పీసీ కోసం పేచీ | Rs 10 crore for the expansion of the road UPPADA-PITHAPURAM | Sakshi
Sakshi News home page

పీసీ కోసం పేచీ

Published Tue, Nov 4 2014 12:29 AM | Last Updated on Sat, Sep 2 2017 3:49 PM

పీసీ కోసం పేచీ

పీసీ కోసం పేచీ

 ప్రజల కోసం కోట్ల ఆస్తులను పణంగా పెట్టిన నాయకుల కాలం పోయి.. ప్రతి పనిలో పీసీల్ని (పర్సంటేజీలు) దండుకుని, కోట్లు కూడబెట్టుకునే నేతల కాలం వచ్చిపడింది. ప్రజా ప్రయోజనం నీట కలిసినా స్వార్థం కోసం ఒక ముఖ్యనేత రూ.10 కోట్ల పనికి ‘టెండర్’ పెట్టేందుకు వెనుకాడటం లేదు. సదరు నేత ఉప్పాడ-పిఠాపురం రోడ్డుకు అడ్డం పడుతున్న విషయం వెల్లడి కావడంతో జనం నిర్ఘాంతపోతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, కాకినాడ : ప్రస్తుతం ఉప్పాడ-పిఠాపురం రోడ్డు పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ రోడ్డు కొన్ని చోట్ల 3 మీటర్లు, మరికొన్ని చోట్ల ఐదు మీటర్లతో ఇరుకుగా ఉండి ప్రమాదాలకు నెలవుగా మారింది. సముద్రతీరంలో ఉన్న సుమారు 50 మత్స్యకార గ్రామాల ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించాలన్న సంకల్పంతో ఆ రోడ్డును ఏడున్నర మీటర్ల మేర విస్తరించాలని సర్కారు నిర్ణయించింది. సుమారు రూ.10 కోట్ల కేంద్ర రోడ్ ఫండింగ్ (సీఆర్‌ఎఫ్) నిధులకు పరిపాలనా ఆమోదం లభించిం ది. అందుకు సంబంధించి ఇటీవల ఈ టెండర్లను రోడ్లు భవనాలశాఖ ఆహ్వానించింది. విషయం తెలుసుకున్న ఆ ప్రాంతానికి చెందిన ఒక ప్రజాప్రతినిధి అన్ని కోట్ల పనిని పర్సంటేజీలు లేకుండా ఎలా చేసుకుపోతారని, ముందుగా సంబంధితశాఖపై ఒత్తిడి తెచ్చారని విశ్వసనీయంగా తెలిసింది.

 అలా లాభం లేదనుకుని ఆగమేఘాలపై తన అనుయాయులు ఇద్దరితో టెండర్లు వేయించారు. పిఠాపురం, రావులపాలెం మండలం ఊబలంకకు చెందిన   ఇద్దరితో 4.9 శాతం (ఈ పనులకు 5 శాతం ఎక్కువకు కోట్ చేయడానికి అనుమతిస్తారు) అధికంగా కోట్ చేశారని సమాచారం. జిల్లా నుంచి మరెవరినీ టెండర్లు వేయనివ్వలేదని సమాచారం. తన వారిద్దరు ఎంతకైతే కోట్ చేశారో ఆ మేరకు పీసీ (పర్సంటేజీ) అంటే (సుమారు రూ.50 లక్షలు) సదరు నేతకు ముట్టచెప్పాలనేది ఒప్పందం. అయితే అనుయాయులిద్దరు టెండర్లు హడావిడిగా దాఖలు చేయడంలో నిబంధనల ప్రకారం కొన్ని పత్రాలు జత చేయలేకపోయారని తెలిసింది. ఫలితంగా ఆ టెండర్లు అనర్హతకు గురయ్యే చిక్కు ఎదురైంది. టెండర్ల అనర్హతపై నివేదిక హైదరాబాద్ చీఫ్ ఇంజనీర్ స్థాయికి కూడా వెళ్లిందని విశ్వసనీయంగా తెలిసింది.

 విషయం తెలిసిన సదరు నేత ఆరునూరైనా ఆ టెండర్ అనుయాయులకే దక్కేలా ఉన్నత స్థాయిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే హైదరాబాద్‌కు చెందిన మరో నలుగురు కాంట్రాక్టర్లు కూడా దాదాపు అదే రేటుతో టెండర్లు దాఖలు చేయడంతో ఆ నేత గొంతులోపచ్చి వెలక్కాయపడ్డట్టయింది. అయినా ఆ పని పర్సంటేజీలు లేకుండా ఎలా పూర్తి చేస్తారో చూస్తానంటూ అనుచరుల ద్వారా బయటకు సంకేతాలు పంపిస్తున్నారంటున్నారు. తమ వారి టెండర్ ఏదోరకంగా ఖాయం చేయించుకోవడం, అది వీలు కాకుంటే హైదరాబాద్ కాంట్రాక్టర్‌లనైనా దారిలోకి తెచ్చుకోవడం అనే వ్యూహంతో పావులు కదుపుతున్నారని సమాచారం.
 పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖలలా కాక సీఆర్‌ఎఫ్ చేపట్టే పనులు 80 శాతం మించి చేయాల్సి ఉంటుంది.

 ఎందుకంటే కేంద్రం రోడ్ ఫండింగ్ పేరుతో విడుదల చేసే ఈ నిధులతో చేపట్టే పనులపై ప్రత్యేక బృందాలు విజిలెన్స్‌కు వస్తుంటాయి. ఈ కారణంగా సీఆర్‌ఎఫ్ పనులపై కాంట్రాక్టర్‌లు పెద్దగా లాభాలు ఆశించకుండా 80 శాతం నాణ్యతతో పనిచేస్తారంటున్నారు. అటువంటి పనులను మరింత పారదర్శకంగా దగ్గరుండి చేయించాల్సిన నేతలు అందుకు భిన్నంగా పర్సంటేజీల కోసం ఎగబడటం విమర్శలకు తావిస్తోంది. సదరు నేత తిమ్మినిబమ్మిని చేసైనా ఆ టెండర్‌ను తన వారి ఖాతాలో వేసుకోవాలనే పట్టుదలతో చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే.
 
 అనర్హతపై ఉన్నతస్థాయిలోనే నిర్ణయం
 నిబంధనల ప్రకారం టెండర్లు ఆహ్వానించాం. వచ్చిన టెండర్లను పరిశీలన అనంతరం హైదరాబాద్‌కు నివేదించాం. గ్రూప్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్లు తుది నిర్ణయం తీసుకోనున్నారు. టెండర్ల అనర్హతపై ఉన్నతస్థాయిలో నిర్ణయం తీసుకుంటారు.
 - సీఎస్‌ఎన్ మూర్తి, ఎస్‌ఈ, ఆర్ అండ్ బి, కాకినాడ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement