సాక్షి, అమరావతి: ఆర్టీసీలో ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులిప్పిస్తామని నిరుద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసిన వ్యవహారంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ కారెం శివాజీకి పాత్ర ఉన్నట్టు తాజాగా వెల్లడైన ఆడియో టేపులు తేటతెల్లం చేస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఆర్టీసీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న కోవూరు ఎజ్రా శాస్త్రి ఆర్టీసీ బ్యాక్‌లాగ్ పోస్టుల వ్యవహారంలో భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడిన వ్యవహారంపై ఆదివారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమవడం తెలిసిందే.
కాగా, ఎజ్రా శాస్త్రికి, కారెం శివాజీకి మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన ఆడియో టేపులు ఆదివారం వెలుగులోకి వచ్చాయి. దాదాపు గంటన్నరపాటు వీరిద్దరి మధ్య జరిగిన ఈ సంభాషణల్లో కారెం శివాజీ ఖాతాకు నేరుగా రూ.12 లక్షలు పంపించినట్టు ఎజ్రా శాస్త్రి వెల్లడించారు. నా పేరు చెప్పి భారీగా వసూలు చేశావుగానీ, నాకు అంత ఇవ్వలేదు కదా అని కారెం శివాజీ.. శాస్త్రితో అనడం ఈ టేపుల్లో ఉంది. ఇదిలా ఉండగా, ఈ వ్యవహారంలో రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులకు ఆశ కల్పించి శాస్త్రి చేసిన వసూళ్లు రూ.2 కోట్ల వరకు ఉన్నట్టు బాధితులు చెబుతున్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఉన్న కారెం శివాజీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తారని, ఆ వెంటనే ఆర్టీసీలో నోటిఫికేషన్ జారీ అవుతుందని చెబుతూ ఎజ్రా శాస్త్రి యూనియన్‌లో ప్రచార కార్యదర్శిగా ఉన్న చంద్రశేఖర్ ఆజాద్ నుంచి రూ.12.5 లక్షలు వసూలు చేసినట్టు తెలుస్తోంది.
జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఇప్పిస్తామని చెప్పడంతో ఆజాద్ మరికొందరి నుంచి కూడా డబ్బు వసూలు చేసినట్లు బాధితులు చెబుతున్నారు. నెల్లూరు ప్రధాన బస్టాండ్‌లో క్యాంటీన్ నిర్వహిస్తున్న కడప జిల్లా మైదుకూరు మండలం కేశలింగాయపల్లికి చెందిన తిరుమలయ్య మోసపోయి రూ.15 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితులు ఆర్టీసీ ఎండీ మాలకొండయ్యను కలసి ఫిర్యాదు చేయగా.. కేసు పెట్టాలని సూచించడం, బాధితులు కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయకపోవడం, దీనిపై బాధితులు విజయవాడ పోలీసు కమిషనర్‌ను కలసి ఫిర్యాదు చేయడం తెలిసిందే.
నాపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవం: కారెం
ఆర్టీసీలో బ్యాక్‌లాగ్ పోస్టులిప్పిస్తానని ఎవరి వద్ద డబ్బులు తీసుకోలేదని, అలాంటి అలవాటు తన చరిత్రలో లేదని కారెం శివాజీ చెప్పారు. ఆరోపణలపై ‘సాక్షి’ వివరణ కోరగా ఆయన పైవిధంగా స్పందించారు. ఆర్టీసీ యూనియన్‌లో రెండు గ్రూపులున్నాయని, వాటిమధ్య తలెత్తిన వివాదాల వల్లే ఈ ఆరోపణలు వస్తున్నాయని ఆయన చెప్పారు. ఎవరి వద్దా డబ్బు తీసుకోలేదని, బ్యాక్‌లాగ్ పోస్టుల వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment