ఎక్సైజ్‌కు మరింత కిక్
బార్ నూతన పాలసీతో జిల్లాలో రూ.15 కోట్లకు పైగా పెరగనున్న ఆదాయం
నగరాల్లో రూ.9 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలు పెంపు
బార్ హాల్ విస్తీర్ణం 200 చదరపు అడుగులు తప్పనిసరి
వచ్చే నెల 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి..
విజయవాడ : జిల్లాలో నూతన బార్ లెసైన్స్ పాలసీ వచ్చే నెల ఒకటి నుంచి అమల్లోకి రానుంది. ప్రధానంగా లెసైన్స్ ఫీజు పెంపు, ఒకటి రెండు కొత్త నిబంధనలు మినహా పాత పాలసీనే యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. దీంతో జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖకు భారీగా ఆదాయం పెరగనుంది. ఇప్పటికే బార్ల లెసైన్స్‌ల రెన్యూవల్స్ ప్రకియ జిల్లాలో మొదలైంది. కొత్త పాలసీతో జిల్లాలో రూ.15 కోట్లకు పైగా ఆదనపు ఆదాయం లభించనుంది.
జిల్లాలో మొత్తం 167 బార్లు ఉన్నాయి. వీటిలో విజయవాడ నగరంలోనే అత్యధికంగా 98 ఉన్నాయి. నూతన పాలసీలో అనేక కొత్త నిబంధనలు ఉంటాయని దీంతో జిల్లాలో బార్ల సంఖ్య భారీగా తగ్గే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు భావించారు. అలాగే ప్రతి బార్‌కు పార్కింగ్ నిబంధన తప్పనిసరి చేయాలని తొలుత భావించారు. ఈ నిబంధన అమల్లోకి వస్తే జిల్లాలో దాదాపు 50 శాతం బార్లకు పార్కింగ్ వసతి లేదు. దీంతో అనేక బార్లు మాతపడి ఆదాయానికి గండి పడుతుందన్న భావనతో దీని జోలికి వెళ్లలేదు. పాత నిబంధనలు కొద్దిగా మార్చి యథాతథంగా అమలుచేసి లెసైన్స్ రెన్యూవల్స్ ప్రకియ మొదలుపెట్టారు. జిల్లా అధికారులతో సంబంధం లేకుండా నేరుగా లెసైన్స్‌దారులు హైదరాబాద్‌లోని ఎక్సైజ్ శాఖ కమిషనర్ కార్యాలయంలో లెసైన్స్ రెన్యూవల్‌కు సంబంధిత ఫీజు చెల్లిస్తే రెన్యూవల్స్ చేస్తున్నారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న బార్ల పాలసీ ప్రకారం నగరంలోని బార్లకు ఏడాదికి రూ.41 లక్షలు, పట్టణాల్లోని బార్లకు రూ.38 లక్షలు వార్షిక ఫీజు ఉండేది. కొత్త పాలసీ ప్రకారం నగరపాలక సంస్థ పరిధిలో అయితే రూ.50 లక్షలు, మున్సిపాలిటీల్లో రూ.40 లక్షలుగా నిర్ణయించారు. గత పాలసీ ప్రకారం ఏటా రూ.65.75 కోట్లు లెసైన్స్ రెన్యూవల్స్ ద్వారా వచ్చేది. కొత్త పాలసీ ప్రకారం 80.16 కోట్లు ఆదాయం రానుంది. పెరిగిన రూ.15 కోట్ల ఆదాయంలో నగరంలోని బార్ల ద్వారానే రూ.10 కోట్లు అదనపు ఆదాయం సమకూరనుంది. మిగిలిన రూ.5 కోట్లు మున్సిపాలిటీల్లోని బార్ల ద్వారా రానుంది.
200 చదరపు అడుగులు తప్పనిసరి..
ఇకపై ప్రతి బార్ హాల్ విస్తీర్ణం తప్పనిసరిగా 200 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలి. గతంలో ఈ నిబంధన లేకపోవడంతో అనేక ప్రాంతాల్లో బార్ లెసైన్సులు తీసుకుని స్పీడ్ బార్ పేరుతో, బార్ అండ్ రెస్టారెంట్ పేరుతో వైన్ షాపు తరహా వ్యాపారం నిర్వహించేవారు. బార్లలో సమగ్రంగా సిట్టింగ్ హాల్స్, ఏసీ హాల్స్ లేవు. ఈ క్రమంలో బార్లలో సౌకర్యాలు మెరగుపర్చేందుకు దీన్ని అమల్లోకి తెచ్చారు. నగరంలోని బార్ల లెసైన్స్‌లు రెన్యూవల్స్ చేసే సమయంలో క్షుణ్ణంగా పరిశీలించాలని అధికార యంత్రాగం నిర్ణయించింది. లెసైన్స్ రెన్యూవల్స్‌కు కమిషనరేట్ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకున్న బార్లను కొద్ది రోజుల్లో పరిశీలించనున్నారు.
బకాయిల బండ కదిలింది
ఎక్సైజ్ లెసైన్స్ కోసం యూజర్ చార్జీల చెల్లింపు
విజయవాడ సెంట్రల్ : ఎక్సైజ్ నిబంధనలతో నగరపాలక సంస్థకు మొండి బకాయిలు వసూలవుతున్నాయి. జనవరి ఒకటో తేదీ నుంచి మద్యం షాపులకు కొత్తగా లెసైన్స్‌లు మంజూరు చేయనున్న నేపథ్యంలో బకాయిలు ఏమీ ఉండకూడదన్న నిబంధనల్ని ప్రభుత్వం విధించింది. ఈ క్రమంలో బార్ల నిర్వాహకులు నగరపాలక సంస్థకు యూజర్ చార్జీలు చెల్లించేందుకు క్యూకట్టారు. రెండు రోజుల్లో రూ.50 లక్షలకు పైగా బకాయిలు వసూలైనట్లు సమాచారం. మొత్తం 130 బార్ల నుంచి రూ.1.40 కోట్ల మేర యూజర్ చార్జీలు పెండింగ్ ఉన్నాయి. ఏ విధమైన పాత బకాయి ఉన్నా లెసైన్స్ ఇచ్చే ప్రసక్తి లేదని ప్రభుత్వం మెలిక పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బార్ల నిర్వాహకులు బకాయిలను క్లియర్ చేస్తున్నారు.