గుంటూరు : ప్రయాణికులందరినీ సురక్షితంగా కాపాడిన ఓ ఆర్టీసీ డ్రైవర్ తాను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. విధి నిర్వహణలో ఉన్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో గురువారం చోటుచేసుకుంది. పిడుగురాళ్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సత్తెనపల్లి వెళుతున్న సమయంలో డ్రైవర్ దస్తగిరి ఆకస్మికంగా గుండెపోటుకు గురయ్యాడు.
అయితే ఆ బాధతోనే అతడు బస్సును అదుపు చేసి రోడ్డు పక్కన నిలిపివేశాడు. అనంతరం స్టీరింగ్ వీల్ మీదకు వాలిపోయి ఘటనాస్థలంలోనే విడిచాడు. ఈ ఘటన జరిగినప్పుడు బస్సులో 51మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ప్రయాణికులకు ఒక్కసారిగా ఏమి జరుగుతుందో అర్థం కాలేదు. విషయం తెలుసుకున్న ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నా...డ్రైవర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుడి స్వస్థలం నాగార్జున సాగర్. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.