అభివృద్ధి హామీ ఎన్నికల స్టంట్‌గానే మిగిలిపోతోంది. ఓటర్ల ముందుకొచ్చినప్పుడు అది చేస్తాం.. ఇది చేస్తామనే ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చే నేతలు, అధికారంలోకి రాగానే ఆ బాధ్యత విస్మరిస్తున్నారు. పార్టీలకే పరిమితం కావాల్సిన రాజకీయాలు.. అభివృద్ధికి అడ్డంకిగా మారడం ప్రజలను ఇక్కట్లకు గురిచేస్తోంది. నిధులు మంజూరైనా.. అధికారులు సానుకూలంగా ఉన్నా.. ఆ ప్రాంతంలో ప్రతిపక్ష పార్టీ బలంగా ఉందనే సాకుతో అధికార పార్టీ నేత రోడ్డు నిర్మాణానికి పచ్చజెండా ఊపకపోవడం విమర్శలకు తావిస్తోంది.
అవుకు : అవుకు నుంచి గుండ్ల శింగవరం మీదుగా గడ్డమేకల పల్లె, రామవరం, మెట్టుపల్లె కోనాపురం గ్రామాలను కలుపుతూ దాదాపు 13 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి పీఎంజీఎస్‌వై రెండో విడత కింద ప్రభుత్వం రూ.7.47 కోట్లు మంజూరు చేసింది. నిర్మాణం పూర్తయితే నాలుగు గ్రామాల ప్రజలు తమ కష్టాలు తీరుతాయని సంతోషపడ్డారు. అయితే రాజకీయ అడ్డంకులు ఏర్పడటంతో మంజూరైన నిధులు మురిగిపోతున్నాయి.
ఆ గ్రామాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టుందనే ఒకే ఒక్క సాకుతో రోడ్డు నిర్మాణానికి భూసేకరణ సమస్యగా మారిందని నియోజకవర్గ ప్రజాప్రతినిధి మోకాలడ్డారు. రామవరం నుండి మెట్టుపల్లె వరకు ప్రభుత్వ భూమి 25.35 ఎకరాలు ఉండగా.. రైతుల నుంచి 1.81 ఎకరాలు, కోనాపురం మెట్ట నుండి జంక్షన్ వరకు 4.05 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. రైతుల నుండి 0.42 ఎకరాలు, గడ్డమేకల పల్లె నుండి రామవరం వరకు 2.93 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. 6.40 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది.
గుండ్ల శింగవం నుండి గడ్డమేకల పల్లె వరకు ప్రభుత్వ భూమి 5.56 ఎకరాలు ఉండగా రైతుల నుండి 3.09 ఎకరాలు అవసరమవుతుంది. రోడ్డు నిర్మాణానికి 37.89 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. రైతుల నుండి కేవలం 11.72 ఎకరల భూమిని సేకరించాల్సి ఉంది. రోడ్డు నిర్మాణానికి అవసరమైన భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొచ్చి కలెక్టర్, ఆర్డీఓకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ఆ ప్రజాప్రతినిధి ఆదేశాలతో అధికారులు మౌనం దాల్చారు.
రాజకీయ కక్షతో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ఆయా గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రామవరం- మెట్టుపల్లెకు 5 కిలోమీటర్లు, కోనాపురం మెట్ట నుంచి 2 కిలోమీటర్లు, గడ్డమేకలపల్లె-రామవరానికి 2 కిలోమీటర్లు, గుండ్లశింగవరం- గడ్డమేకలపల్లెకు 4 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం చేపట్టాల్సి ఉంది. నిధులు నిలిచిపోవడంతో గుంతలమయమైన రోడ్డుపై రాకపోకలు సాగించేందుకు ఆయా గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థలు వర్ణనాతీతం.
రోడ్డు నిర్మాణంలో రాజకీయం తగదు
రాజకీయ కక్షతో రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకోవడం హేయమైన చర్య. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన ప్రజాప్రతినిధి అభివృద్ధిని విస్మరించడం తగదు. తాను ఆదే శించే వరకు నిధులను హోల్డ్‌లో పెట్టమని సంబంధిత అధికారులను ఆదేశించడం ఎంతవరకు సమంజసం.- కాటసాని రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, బనగానపల్లె
వైఎస్‌ఆర్‌సీపీ బలంగా ఉందనే
మా గ్రామంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందనే కారణంతోనే రోడ్డు నిర్మాణానికి అడ్డుపడుతున్నారు. రోడ్డు పూర్తయితే ఎన్నో ఏళ్లుగా నెలకొన్న సమస్య పరిష్కారమవుతుంది. ప్రజల కష్టాలు చూసైనా రాజకీయాలకు అతీతంగా రోడ్డు నిర్మాణంపై ఎమ్మెల్యే దృష్టి సారించాలి.
- రమాదేవి, సర్పంచ్, రామవరం
అభివృద్ధికి రాజకీయాలతో ముడిపెట్టొద్దు
రాజకీయ కక్షలతో అభివృద్ధిని అడ్డుకోవడం తగదు. ఈ ప్రాంతంలో ఓట్లు తక్కువ వచ్చాయనే కారణంగా రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడం తగదు.
- రమణ, మెట్టుపల్లె సర్పంచ్
భూములిచ్చేందుకు సిద్ధం
గుండ్లశింగవరం నుండి గడ్డమేకల పల్లె, రామవరం, మెట్టుపల్లె గ్రామలకు రోడ్డు వేయడానికి అవసరమైన భూములు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ రోడ్డు పూర్తయితే మాకెంతో మేలు చేకూరుతుంది. బనగానపల్లెకు వెళ్లేందుకు 20 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది.
- స్వామినాథం, రామవరం
రవాణా సౌకర్యం మెరుగవుతుంది
బీటీ రోడ్డు పూర్తయితే నాలుగు గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగవుతుంది. రైతులు పంట ఉత్పత్తులు తరలించుకునేందుకు సౌకర్యంగా ఉంటుంది.
- మద్దిలేటి, రామవరం
ఎమ్మెల్యే ఆదేశాలు వచ్చాకే పనులు
అవుకు నుంచి గుండ్ల శింగవరం మీదుగా నాలుగు గ్రామాలను కలుపుతూ 13 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి రూ.7.47 కోట్లు మంజూరయ్యాయి. భూ సేకరణ కొంత సమస్యగా ఉంది. అందువల్ల నిధులను హోల్డ్‌లో ఉంచాం. ఈ విషయంలో ఎమ్మెల్యే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నాం. ఆ తర్వాత పనులు చేపడతాం.
- మద్దిలేటి, పంచాయతీరాజ్ డీఈ
పచ్చపాతం
Published Sun, Jun 14 2015 2:58 AM | Last Updated on Thu, Aug 30 2018 5:49 PM