులో బాధితులకు ఎన్నో నష్టాలు ఉంటాయని పేర్కొంటున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్ అంజనీకుమార్ ఈ విధానంపై మాట్లాడుతూ మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. జనవరి 1 నుంచి దీన్ని మొదలుపెట్టామని, ప్రతి రోజూ సిటీ పోలీసు విభాగానికి 25 నుంచి 30 ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వీటిని గస్తీ సిబ్బంది స్వీకరిస్తున్నారని, వాటి ఆధారంగా 2–3 కేసులు నమోదవుతున్నట్లు వివరించారు. -
సీఆర్పీఎఫ్ జవాన్లపై గ్రెనేడ్లతో ఉగ్రదాడి
శ్రీనగర్ : శ్రీనగర్‌లోని కవ్‌దారా ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులు రెచ్చిపోయారు. సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని వారు ప్రయాణిస్తున్న పెట్రోలింగ్ వాహనాలపై గ్రెనేడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడగా వారు ప్రయాణిస్తున్న వాహనాలు పూర్తిగా ద్వంసమయ్యాయి. అయితే ఈ దాడులు సీఆర్పీఎఫ్ జవాన్లను లక్ష్యంగా చేసుకొని గ్రెనేడ్లతో దాడులకు పాల్పడినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఘటన జరిగిన ప్రాంతాన్ని అధికారులు తమ ఆధీనంలోకి తీసుకొని ఉగ్రవాదులు కదలికలను గుర్తించేందుకు పరిశోధన నిర్వహిస్తున్నారు. అయితే ఈ దాడిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అర్ధరాత్రి హైవేపై దొంగలు
సాక్షి, ఒంగోలు: అర్ధరాత్రి హైవేపై దొంగ–పోలీసు ఆట గమ్మత్తుగా సాగింది. ద్విచక్ర వాహనంపై దొంగలు, నాలుగు చక్రాల వాహనంలో పోలీసులు వెరసి రైట్ రూట్, రాంగ్రూట్లో సాగిన వేట ఒక వైపు భయం భయంగా మరో వైపు ఛాలెంజింగ్‌గా సాగింది. ఈ క్రమంలో దాదాపు రెండు గంటలపాటు సాగిన ఈ ఆటలో ఎట్టకేలకు పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోగా మరో ఇద్దరు తప్పించుకున్నారు. ఈ సంఘటన స్థానిక ఒంగోలు–మేదరమెట్ల మధ్య జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఆగిన లారీలే లక్ష్యం నెల్లూరు జిల్లాకు చెందిన ముగ్గురు యువకులు మోటారు బైకుపై వేటకు బయల్దేరారు. వీరు కేవలం ఆగిన లారీలను టార్గెట్‌గా చేసుకొని అందులో ఉన్న సొత్తు కాజేయడం లక్ష్యం. ఈ క్రమంలోనే వీరు పలు వాహనాల్లో సొత్తు కాజేశారు. ఇలా వీరు జిల్లాలోని మేదరమెట్ల వరకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి వస్తూ గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్‌కు ఇవతల పైపుల ఫ్యాక్టరీ సమీపంలో ఆగిన లారీలో సొత్తు కోసం తచ్చాడుతుండడాన్ని ఓ లారీ డ్రైవర్ గమనించాడు. అతను హైవేపై ఒంగోలు వైపు వెళ్తున్న పోలీస్ హైవే పెట్రోలింగ్ సిబ్బందికి సమాచారం ఇచ్చాడు. మొత్తం ముగ్గురు యువకులు ఉన్నారని, వారంతా అనుమానాస్పదంగా ఉన్నట్లు పేర్కొన్నారు. పోలీసులు వాహనాన్ని వెనక్కు తిప్పారు. అదీ రాంగ్రూట్లో. రెండు గంటలకుపైగా కొనసాగిన ఛేజింగ్ వాస్తవానికి మేదరమెట్ల వైపు నుంచి ఒంగోలు వైపునకు వాహనాలు హైవేకు తూర్పు మార్గంలో వస్తుంటాయి. నిందితులు అదే మార్గంలో ఉన్నట్లు లారీ డ్రైవర్ చెప్పడంతో నిందితులు తప్పించుకోకూడదనే ఉద్దేశంతో హైవే పెట్రోలింగ్ సిబ్బంది డేంజర్ సిగ్నల్స్ వేసుకుంటూ రాంగ్రూట్లో వేట ప్రారంభించారు. మద్దిపాడు సమీపంలో ద్విచక్ర వాహనంపై ముగ్గురు యువకులు వెళ్తున్నట్లు గమనించడం, వారు మద్యం తాగి వాహనం నడుపుతున్నట్లు అనుమానం రావడంతో వారిని ఆపేందుకు యత్నించారు. వారు పోలీసు వాహనాన్ని చూసి వేగంగా ముందుకు దూకించారు. పోలీసులు తమ వాహనాన్ని తిప్పుకొని వెంటాడారు. ఏడుగుండ్లపాడు వద్దకు రాగానే నిందితులు మళ్లీ అదే రూట్లో మేదరమెట్ల వైపుకు మళ్లించారు. ఇలా మూడు నాలుగు సార్లు పోలీసులను ముప్పతిప్పలు పట్టించారు. పోలీసులకు వారిలో ఉన్న అనుమానం నిజమే అన్న భావన వ్యక్తమైంది. మళ్లీ వారు వెంటాడగా శ్రీ ప్రతిభ డిగ్రీ కాలేజీ సమీపంలోని ఒక పొగాకు కంపెనీ వద్ద హైవే ఫెన్సింగ్‌కు తమ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టి ముగ్గురు యువకులు పలాయనం చిత్తగించారు. ఓ యువకుడు పొగాకు గోడౌన్ గేటు దూకి తప్పించుకునేందుకు చేసిన యత్నించాడు. పోలీసులు సైతం గేటు దూకి యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల గుట్టురట్టు నిందితుడు పోలీసుల ఎదుట నోరు విప్పాడు. హైవేపై ఆగి ఉన్న లారీల్లో సొత్తు కాజేయడమే లక్ష్యంగా నెల్లూరు జిల్లా నుంచి బయల్దేరినట్లు అంగీకరించాడు. ముగ్గురిలో ఒకరు లారీ వెనుక భాగంలో పరిశీలిస్తుంటే రెండో వ్యక్తి లారీ ముందు భాగంలో ఉంటూ సూచనలు చేస్తుంటాడు. మూడో వ్యక్తి లారీ క్యాబిన్లోకి ఎక్కి సొత్తు కాజేస్తుంటామని పేర్కొన్నారు. నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనం చోరీ చేసిందిగా భావిస్తున్నారు. అసలు నంబర్‌కు బదులు దొంగ స్టిక్కర్ అంటించి నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఇక నిందితుని వద్ద ఉన్న రూ.39 వేలకుపైగా నగదు ఎక్కడెక్కడ చోరీ చేశారన్న సమాచారం పోలీసులు గుర్తించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పారిపోయిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బృందాలుగా విడిపోయి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. వారు కూడా పట్టుబడితేగానీ అసలు వీరు ఎప్పటి నుంచి నేరాలకు పాల్పడుతున్నారు.. ఇప్పటికి ఎన్ని నేరాలు చేశారు.. తదితర వివరాల గుట్టు వెల్లడయ్యే అవకాశం ఉంది. -
ఈద్ రోజూ హింసే!
శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో రంజాన్ పండుగరోజైన శనివారం కూడా కాల్పుల మోత మోగింది. రాజౌరీ జిల్లాలో నియంత్రణ రేఖ వద్ద ఆర్మీ పెట్రోలింగ్ వాహనంపై పాకిస్తానీ సైనికులు జరిపిన కాల్పుల్లో మణిపూర్‌కు చెందిన వికాస్ గురుంగ్ (21) అనే ఆర్మీ జవాన్ మరణించాడు. నియంత్రణ రేఖకు 700 మీటర్ల దూరంలో నౌషెరా సెక్టార్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా పాకిస్తాన్ సైన్యం విచక్షణా రహితంగా కాల్పులకు దిగింది. అనంతనాగ్ జిల్లాలోని బ్రకపొరా గ్రామంలో నిరసన కారులకు, భద్రతా దళాలకు మధ్య ఘర్షణ జరుగుతుండగా గ్రెనేడ్ పేలి ఓ వ్యక్తి చనిపోయాడు. శ్రీనగర్ శివారు ప్రాంతంలోనూ దుండగులు జరిపిన కాల్పుల్లో సీఆర్పీఎఫ్ జవాన్ దినేశ్ పాశ్వాన్ గాయపడగా సైనిక వైద్యశాలలో చికిత్స అందిస్తున్నారు. శ్రీనగర్ నగరంలోని సఫకదల్ ప్రాంతంలో ఘర్షణల్లో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ఉత్తర కశ్మీర్‌లోని సోపోర్, కుప్వారా ప్రాంతాల్లోనూ భద్రతా దళాలతో నిరసనకారులు ఘర్షణలకు దిగారనీ, అయితే కశ్మీర్ లోయ ప్రాంతంలో మాత్రం ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులూ లేవని ఓ పోలీస్ అధికారి చెప్పారు. మిఠాయిల కార్యక్రమం రద్దు సాధారణంగా పండుగ రోజున భారత సైనికులు, పాకిస్తాన్ జవాన్లు మిఠాయిలు ఇచ్చిపుచ్చుకునేవారు. అయితే కాల్పుల ఘటనల కారణంగా శనివారం భారత సైనికులు ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. భారత్ వైపు నుంచి ఎలాంటి కవ్వింపు చర్యలూ లేకపోయినప్పటికీ పండుగరోజున కూడా పాకిస్తానీ సైనికులు కాల్పులు జరపడం నీతిమాలిన చర్యని ఓ ఆర్మీ అధికారి వ్యాఖ్యానించారు. పాక్ జవాన్లు రెచ్చగొట్టే చర్యలకు దిగినప్పటికీ భారత సైనికులు సంయమనం పాటించి విసిగిపోయిన అనంతరం ఎదురుకాల్పులకు దిగారన్నారు. బయటకొచ్చిన ఔరంగజేబు వీడియో ఆర్మీ జవాను ఔరంగజేబును గురువారం ఉదయం ఉగ్రవాదులు అపహరించి చంపివేయడం తెలిసిందే. ఔరంగజేబును చంపేందుకు కొద్దిసేపటి ముందు తీసినట్లుగా చెబుతున్న వీడియో ఒకటి శనివారం బయటకు వచ్చింది. హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు ఔరంగజేబును చంపడానికి ముందు ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగారు. ఔరంగజేబు విధులేంటి?, ఎక్కడెక్కడ పనిచేశాడు? తదితరాల గురించి ఉగ్రవాదులు ప్రశ్నించారు. -
పెట్రోలింగ్ వ్యాన్ వద్దకే మద్యం
సాక్షి, అమీర్‌పేట: మండుతున్న ఎండలతో పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న ఎస్ఆర్నగర్ పోలీసులకు దప్పికేసినట్లుంది. ఇంత ఎండలో నీళ్లు తాగితే దాహం తీరదని భావించారో ఏమో.. ఏకంగా వైన్స్ షాపు వద్ద వాహనాన్ని ఆపివేశారు. పోలీస్ యూనిఫాంలో మద్యం షాపునకు వెళితే బాగుండదని భావించి షాపు యజమానికి ఆర్డర్ వేశారు. ఎవరికీ అనుమానం రాకుండా వైన్స్ షాపు సిబ్బంది నల్లటి బ్యాగులో మద్యం సీసాలను తీసుకొని వచ్చి పెట్రో వాహనంలో ఉన్న పోలీసులకు ఇచ్చి వెళ్లిపోయాడు. ఎస్ఆర్నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మధురానగర్ సోని మెట్రోవైన్స్ నుంచి పోలీసులు డబ్బులు ఇవ్వకుండానే మద్యం తీసుకెళ్తుండడాన్ని గుర్తించిన కొందరు యువకులు దీనిని వీడియో రికార్డు చేశారు. సామాజిక మాద్యమంలో ఈ విషయం హల్చల్ చేయడంతో దర్యాప్తు చేపట్టిన ఉన్నతాధికారులు పెట్రో వ్యాన్‌లో ఉన్న కానిస్టేబుల్ సురేష్, హోంగార్డు చైతన్య మద్యం తీసుకుని వెళ్లినట్లు నిర్ధారించారు. ఈ విషయమై వారిని కోరేందుకు వెళ్లగా ఆ పెట్రో వాహనం తమది కాదని బుకాయించారు. సీసీ కెమెరాలను పరిశీలించి వాహనాన్ని గుర్తిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు. చార్జి మెమోజారీ పెట్రో వాహనంలో మద్యం బాటిళ్లు తీసుకెళ్లిన సంఘటనపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ ఇన్స్పెక్టర్ వహిదుద్దీన్‌కు సోమవారం చార్జి మెమో జారీ చేశారని పంజగుట్ట ఏసీపీ విజయ్‌కుమార్ తెలిపారు. వాహనంలో కానిస్టేబుల్ సురేష్, హోంగార్డు చైతన్య ఉన్నారని, చైతన్య మద్యం తెప్పించాడన్నారు. ఈ నెల 9న చైతన్య చెల్లి పెళ్లి ఉన్నందున ఒక ఫుల్ బాటిల్, మరో ఆఫ్ బాటిల్ కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిందన్నారు. యునిఫాంలో ఉన్నందున వైన్స్‌షాపు సమీపంలోని తోపుడుబండి నిర్వాహకుడి ద్వారా మద్యం తెప్పించుకున్నట్లు తెలిపారు. -
25 కి.మీ.లకు హైవే పెట్రోలింగ్ వాహనం
డీజీపీ సాంబశివరావు వెల్లడి కాకినాడ సిటీ : జాతీయ రహదారుల్లో ప్రతి 25 కి.మీ.లకు ఓ హైవే పోలీసు పెట్రోలింగ్ వాహనం ఉండేలా చర్యలు తీసుకుంటామని డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం కాకినాడలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. అలాగే నూతనంగా నిర్మించిన పోలీసు కల్యాణ మండపాన్ని సందర్శించారు. అనంతరం పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైవేల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైవే పెట్రోలింగ్ వాహనాలు తక్కువగా ఉన్నాయని, వాటిని పెంచడం ద్వారా ప్రమాద స్థలికి త్వరితగతిన చేరుకుని, సహాయక చర్యలు చేపట్టేలా చూస్తామని వివరించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పోలీసు సిబ్బంది టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో మమేకమై వారితో సత్సంబంధాలు మరింత పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సిబ్బందికి హెల్త్ చెకప్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవిప్రకాష్, అడిషనల్ ఎస్పీ దామోదర్, ఓఎస్డీ రవిశంకర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలీసు అసోసియేషన్ నాయకులు బలరామ్, బ్రహ్మాజీ పాల్గొన్నారు. ఆర్టీసీ డిపో సందర్శన: డీజీపీ, ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ సాంబశివరావు కాకినాడ ఆర్టీసీ డిపోను సందర్శించారు. నూతనంగా ప్రారంభించిన పార్శిల్ సర్వీస్ విధానాన్ని పరిశీలించారు. పలువురు ప్రయాణికులతో సౌకర్యాలపై ఆరా తీశారు. విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ, జిల్లా రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఆర్వీఎస్ నాగేశ్వరరావు, డిపో మేనేజర్ టీవీఎస్ సుధాకర్ పాల్గొన్నారు.