పంజాగుట్ట తనిష్క్ జ్యువెలర్లో భారీ చోరీ
హైదరాబాద్ : హైదరాబాద్ పంజాగుట్టలోని తనిష్క్ జ్యూవెలరీ షాపులో భారీ చోరీ జరిగింది. దుకాణంలో ఉంచిన దాదాపు 10 కిలోల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు సమాచారం. దుండగులు దుకాణం వెనుక భాగంలో గోడకు కన్నం వేసి ఈ చోరీకి పాల్పడ్డారు. సేప్ లాకర్‌ను పగలగొట్టి బంగారు నగలతో పాటు వెండి వస్తువులను కూడా దొంగిలించారు.
ముగ్గురు అగంతకులు మాస్కులు వేసుకుని, సాక్సులు కూడా ధరించి లోపలికి ప్రవేశించినట్లు చెబుతున్నారు. వాళ్లలో ఒకరు కొంచెం కుంటుకుంటూ లోనికి ప్రవేశించారని అంటున్నారు. సీసీటీవీ ఫుటేజికి దొరక్కుండా, అలాగే ఫింగర్ ప్రింట్లు కూడా ఎక్కడా పడకుండా వాళ్లు జాగ్రత్త పడినట్లు అర్థమవుతోంది. దాదాపుగా అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పక్కా ప్రణాళిక ప్రకారం వాళ్లు లోనికి వెళ్లారంటున్నారు.
సాధారణంగా ఇలాంటి చోరీ కేసులలో కంపెనీలో పనిచేసే వ్యక్తులను అనుమానిస్తారు. కానీ ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా, పరిస్థితిని బట్టి చూసి అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలు పక్కాగా స్కెచ్ వేసుకునే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అంటున్నారు. రాత్రి డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డులు ఎవరో చూసి, వారిని విచారించే పనిలో పోలీసులున్నారు. అర్ధరాత్రి తర్వాత 12-1 గంట ప్రాంతంలో దోపిడీ జరిగితే దొంగలు ఈపాటికే రాష్ట్రం దాటి వెళ్లిపోయేందుకు కూడా అవకాశం ఉంటుంది.
శనివారం ఉదయం 10.20 గంటలకు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆ తర్వాత పంజాగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఉన్న సీసీ కెమెరాల ఫుటేజిని కూడా పోలీసులు పరిశీలించే అవకాశం ఉంది. దొంగలు ద్విచక్ర వాహనాలపై వచ్చారా, లేదా ఎలా వచ్చారనేది కూడా తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు, క్లూస్ టీమ్, సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే దుండగులు చోరీకి పాల్పడటం సంచలనం సృష్టించింది. గతంలో పంజాగుట్టలోని జాయ్ అలుకాస్ బంగారు దుకాణంలో దుండగులు చోరీకి పాల్పడిన విషయం తెలిసిందే. చోరీ నిందితులను పోలీసులు ముంబాయిలో అదుపులోకి తీసుకున్నారు.