25 కి.మీ.లకు హైవే పెట్రోలింగ్ వాహనం
-
డీజీపీ సాంబశివరావు వెల్లడి
కాకినాడ సిటీ :
జాతీయ రహదారుల్లో ప్రతి 25 కి.మీ.లకు ఓ హైవే పోలీసు పెట్రోలింగ్ వాహనం ఉండేలా చర్యలు తీసుకుంటామని డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన శనివారం కాకినాడలోని ఎస్పీ కార్యాలయ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న జిల్లా పోలీసు కార్యాలయ భవనాన్ని పరిశీలించారు. అలాగే నూతనంగా నిర్మించిన పోలీసు కల్యాణ మండపాన్ని సందర్శించారు. అనంతరం పోలీసు అధికారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హైవేల్లో ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం హైవే పెట్రోలింగ్ వాహనాలు తక్కువగా ఉన్నాయని, వాటిని పెంచడం ద్వారా ప్రమాద స్థలికి త్వరితగతిన చేరుకుని, సహాయక చర్యలు చేపట్టేలా చూస్తామని వివరించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో పోలీసు సిబ్బంది టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలతో మమేకమై వారితో సత్సంబంధాలు మరింత పెంచుకోవాలని సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సిబ్బందికి హెల్త్ చెకప్ చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రవిప్రకాష్, అడిషనల్ ఎస్పీ దామోదర్, ఓఎస్‌డీ రవిశంకర్‌రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, పోలీసు అసోసియేషన్ నాయకులు బలరామ్, బ్రహ్మాజీ పాల్గొన్నారు.
ఆర్టీసీ డిపో సందర్శన: డీజీపీ, ఆర్టీసీ ఇన్‌చార్జి ఎండీ సాంబశివరావు కాకినాడ ఆర్టీసీ డిపోను సందర్శించారు. నూతనంగా ప్రారంభించిన పార్శిల్ సర్వీస్ విధానాన్ని పరిశీలించారు. పలువురు ప్రయాణికులతో సౌకర్యాలపై ఆరా తీశారు. విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.రామకృష్ణ, జిల్లా రీజనల్ మేనేజర్ చింతా రవికుమార్, డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ ఆర్‌వీఎస్ నాగేశ్వరరావు, డిపో మేనేజర్ టీవీఎస్ సుధాకర్ పాల్గొన్నారు.