ఒంగోలు క్రైం: ఒంగోలు విజయ డెయిరీలోని పాలకేంద్రంలో గురువారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నట్లు డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు తెలిపారు. ప్రమాదం జరగటంతో ఆయన శుక్రవారం బోర్డు ఆఫ్ డెరైక్టర్లతో సమావేశం ఏర్పాటు చేశారు. స్థానిక డెయిరీ ఆవరణలో నిర్వహించిన సమావేశంలో పాలపొడి ప్లాంట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై నిశితంగా సమీక్షించారు.
ప్రమాదానికి గురైన ఎయిర్‌హీటర్ చాంబర్ పక్కనే ఆపరేటర్ ఉన్నప్పటికీ అతను ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడని అన్నారు. పాలపొడి తయారీ నిలిచిపోయిందని, దీని వలన రోజువారి నష్టం అధికంగానే ఉంటుందని చెప్పారు. రోజుకు 4 లక్షల లీటర్ల పాలను పొడిగా మార్చే ఈ ఎయిర్ హీటర్ చాంబర్ పునరుద్ధరించేందుకు సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అందుకోసం ఢిల్లీ మదర్ డెయిరీలో పని చేస్తున్న వెంకట్ అనే నిపుణుడ్ని పిలిపిస్తున్నట్లు చైర్మన్ తెలిపారు.
విజయవాడ నుంచి కూడా సాంకేతిక నిపుణులను రప్పిస్తున్నట్లు పేర్కొన్నారు. రోజూ రూ.7 లక్షల చొప్పున ఎన్ని రోజులు పాలపొడి ఉత్పత్తి ఆగిపోతే అంత మేర నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్నట్లు వివరించారు. డెయిరీలో ప్రస్తుతం 6 లక్షల లీటర్ల పాలు నిల్వ ఉన్నాయని ఈ పాలను వేరే ప్రైవేట్ డెయిరీలకు తరలించేందుకు సన్నద్ధమవుతున్నట్లు చెప్పారు. డెయిరీలో పాలపొడి ఉత్పత్తి ఆగిపోవడంతో తమిళనాడు, కర్ణాటకలోని వినియోగదారులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంటుందన్నారు. అనంతరం బోర్డు ఆఫ్ డెరైక్టర్స్ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు.
అగ్ని ప్రమాదంలో డెయిరీకి రూ.2 కోట్ల నష్టం
Published Sat, Dec 20 2014 1:59 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement