ఆర్టీసీ కాంప్లెక్సులో.. ఆ ఒక్క క్షణం
చోడవరం టౌన్: చోడవరం ఆర్టీసీ కాంప్లెక్సులో ఆదివారం ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన మనుమరాలు ఆర్టీసీ బస్సులో తప్పిపోయిందంటూ ఓ మహిళ లబోదిబోమంటూ పరుగులు తీసింది. ఆటో పట్టుకుని ఆర్టీసీ బస్సు వెనుక ఛేజ్ చేసింది. కానీ...ఏం జరిగిదంటే.. మాడుగుల మండలం వీరనారాయణం గ్రామానికి చెందిన దాసరి అప్పలనర్స ఆదివారం లంకెలపాలెంలో ఉన్న తన కుమార్తె జక్కం మాధవి ఇంటికి వచ్చింది. తిరుగు ప్రయాణంలో మాధవి కూతరు సంధ్యతో కలసి అనకాపల్లి నుంచి చోడవరం ఆర్టీసీ కాంప్లెకు వచ్చింది. ఇక్కడి కాప్లెక్స్‌లో స్వగ్రామం వెళ్లేందుకు జాలంపల్లి బస్సు ఎక్కింది.
మనమరాలుకు బిస్కెట్లు కొందాం అని అప్పలనర్స.. సంధ్య బస్సులో కూర్చోబెట్టి కిందకు దిగింది. కాంప్లెక్స్‌లో ఓ దుకాణం వద్ద బిస్కెట్లు కొనుగోలు చేసి తిరిగి చూసే సరికి కాంప్లెక్స్‌లోని ఓ బస్సు కదిలి వెళ్లిపోతోంది. ఆత్రుతగా చూసిన అప్పలనర్స తన మనమరాలు ఉన్న బస్సు వెళ్లిపోతోందనుకుని కాంప్లెక్స్ బయటకు వచ్చి ఆటో డ్రైవర్‌ని వెళ్లిపోతున్న బస్సుని కలవాలని.. అందులో తన మనమరాలు ఉండిపోయిందని ఏడుస్తూ ప్రాధేయపడింది. దీంతో ఆటో డ్రైవర్ బస్సును వెండించాడు. వడ్డాది వద్ద బస్సును ఆపి తన మనమరాలు గురించి వెతకసాగింది. అయితే ఆ బస్సులో సంధ్య లేకపోవడంతో తీవ్రంగా ఏడుస్తోంది. తర్వాత బస్సులోని వారిని ఆరా తీయగా ఇది జాలంపల్లి బస్సు కాదని.. నర్సీపట్నం బస్సు అని చెప్పడంతో అప్పలనర్స నివ్వెరపోయింది.
అక్కడ నుంచి తిరిగి మళ్లీ చోడవరం ఆర్టీసీ కాంప్లెక్సుకు తిరుగుపయానమైంది. ఇదే సమయంలో చోడవరం కాంప్లెక్సు వద్ద జాలంపల్లి బస్సులో ఏడుస్తున్న సంధ్యను డ్రైవర్ లోకేష్ విషయం అడిగి తెలుసుకున్నాడు. తన అమ్మమ్మ తనను బస్సులో వదిలేసి వెళ్లిపోయిందని బాలిక చెప్పడంతో డ్రైవర్ చిన్నారిని చోడవరం పోలీసులకు అప్పగించాడు. అంతలో అప్పలనర్స తిరిగి చోడవరం కాంప్లెక్స్‌కి వచ్చి తన మనమరాలు గురించి అక్కడివారిని అడిగింది. బస్సు డ్రైవర్ పాపను పోలీసుస్టేషన్‌కి తీసుకువెళ్లాడని అక్కడివారు చెప్పడంతో ఆమె పోలీసు స్టేషన్‌కు పరుగుపెట్టింది. సంధ్య అక్కడ ఉండడంతో ఊపిరి పీల్చుకుంది. పోలీసుల సమక్షంలో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌లు సంధ్యను అప్పలనర్సకు అప్పగించడంతో కథ సుఖాంతం అయింది.