అధికార పార్టీ నేత దందా!
చోద్యం చూస్తున్న అధికారులు
ఫిర్యాదులపై స్పందించని వైనం
శ్రీకాకుళం మున్సిపాలిటీ సరిహద్దు గ్రామం తోటపాలెం. ఇక్కడ సెంటు భూమి విలువ సుమారు 3లక్షలు ఉంటుంది. అంటే ఎకరా అక్షరాలా రూ.3కోట్లు అన్న మాట. దీంతో ప్రభుత్వ స్థలాలపై అధికార పార్టీ నేతల కన్ను పడింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని నిర్ణయించారు. ఇంకేముంది..ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ప్రహరీలూ నిర్మించేస్తున్నారు. సర్వే నంబర్లు మార్చి మరి తమ బంధువుల పేరిట పట్టాలు సృష్టించేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. కొందరు అధికారులైతే అధికార పార్టీ నేతలకు దన్నుగా నిలబడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే...
ఎచ్చెర్ల :తోటపాలెంలో రెండు చోట్ల విలువైన భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. పొన్నాడ వైపు వెళ్లే రోడ్డుకు ఆనుకుని సర్వే నంబరు 264-3లో 31 సెంట్లు ఆక్రమణకు గురవుతుంది. ఇప్పటికే ప్రభుత్వ స్థలం చుట్టూ ప్రహరీ నిర్మిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో యథేచ్ఛగా ఆక్రమణ చేసి అధికార పార్టీకి చెందిన ఓ నేత కబ్జా కొనసాగిస్తున్నాడు. ఈ స్థలంలో ఉన్న రాతి బండలు తొలగించి చదును చేశాడు. ప్రహరీ నిర్మాణం సైతం దాదాపుగా పూర్తి చేశాడు. మరోవైపు ఇదే పంచాయతీ కొత్తపేట రోడ్డుకు ఆనుకొని 20 సెంట్లు ప్రభుత్వ స్థలం చుట్టూ స్తంభాలు పాతేశాడు. ఈ భూమిని తన బంధువు పేరిట పట్టా చేరుుంచుకునే ప్రయత్నం మొదలు పెట్టినట్టు సమాచారం. ఈ రెండు స్థలాల విలువ సుమారు రూ.కోటి ఉంటుందని అంచనా. ఇదంతా ఒక ఎత్తై కబ్జా స్థలాలను వేరే వ్యక్తులకు సైతం విక్రయించేందుకు సిద్ధపడుతున్నట్టు తెలిసింది.
ఫిర్యాదుపై స్పందనేదీ?
ఈ ఆక్రమణలపై గ్రామ సర్పంచ్ కడుపు శేఖర్‌రావు, మాజీ సర్పంచ్ కళ్లేపల్లి తిరుపతిరావు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు మంత్రి మోహనరావు తదితరులు ఫిబ్రవరి 10న కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు జిల్లా ల్యాండ్ అండ్ సర్వే విభాగం సర్వేయర్లు 15, 16 తేదీల్లో సర్వే నిర్వహించారు. ఫిర్యాదుదారులు ఆక్రమణలను వివరించారు. ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కోరారు. సర్వే నిర్వహించిన అధికారులు కలెక్టర్‌కు నివేదిక అందజేయనున్నట్టు చెప్పారు.
ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు...
సర్పంచ్, మాజీ సర్పంచ్ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేస్తున్నాం. రికార్డులు, సర్వే నంబర్లు అన్నీ పరిశీలిస్తున్నాం. ప్రభుత్వ స్థలంగా నిర్ధారణ అయితే స్వాధీనం చేసుకుంటాం. ఇప్పటికే సర్వే అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
-బందర వెంకటరావు, తహశీల్దార్, ఎచ్చెర్ల
ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి...
ప్రభుత్వ ఆస్తులు కాపాడాలి. అధికార పార్టీ నాయకుడు గ్రామంలో అన్ని ప్రభుత్వ స్థలాలపై కన్నేశాడు. భూములు అక్రమంగా అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడు. అధికారుల స్పందించి చర్యలు తీసుకోవాలి.
-కడుపు శేఖరరావు,
సర్పంచ్, తోటపాలెం
అక్షరాలా... రూ.కోటి విలువైన స్థలాల కబ్జా
Published Fri, Mar 18 2016 12:41 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement