జిల్లాలో కొత్త టెక్నాలజీ ద్వారా నిర్మించనున్న ఆరు రోడ్లకు అవసరమైన *100 కోట్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
- 6 తారురోడ్లకు గ్రీన్‌సిగ్నల్
- పైలట్ ప్రాజెక్టుగా కుప్పం పీఆర్ సబ్‌డివిజన్
చిత్తూరు(టౌన్): జిల్లాలో కొత్త టెక్నాలజీ ద్వారా నిర్మించనున్న ఆరు రోడ్లకు అవసరమైన *100 కోట్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. కుప్పం, చిత్తూరు, మదనపల్లె సబ్‌డివిజన్ల పరిధిలో రెండేసి తారురోడ్ల నిర్మాణాలను చేపట్టడానికి సంబంధిత ఇంజనీరింగ్ ఇన్‌చీఫ్ నుంచి కూడా అనుమతి లభించింది. తొలుత కుప్పం సబ్ డివిజన్‌ను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. వీలైనంత త్వరగా కుప్పంలో ఈ టెక్నాలజీ ద్వారా పనులు చేపట్టడానికి అవసరమైన చర్యలను పంచాయతీరాజ్ ఇంజనీర్లు తీసుకుంటున్నారు. వీటి మంజూరు, అంచనాల తయారీ, పరిపాలన మంజూరు, సాంకేతిక మంజూరు తదితరాలను నెలలోపు ముగించి నిర్మాణ పనులను రెండు నెలల్లోగా పూర్తిచేయించాలని సిద్ధమవుతున్నారు.
ఈ టెక్నాలజీతో ఉపయోగాలివి
జిల్లాలో అమలు చేయనున్న కొత్త టెక్నాలజీ ద్వారా పలు ఉపయోగాలున్నాయి. ఇసుక, కంకర, సిమెంటు, తదితరాలను అవసరానికన్నా అధికంగా వాడుతూపోతే రాబోవు తరాలకు ఇవి ఉండవనే ఉద్దేశంతో ప్రత్నామ్యాయంగా స్థానికంగా లభించే వనరుల ఆధారంగా నిర్మాణాలను చేపట్టడమే ఈ టెక్నాలజీ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా తారురోడ్లు, సిమెంటురోడ్లు, కాలువలు, ఇతర నిర్మాణాలను చేపట్టడంలో కంకర, ఇసుక, సిమెంటు తదితరాలను అవసరమైన మోతాదులో వాడుతున్నారు. ప్రస్తుతం వాడుతున్న టెక్నాలజీ ద్వారా మూడు లేయర్ల మెటల్ (కంకర)ను వాడే బదులు కొత్త టెక్నాలజీ ద్వారా రెండు లేయర్లను వాడితే ఒక లేయర్ ఆదా అవుతుంది. అదేవిధంగా ఇసుక బదులు క్వారీల్లో వృథాగా ఉన్న క్వారీడస్ట్‌ను వాడొచ్చు. సిమెం టును కొంత తగ్గిస్తూ మిగిలిన మోతాదుకు ఫ్లైయాష్‌ను వాడొచ్చు. దీనివల్ల కిలోమీటరు దూరం తారు రోడ్డు నిర్మించేందుకు ఇంచుమించు *5 లక్షల వరకు ఆదా చేయ చ్చు. పది కిలోమీటర్ల పొడవున్న తారు రోడ్డు నిర్మాణంలో రూ. 50 లక్షల వరకు ఆదా అవుతుంది.
జిల్లాకు అనుకూలంగా ‘టెర్రాజైమ్’
మనజిల్లాలో లూజ్‌సాయిల్ (దిగబడే నేలలు) లేనందున చెన్నైకి చెందిన అవిజీత్ కంపెనీ అందిస్తున్న ‘టెర్రాజైమ్’ అనే ఫార్ములా తారురోడ్ల నిర్మాణాలకు ఎంతగానో ఉపయోగపడనుంది. తారురోడ్డు నిర్మాణంలో ముందుగా మట్టి, మెటల్ (కంకర)లో టెర్రాజైమ్ అనే లిక్విడ్‌తో కలిపి చదునుచేసి గట్టిపరచి దానిపై తారురోడ్డు నిర్మిస్తే నాణ్యతతో పాటు మన్నిక వస్తుంది. ఈ ఫార్ములాను ఇంజనీర్లు ప్రతిపాదించగా ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిసింది. దాంతో కొత్త టెక్నాలజీ ద్వారా ఆరు రోడ్ల నిర్మాణానికి మంజూరు లభించింది.