
తుని ఘటనలో అసలు బాధ్యులనే శిక్షిస్తాం
తుని సంఘటనకు సంబంధించిన కేసును సీఐడీకి అప్పగించామని, అసలు బాధ్యులను గుర్తించి శిక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం శాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. కృష్ణా జిల్లా బందరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో ఆదివారం సాయంత్రం రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, ఎక్సైజ్‌శాఖ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. తుని సంఘటనలో బయట వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారనటం అపోహ మాత్రమే అని స్పష్టం చేశారు. సీఐడీ విచారణలో అసలు బాధ్యులను గుర్తించి శిక్ష విధిస్తామని తెలిపారు.
ఎర్ర చందనం, భూకబ్జాలు, చైన్‌స్నాచింగ్ వంటి ఘటనలపై ముఖ్యమంత్రి పోలీసు వ్యవస్థను పటిష్టం చేసి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గిరిజనులకు అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బందరు మండలం పెదపట్నం ప్రాంతంలో మెరైన్ అకాడమీని నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ చలమలశెట్టి రామాంజనేయులు మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో కాపు రుణమేళాను ఏర్పాటుచేశామన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,25,621 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఈ సమావేశంలో టీడీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ బూరగడ్డ రమేష్‌నాయుడు పాల్గొన్నారు.