నేడు రూ.5వేల కోట్లు విడుదల
20 శాతం రుణాల మాఫీకిగాను వ్యవసాయ శాఖకు మంజూరు
నలుగురు డెరైక్టర్లతో రైతు సాధికారిత కార్పొరేషన్ రిజిస్ట్రేషన్
హైదరాబాద్: రైతుల రుణాల్లో 20 శాతం మాఫీ చేయడంలో భాగంగా ఆర్థిక శాఖ శనివారం రూ.5000 కోట్లను వ్యవసాయ శాఖకు విడుదల చేయనుంది. మరోపక్క నలుగురు డెరైక్టర్లతో రైతు సాధికారిత కార్పొరేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం రిజిస్టర్ చేసింది. విజయవాడ కేంద్రంగా పనిచేసే ఈ కార్పొరేషన్‌ను ఈ నెల 21న సీఎం ప్రారంభించనున్నట్లు ఆర్థిక శాఖ ఉన్నతాధికారి తెలిపారు. డెరైక్టర్లుగా ఆర్థిక, వ్యవసాయ, పుశుసంవర్ధక శాఖల ముఖ్యకార్యదర్శులు, వ్యవసాయ కమిషనర్ వ్యవహరించనున్నారు. ఈ కార్పొరేషన్‌ను రూ.కోటి మూలధనంతో ఏర్పాటు చేశారు.
ప్రాధాన్యతా క్రమంలో మాఫీ..
ఆర్థిక శాఖ నుంచి వచ్చే 5000 కోట్ల రూపాయలను వ్యవసాయ శాఖ రైతు సాధికారిత కార్పొరేషన్‌కు విడుదల చేయనుంది. అక్కడ నుంచి రుణ మాఫీకి అర్హులైన రైతుల రుణాల్లో 20 శాతం నిధులను బ్యాంకులకు విడుదల చేయనున్నారు. ఈ 20 శాతం నిధుల చెల్లింపును కూడా ప్రాధాన్యత క్రమంలో చేయనున్నారు. తొలుత పంట రుణాలకు, ఆ తరువాత ప్రకృతి వైపరీత్యం సమయంలో దీర్ఘకాలిక రుణాలుగా మారిన పంట రుణాలకు ఇస్తారు. చివరి ప్రాధాన్యతగా బంగారంపై తీసుకున్న రుణాలను పరిగణనలోకి తీసుకున్నారు. బంగారం రుణాలకు 20 శాతం ప్రభుత్వం చెల్లించినప్పటికీ అవి కొత్త రుణాలగా మారబోవని అధికార వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం 20 శాతం నిధులను చెల్లిస్తే మిగతా 80 శాతం రుణాన్ని రైతులు చెల్లించి బంగారం విడిపించుకోవాల్సి ఉంటుంది.అలా కాకుండా మిగతా 80 శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని, అప్పుడు బంగారం విడిపించుకోవచ్చునని రైతులు అనుకుంటే 14 శాతం మేర వడ్డీ భారం పడుతుంది. బంగారం రుణాలతో పాటు, పంట రుణాలన్నింటికీ గత ఏడాది డిసెంబర్ వరకుగల వడ్డీనే ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని, జనవరి నుంచి 7 శాతం మేర వడ్డీని, జూలై నుంచి 14 శాతం వడ్డీని రైతులే భరించాలని ఓ అధికారి తెలిపారు.