
ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం : మెకానిక్ మృతి
ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ మెకానిక్ మృతి చెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.
విజయవాడ : ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యానికి ఓ మెకానిక్ మృతి చెందిన ఘటన విజయవాడలో చోటుచేసుకుంది. నగరంలోని పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ పరిధిలోని గ్యారేజ్‌లో హెల్పర్‌గా పనిచేస్తున్న దుర్గారావు ఆదివారం బస్ నడిపేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో బస్సు అదుపు తప్పి అక్కడ విధులు నిర్వహిస్తున్న సీనియర్ మెకానిక్ సత్యనారాయణను ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.
హెల్పర్ చేతికి బస్ ఎవరిచ్చారో తెలియదంటూ ఆర్టీసీ అధికారులు చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. హెల్పర్‌కి నిబంధనలకు విరుద్ధంగా బస్ను ఇచ్చిన ఆర్టీసీ అధికారులే బాధ్యత వహించాలని ఎంప్లాయిస్ యూనియన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని హెల్పర్ దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు.