కడప అర్బన్ : కడప కేంద్ర కారాగారం....రాత్రి 11 గంటలు.....సార్... బీడీలు తెచ్చుకోవడం మర్చిపోయా! వెళ్లి తెచ్చుకుంటానని చెప్పిన నిందితుడు ఎంచక్కా పరారీ కావడంతో ఉలిక్కిపడిన పోలీసులు అతనితో పాటు పరుగు తీశారు. అయినా ఆ నిందితుడు యువకుడు కావడంతో పట్టుకోలేకపోయారు. ఫలితం పేరుమోసిన కిడ్నాపర్, అనేక కేసుల్లో ప్రధాన నిందితుడు ముండ్ల వెంకట సునీల్‌కుమార్ పరార్ అయ్యాడు.
కడప కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉంటున్న ముండ్ల వెంకట సునీల్‌కుమార్ అంతర్ జిల్లా కిడ్నాపర్‌గా పేరు మోశాడు. కడప, అనంతపురం జిల్లాల పోలీసులు పన్నిన వలలో చిక్కాడు. అనేక కేసులు ఇతనిపై నమోదయ్యాయి. సబ్‌జైలు స్థాయి కారాగారంలో అతన్ని ఉంచితే ప్రమాదమని కొన్ని నెలలుగా కడప కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉంచారు. అనంతపురంజిల్లాలో ఇటీవల జరిగిన సంఘటనల్లో పోలీసులు అతన్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. ఈ క్రమంలో ఈనెల 11వ తేదీన అనంతపురం జిల్లా నార్పల పోలీసుస్టేషన్ పరిధిలో రెండు కేసులకు సంబంధించి జిల్లా కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.
ఈ క్రమంలో అనంతపురం జిల్లా ఆర్మ్‌డ్ రిజర్వుడు విభాగం నుంచి పి.వెంకట రమణారెడ్డి (ఏఆర్ హెచ్‌సీ-2177), ఇంతియాజ్‌బాష (ఏఆర్ పీసీ-1977)అనే ఇరువురు సునీల్‌ను సదరు కేసుల్లో హాజరు పరిచేందుకు బందోబస్తు కోసం వచ్చారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండులో ఉన్న సునీల్‌కుమార్‌ను గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో జైలు అధికారుల అనుమతితో అనంతపురం కోర్టుకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి కోర్టులో హాజరు పరిచి తిరిగి కడపకు సాయంత్రం బయలుదేరారు. కడపకు ఆర్టీసీ బస్సులో వచ్చేసరికి రాత్రి పొద్దుపోయింది. కడప ఆర్టీసీ బస్టాండు దగ్గరి నుంచి ఆటోలో కడప కేంద్ర కారాగారం రహదారి వద్దకు తీసుకువచ్చారు. ప్రధాన గేటు వద్దకు అతన్ని తీసుకెళ్లే సమయానికి చేతులకు వేసిన బేడీలను తీసివేశారు. ఆ సమయంలోనే తాను బీడీలు మరిచిపోయానని, తెచ్చుకుంటానని వెనక్కి తిరిగాడు. అతని వెనుకనే వారూ వచ్చారు. అయితే, వారికి చిక్కకుండా పరారయ్యాడు. పై సంఘటన జరగడం, వారు పరిగెత్తేందుకు ప్రయత్నించడం, పరారు కావడం ఒకదాని వెంట జరిగిపోయాయి. కానీ రిమ్స్ పోలీసుస్టేషన్‌లో సునీల్‌తోపాటు బందోబస్తుకు వెళ్లిన పోలీసు కానిస్టేబుళ్లు ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తాము అనంతపురం కోర్టుకు సునీల్‌ను తీసుకెళ్లి తిరిగి వచ్చామని, ఆటోలో దిగగానే తమను తోసేసి పరారైనట్లు పేర్కొన్నారు. ఈ సంఘటనపై నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పోలీసులను అనంతపురం ఎస్పీ సస్పెండ్ చేశారు.
తప్పించారా..! తప్పించుకున్నాడా..
Published Sat, Dec 13 2014 2:13 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM
Advertisement