రూ. 700 కోట్ల రుణ మాఫీ | Rs. 700 crore loan waiver | Sakshi
Sakshi News home page

రూ. 700 కోట్ల రుణ మాఫీ

Published Sat, Nov 22 2014 1:56 AM | Last Updated on Wed, Oct 17 2018 5:47 PM

Rs. 700 crore loan waiver

* ఇది కేవలం సొసైటీల ద్వారానే..  
* ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప
* సహకార వారోత్సవాల ముగింపు

అమలాపురం రూరల్ : జిల్లాలో సహకార సంఘాల ద్వారా రూ.700 కోట్ల రుణాలు మాఫీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. 61వ అఖిల భారత సహకార వారోత్సవాల ముగింపు సందర్భంగా కోనసీమ సహకార సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో శుక్రవారం అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో సభ జరిగింది. ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథిగా రాజప్ప మాట్లాడుతూ 1.55 లక్షల మంది రైతులకు రూ.700ల కోట్ల రుణమాఫీ జరుగుతుందన్నారు.  

వాణిజ్యపంటలకూ రుణమాఫీ అమలు చేయాలని కోరుతున్నారని, ఉద్యానపంటల రుణమాఫీకి రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,500ల కోట్లు కావాలని,  దీనిపై సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.  సహకార సంఘాల్లో ఎన్టీఆర్ సుజల ప్లాంటు ఏర్పాటు చేస్తే డీసీసీబీ ద్వారా రూ.లక్ష నిధులు మంజూరు చేస్తామన్నారు. డీసీసీబీ చైర్మన్ వరుపుల రాజా మాట్లాడుతూ జిల్లాలో కొత్తగా 12 బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు.  

జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు మాట్లాడుతూ కోనసీమలో అధిక శాతం రైతులు ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారని, వీరికి రుణమాఫీ అమలు చేయాలన్నారు.  అనంతరం  రాజప్పను సహకార సంఘ ఉద్యోగులు సత్కరించారు. కాకినాడ బిల్డింగ్ సొసైటీ చైర్‌పర్సన్ కె.చిలక వీరరాఘవులు తమ సంఘం తరఫున రూ.2లక్షల 22వేల 202ను సీఎం సహాయనిధికి  అందించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అయితాబత్తుల ఆనందరావు, పులపర్తి నారాయణమూర్తి, డీసీఎంఎస్ చైర్మన్ సత్యనారాయణరెడ్డి, సీఈఓ హేమసుందర్, డీసీసీబీ ఉపాధ్యక్షుడు దున్నా జనార్దనరావు, మాజీ చైర్మన్ శిరంగు కుక్కుటేశ్వరరావు, డివిజన్ సహకార  అధికారి కె.రాధాకృష్ణారావు, డీసీసీబీ డెరైక్టర్లు పాల్గొన్నారు.
 
వాణిజ్య పంటలకు రుణమాఫీ వర్తింపజేయలేం
అంబాజీపేట : వ్యవసాయ రుణాలు మాఫీ అవుతాయని, వాణిజ్య పంటలకు రుణమాఫీని వర్తింపజేయలేమని డిప్యూటీ సీఎం, హోంశాఖా మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. అంబాజీపేటలో సహకార సంఘం ద్వారా మీ సేవా, ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఉద్యాన పంటలకూ రుణమాఫీ వర్తింపజేయాలని  ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి ఇప్పటికే తీసుకువెళ్లామని, దానిపై స్పష్టత రావాల్సి ఉందని, మరోసారి ఈ అంశాన్ని కోనసీమ రైతులతో కలిసి సీఎంతో సమావేశమవుతామని పేర్కొన్నారు.   అనంతరం ఉద్యాన పంటలకు రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని బీకేఎస్ నాయకులు ముత్యాలు జమ్మీలు, సొసైటీ అద్యక్షుడు రాఘవులు తదితరులు రాజప్పకు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement