గుంటూరు : రైల్వే ప్రయాణికులను దోపిడీ దొంగలు బెంబేలు ఎత్తిస్తున్నారు. రైలు ప్రయాణం అంటేనే ప్రయాణికులు భయపడేలా చేస్తున్నారు. తాజాగా దుండగులు మరోసారి విజృంభించారు. చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చెన్నై ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగలు ఈరోజు తెల్లవారుజామున బీభత్సం సృష్టించారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వద్ద చైన్ లాగి ప్రయాణికులను దోచుకున్నారు. ఎస్-7, 9, 10 బోగిల్లోని ప్రయాణికులను కత్తులతో బెదిరించి ఈ దొంగతనానికి పాల్పడ్డారు.
నిద్ర మత్తులో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోపే వారి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. ప్రయాణికుల నుంచి సుమారు 30 తులాల బంగారు ఆభరణాలను దోచుకు వెళ్లారు. రైలు సికింద్రాబాద్ చేరుకోగానే ఈ ఘటనపై భాదితులు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఈ మార్గంలో తరచు దొంగలు దోపిడీలకు పాల్పడటంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికులకు భద్రత కల్పించటంలో రైల్వే పోలీసులు విఫలం అవుతున్నారంటూ ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చెన్నై ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగల బీభత్సం
Published Thu, May 29 2014 8:57 AM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM
Advertisement
Advertisement