సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని ఆర్టీసీ స్థలాలను లీజు పేరిట టీడీపీ నేతలకు ధారాదత్తం చేస్తున్నారు. దీంతో ఆర్టీసీ స్థలం కనబడితే చాలు టీడీపీ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. సర్కారు పెద్దల తోడ్పాటుతో రూ.వందల కోట్ల విలువచేసే ఆర్టీసీ స్థలాల్ని కారుచౌకగా కొట్టేస్తున్నారు. ఈ స్థలాల పునాదులపై తమ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుని సంస్థ మనుగడను దెబ్బతీస్తున్నారు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఉన్న ఆర్టీసీ స్థలాలు చినబాబు అండతో టీడీపీ నేతలు, అనుకూల కార్పొరేట్ కంపెనీలు దక్కించుకోగా.. తాజాగా నరసరావుపేటలో రూ.20 కోట్ల విలువచేసే ఆర్టీసీ స్థలాన్ని అధికారపార్టీ సీనియర్ నేత తనయుడు చేజిక్కించుకున్నారు. టెండర్లను అడ్డుకుని బినామీలను రంగంలోకి దించి మరీ ఈ స్థలాన్ని కారుచౌకగా కొట్టేశారు.
నామమాత్రపు ధరకు ఒప్పందం..
గుంటూరు–కర్నూలు రహదారి పక్కన నరసరావుపేట పట్టణంలో ఆర్టీసీ డిపో, గ్యారేజీ ఉంది. ఈ గ్యారేజీ పక్కనే ఆర్టీసీ అధికారుల క్వార్టర్లకు 60 సెంట్ల విలువైన భూమి ఉంది. ఇక్కడ డిపో మేనేజర్, సిబ్బంది ఉండేందుకు 1976లో క్వార్టర్లు నిర్మించారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈ విలువైన స్థలంపై కన్నేసిన సీనియర్ నేత తనయుడు చేజిక్కించుకునేందుకు ప్లాన్ వేశారు. మల్టీప్లెక్స్ నిర్మించేందుకు దీన్ని ఎంచుకున్నారు. ముందుగా క్వార్టర్లలో ఉంటున్న సిబ్బందిని ఖాళీ చేయించి స్థలాన్ని బీవోటీ(నిర్మించు–నిర్వహించు–బదలాయిం^èు) విధానంలో లీజుకు తీసుకునేందుకు టెండర్లు పిలిచేలా ఆర్టీసీ ఉన్నతాధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చారు. టెండర్లు పిలిచాక ఎవ్వరూ ముందుకు రాకుండా బెదిరించారు. ఓ కార్పొరేట్ కంపెనీని అడ్డుపెట్టుకుని అతి తక్కువ ధరకు చేజిక్కించుకున్నారు. రూ.20 కోట్ల విలువైన స్థలానికి నెలకు రూ.లక్ష నామమాత్రపు ధర చెల్లించేలా 33 ఏళ్లపాటు లీజుకు ఆర్టీసీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నిర్మాణం పూర్తయ్యేవరకు ఆర్టీసీకి పైసా చెల్లించకుండా ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం.
28 ఎకరాలను లాక్కుంది..
ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు 1986లో గన్నవరం ఆర్టీసీ శిక్షణ కళాశాలకోసం సర్వే నంబర్ 20/1లో 28 ఎకరాల్ని జీవో నంబర్ 117 జారీ చేసి ఆర్టీసీకి అప్పగించగా.. ఈ భూముల్లో ఆర్టీసీ భవనాల నిర్మాణం కూడా చేపట్టింది. 2007లో ఈ భూములకు రెవెన్యూశాఖ నిరా>్ధరించిన రేటు ప్రకారం ఎకరాకు రూ.40 వేలు చొప్పున మొత్తంగా రూ.12.43 లక్షలు చెల్లించింది. ఇప్పుడీ భూములు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు అందుబాటులో ఉన్నాయని బలవంతంగా ఆర్టీసీ నుంచి లాక్కున్న సర్కారు రూ.250 కోట్ల విలువైన ఈ భూములు నిరుపయోగంగా ఉన్నాయని కృష్ణా కలెక్టర్‌తో నివేదిక తెప్పించి బలవంతంగా లాక్కుని హెచ్‌సీఎల్‌కు కట్టబెట్టింది. ప్రత్యామ్నాయ భూములిస్తామని చెబుతున్నా అది జరిగేది అనుమానమే.
కారుచౌకగా కొట్టేస్తున్నారు...
ఏపీఎస్‌ఆర్‌టీసీకి 13 జిల్లాల్లో 1,960 ఎకరాల భూములున్నాయి. వీటి విలువ ఇప్పుడున్న రెవెన్యూ రికార్డుల ప్రకారం సుమారు రూ.15 వేల కోట్ల ఉంటుందని అంచనా. అదే మార్కెట్ రేటు ప్రకారమైతే రూ.50 వేల కోట్లు ఉంటుంది. ఈ భూములపై కన్నేసిన టీడీపీ నేతలు ప్రభుత్వ పెద్దల సహకారంతో అతి తక్కువ లీజుతో వాటిని కొట్టేయడంపై దృష్టిపెట్టారు. ఇప్పటికే గుంటూరు నడిబొడ్డులోని అతి విలువైన స్థలాన్ని స్విస్ ఛాలెంజ్ విధానంలో విజయవాడకు చెందిన సిద్ధి ప్రధ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కారుచౌకగా గతేడాది కట్టబెట్టడం తెలిసిందే. గుంటూరు ప్రధాన బస్టాండ్‌ను ఆనుకుని ఉన్న పాత రీజినల్ మేనేజరు కార్యాలయం వద్ద 8,643 చదరపు గజాల స్థలం(సుమారు 1.80 ఎకరాలు) ఆర్టీసీకి ఉంది. మార్కెట్‌రేటు ప్రకారం ఈ స్థలం విలువ రూ.వందకోట్ల పైమాటే.
ఈ స్థలాన్ని వ్యాపార కూడలిగా మారిస్తే ఏటా రూ.వందలకోట్ల ఆదాయాన్ని ఆర్జించే వీలుంది. అయితే దీనికి స్విస్ ఛాలెంజ్ విధానంలో టెండర్లు పిలిచిన ఆర్టీసీ.. సర్కారు అనుకూల కంపెనీలు దక్కించుకునేలా నిబంధనలు రూపొందించింది. ఆ మేరకు విజయవాడకు చెందిన సిద్ధి ప్రథ కంపెనీ ఒక్కటే టెండర్లలో పాల్గొనడం, దానికి ఏకపక్షంగా 49 ఏళ్లపాటు లీజు విధానంలో స్థలాన్ని కట్టబెట్టేయడం జరిగిపోయింది. ఇదేరీతిలో పలు నగరాలు, పట్టణాల్లోని భూములనూ అధికారపార్టీకి అనుకూలమైన వారికి కట్టబెడుతున్నారు. విశాఖ, విజయవాడ, ఒంగోలు, తిరుపతి తదితర ప్రాంతాల్లోనూ బీవోటీ విధానంలో 33 ఏళ్లకు, 99 ఏళ్లకు లీజుకివ్వడం గమనార్హం. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళుతున్న ఈ స్థలాలు తిరిగి ఎన్నేళ్లకు ఆర్టీసీకి బదలాయింపు జరుగుతాయో.. కూడా తెలియని పరిస్థితి.
Comments
Please login to add a commentAdd a comment