భారీ ఎత్తున చోరీ
ఆరు కిలోల బంగారం..రూ. 13 లక్షల నగదు అపహరణ
జహీరాబాద్‌లో ఘటన
సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఎస్పీ
హైదరాబాద్‌లో పట్టుబడ్డ దొంగ?
జహీరాబాద్, న్యూస్‌లైన్ :
పట్టణంలోని పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలో ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కార్యాలయంలో ఆదివారం రాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు ఆరు కిలోల బంగారం, రూ. 13 లక్షల నగదును దొంగలు అపహరించుకుపోయినట్లు సమాచారం. అయితే ఎంత మేర బంగారం చోరీ అయిన విషయాన్ని కార్యాలయ అధికారులు, పోలీసులు నిర్ధారించలేదు. సంగారెడ్డి డీఎస్పీ వెంకటేష్, ముత్తూట్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరన్ కథనం మేరకు.. ఆదివారం రాత్రి గుర్తు తెలియని దొంగలు ఫైనాన్స్ వెనుక భాగంలో ఉన్న డోర్‌ను తొలగించుకుని ప్రాంగణంలోకి ప్రవేశించారు. అనంతరం లోపలకు వెళ్లేందుకు వీలుగా కిటీకీ చువ్వల తొలగించారు. అనంతరం గదిలోని సీసీ కెమెరాల కనెక్షన్లను కట్ చేశారు. తమ వెంట తెచ్చుకున్న గ్యాస్ సిలిండర్, కట్టర్ల సాయంతో బంగారాన్ని భద్రపరచిన స్ట్రాంగ్ రూం ఏ-1 సేఫ్ లాకర్ డోర్‌ను కత్తరించి అందులోకి ప్రవేశించారు. అక్కడున్న బంగారు ఆభరణాలు, నగదును అపహరించుకు పోయారు. సోమవారం ఉదయం ఫైనాన్స్ కార్యాలయాన్ని తెరిచేందుకు వచ్చిన సిబ్బంది విషయాన్ని అధికారులు, పోలీసులకు తెలియజేశారు. వెంటనే సీఐ నరేందర్ సంఘటనా స్థలానికి చేరుకుని వేలిముద్రల నిపుణులతో ఆనవాళ్లను సేకరించారు. ఎస్పీ విజయకుమార్, సంగారెడ్డి డీఎస్పీ వెంకటేష్‌లు సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. అయితే దొంగతనం వివరాలను తెలియజేసేందుకు ఎస్పీ నిరాకరించారు.
కూతవేటు దూరంలో..
ముత్తూట్ ఫైనాన్స్ పోలీసు స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే 9వ నెంబరు జాతీయ రహదారిపై ఉంది. అయినా దొ ంగలు మాత్రం తాపీ గానే భారీ చోరీకి పాల్పడ్డారు. స్ట్రాంగ్ రూం సేఫ్ తాళాలను కట్టర్‌తో కత్తిరించి లోపలకు ప్రవేశించి డ్రాల్లో భద్రపరచిన ఆభరణాలను, నగదును దోచుకెళ్లారు. గ్యాస్ సిలిండర్లను ఫైనాన్స్ కార్యాలయంలోనే వదిలి వెళ్లారు. అయితే సీసీ కెమెరాల్లో ఫుటేజీల్లో దొంగలు ముసుగులు ధరించి లోపలకు ప్రవేశించినట్లు ఫైనాన్స్ కార్యాలయ వర్గా లు పేర్కొంటున్నాయి. నలుగురు వ్యక్తుల ముఠా చోరీకి పా ల్పడి ఉండవచ్చని తెలుస్తోంది.
ప్రజల్లో ఆందోళన
ముత్తూట్ ఫైనాన్స్‌లో చోరీ జరిగిందన్న విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అయితే తాము కుదువ పెట్టిన బంగారు ఆభరణాలపై ఆందోళన చెందారు. దాచుకున్న సొమ్ముకు ఎలాంటి ఆందోళన వద్దని ఫైనాన్స్ అధికారులు చెప్పడంతో వెనుదిరిగారు.
సొమ్మంతా అందజేస్తాం : జీఎం వెంకటేశ్వరన్
తమ ఫైనాన్స్‌లో తాకట్టు పెట్టిన బంగారాన్ని ఒక్క రూపాయి కూడా నష్టం లేకుండా అందజేస్తామని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన వద్దని ముత్తూట్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ వెంకటేశ్వరన్ ఖాతాదారులకు హామీ ఇచ్చారు ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫైనాన్స్‌లో ఉన్న సొమ్ముకు ఇన్సూరెన్స్ ఉందన్నారు. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి పోలీసులకు పట్టుబడినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు. అయితే అతడి వద్ద లభించిన సొమ్ములో కొంత తమ ఫైనాన్స్‌కు సంబంధించి ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. బ్యాంకులో ఎంత మేర బంగారం, నగదు అపహరణ జరిగిందనే విషయం పోలీసు లే వెల్లడిస్తారని తెలిపారు.
హైదరాబాద్‌లో పట్టుబడిన దొంగ?
జహీరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ చోరికి పాల్పడిన వ్యక్తి హైదరాబాద్‌లో పట్టుబడినట్లు పోలీసు, ఫైనాన్స్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో సీఐ నరేందర్ తన సిబ్బంది తో కలిసి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లాడు.
‘ముత్తూట్’కు కన్నం
Published Tue, Feb 4 2014 3:21 AM | Last Updated on Tue, Oct 16 2018 5:45 PM
Advertisement
Advertisement