ఇంటికి వెళ్తే.. కొత్త సమస్యలొస్తున్నాయ్‌! | Hyderabad Police Suffering With Night time Petroling Complaints | Sakshi
Sakshi News home page

ఇంటికి వెళ్తే.. కొత్త సమస్యలొస్తున్నాయ్‌!

Published Thu, Jan 30 2020 7:59 AM | Last Updated on Thu, Jan 30 2020 7:59 AM

Hyderabad Police Suffering With Night time Petroling Complaints - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఈ ఏడాది నుంచి నగర పోలీసు విభాగం ఓ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. బాధితులు పోలీసుస్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా గస్తీ సిబ్బందికే ఫిర్యాదులు ఇచ్చేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇలా చేస్తుండటం వల్ల కొన్ని కొత్త సమస్యలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. కేసుల విచారణపై ప్రభావం, గస్తీ సిబ్బందిపై పని భారంతో పాటు ఠాణాల ఆధునికీకరణ, రిసెప్షన్ల ఏర్పాటు స్ఫూర్తి దెబ్బతింటోందని వ్యాఖ్యానిస్తున్నారు. నగర పోలీసు ఉన్నతాధికారులు మాత్రం ఇంటి వద్దే ఫిర్యాదు స్వీకరించే విధానం విజయవంతమైనట్లు పేర్కొంటున్నారు. 

కేసుకు ‘పునాది’ ఫిర్యాదే..
ఏ కేసు అయినా ఫిర్యాదు ఆధారంగానే నమోదవుతోంది. దానిపైనే కేసు డైరీలు, అభియోపత్రాలు సైతం రూపొందుతాయి. అంతటి కీలకమైన ఫిర్యాదు ఎంత పటిష్టంగా ఉండే బాధితులకు అంత లాభం. అనేక మంది బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని పోలీసులకు సవివరంగా చెప్పగలిగినా.. ఆ స్థాయిలో రాసి ఇవ్వలేరు. ఇలాంటి సందర్భాల్లో వాళ్లు ఠాణాకు వచ్చినట్‌లైతే ఏ జరిగిందో పూర్తిస్థాయిలో వినే సీనియర్‌ రైటర్లు, ఎస్సైలు, అవసరమైతే స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా వ్యహరించే ఇన్‌స్పెక్టర్లు తగిన సలహాలు, సూచనలు ఇస్తూ ఫిర్యాదు పకడ్బందీగా తయారు చేయడానికి సహకరిస్తాయి. గస్తీ సిబ్బందిలో అత్యధికులు కొత్త కానిస్టేబుళ్లు ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి ఈ అంశాలపై పట్టులేకపోవడం, బాధితులు అంత పక్కాగా ఫిర్యాదు రాసి ఇవ్వలేకపోతున్నారు. దీని ప్రభావం ఇప్పుడు కేసు నమోదుపై లేకపోయినా.. భవిష్యత్తులో కేసు విచారణ సందర్భంలో కచ్చితంగా ఉంటుందని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 

ఆ నేరాలకు ఎప్పటి నుంచో...
ప్రస్తుతం ఉన్నతాధికారులు అన్ని రకాలైన ఫిర్యాదుల్నీ ఇంటి వద్దే స్వీకరించాలని చెబుతున్నారు. ఈ విధానంలో ఠాణాలవారీగా ఎన్ని కేసులు నమోదవుతున్నాయి? అనేది ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. దీంతో కొందరు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు పోలీసుస్టేషన్‌కు వచ్చిన బాధితుల్ని సైతం ఇంటికి వెళ్లమని చెప్పి, గస్తీ సిబ్బందిని పంపిస్తున్నారు. ఈ కొత్త విధానం ఇప్పటికే పెట్రోలింగ్, డయల్‌– 100 కాల్స్‌ విజిట్, నేరగాళ్ల ఇళ్లకు వెళ్లి పరిశీలన... ఇలా తలకుమించిన భారంతో పని చేస్తున్న గస్తీ సిబ్బందిపై అదనపు ఒత్తిడికి కారణం అవుతోంది. హత్య, ఆత్మహత్య, హత్యాయత్నం, చోరీ వంటి కేసుల్లో నేర స్థలికి వెళ్లిన పోలీసులు అక్కడే ఫిర్యాదు స్వీకరించే విధానం కొన్నేళ్లుగా అమలులో ఉంది. దీనికి అదనంగా ప్రస్తుతం అన్ని రకాలైన కేసులు అంటూ చెబుతున్న ఉన్నతాధికారులు కొత్త తలనొప్పులకు కారణమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నగర కమిషనరేట్‌ పరిధిలో దాదాపు ఇలాంటి ప్రయోగమే గతంలో జరిగింది. పోలీసుస్టేషన్లలో కాకుండా ఏరియాల వారీగా ఫిర్యాదులు స్వీకరించడానికి సబ్‌– కంట్రోళ్లు ఏర్పాటు చేశారు. వీటి కోసం భారీగా ఖర్చు చేసి మరీ నిర్మాణాలు చేపట్టారు. గరిష్టంగా రెండేళ్లు కూడా పని చేయకుండానే ఇది మూలనపడి, నిర్మాణాలు వృథాగా మారాయి.  

రూ.కోట్ల వెచ్చించింది ఎందుకు?
రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచే బాధితులకు మెరుగైన సేవలు అందించడానికి పోలీసు విభాగం పెద్ద పీట వేస్తూ వచ్చింది. ఇందులో భాగంగానే ప్రతి పోలీసుస్టేషన్‌ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ప్రత్యేకంగా రిసెప్షన్లకు రూపం ఇచ్చి, అక్కడ పని చేసే సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలను చేపట్టింది. ఠాణాకు వచ్చిన బాధితులకు మంచి వాతావరణం కల్పించడం, వారితో మర్యాదపూర్వకంగా నడుచుకోవడం, సత్వర సేవలు అందించడం కోసమే వీటికి భారీగా నిధులు సైతం ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇప్పుడు అసలు బాధితుడు ఠాణాకే రాకుండా చేసేస్తే వారికి పోలీసుస్టేషన్లు, అక్కడి అధికారులపై సదభిప్రాయం కగిలే ఆస్కారం.. సత్సంబంధాలు ఏర్పరుచుకునే అవకాశం ఉండదని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంటికి వెళ్లి ఫిర్యాదులు స్వీకరించే విధానంలో ప్రస్తుతం లాభాలు కనిపిస్తున్నా.. భవిష్యత్తులో బాధితులకు ఎన్నో నష్టాలు ఉంటాయని పేర్కొంటున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్‌ అంజనీకుమార్‌ ఈ విధానంపై మాట్లాడుతూ మంచి ఫలితాలు ఇస్తోందన్నారు. జనవరి 1 నుంచి దీన్ని మొదలుపెట్టామని, ప్రతి రోజూ సిటీ పోలీసు విభాగానికి 25 నుంచి 30 ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. వీటిని గస్తీ సిబ్బంది స్వీకరిస్తున్నారని, వాటి ఆధారంగా 2–3 కేసులు నమోదవుతున్నట్లు వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement