ఆధిపత్య పోరుకు మద్యం కిక్
‘నా అనుమతి లేకుండా ఆమదాలవలసలో మద్యం గొడౌన్ పెట్టమని ఎవరు చెప్పారు.. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా.. నా దగ్గర ఇటువంటివి పనికి రావు. వెంటనే గొడౌన్‌ను ఆమదాలవలస నుంచి టెక్కలి నియోజకవర్గానికి మార్చండి.. ఏం చేస్తారో... ఎలా చేస్తారో.. నాకు అనవసరం.. గొడౌన్ మాత్రం వెంటనే మారాల్సిందే’.. అంటూ ఎక్సైజ్ ఉన్నతాధికారులకు జిల్లాకు చెందిన అధికార పార్టీ అగ్రనేత హుకుం జారీ చేశారు. అయితే అదేమీ కుదరదని అదే పార్టీకి చెందిన మరో కీలక నేత హూంకరిస్తుండటంతో ఎక్సైజ్
అధికారుల పరిస్థితి ఇరకాటంలో పడింది.
శ్రీకాకుళం క్రైం: జిల్లాలోని వైన్‌షాపులకు మద్యం సరఫరా చేసే ఏపీ బే వ రేజెస్ సంస్థ గోదామును పన్ను బకాయిల కారణంతో ఆదాయ పన్ను శాసీజ్ చేయడంతో కొద్దిరోజులుగా ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ద్వారా నేరుగా షాపులకు సరఫరా చేపట్టింది. మద్యం నిల్వలకు ఎక్సైజ్ ఆధ్వర్యంలోనే వేరే గోదాం ఏర్పాటుకు వీలు కల్పిస్తూ జీవో నెం 93 విడుదల చేసింది. ఆ మేరకు ఎక్సైజ్ ఉన్నతాధికారులు నరసన్నపేట, ఆమదాలవలస, పాలకొండ ప్రాంతాల్లోని ప్రభుత్వ గొడౌన్లను పరిశీలించారు. వాటిలో ఆమదావలస గొడౌన్లు అనుకూలంగా ఉన్నాయని భావించి అక్కడ మద్యం నిల్వ చేయడం ప్రారంభించారు. అక్కడి నుంచే జిల్లా అంతటికీ సరఫరా చేస్తున్నారు.
ఈ నెల 2న ఎచ్చెర్ల బెవరేజస్ గొడౌన్ మూతపడడం, సరఫరా నిలిచిపోవడంతో గగ్గోలు పెట్టిన మద్యం షాపుల నిర్వాహకులు ఎట్టకేలకు సరఫరా ప్రారంభం కావడంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ తరుణంలో జిల్లాకు చెందిన అధికా ర పార్టీ అగ్రనేత రాజకీయ క్రీడను ప్రారంభించారు.గొడౌన్ మార్పునకు ఒత్తిళ్లు: ఆమదాలవలసలో ఇప్పటికే ప్రారంభమైన ఎక్సైజ్ గొడౌన్‌ను టెక్కలికి మార్చేందుకు వీలుగా ఆ నేత తన రాజకీయ పలుకుబడినిప్రయోగిస్తున్నారు. తనకు చెప్పకుండా ఆమదాలవలసలో గొడౌన్ ఎందుకు ప్రారంభించారంటూ జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులపై నిప్పులు చెరిగినట్టు సమాచారం. ఎలాగైనా దాన్ని టెక్కలికి మార్చాలని లేకుంటే ఉపేక్షించేది లేదని తేల్చ చెప్పినట్టు ఎక్సైజ్ వర్గాల ద్వారా తెలిసింది.
తమ వారికి కట్టబెట్టేందుకే!
ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం గొడౌన్ నిర్వహణను ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వనున్నారు. సదరు గొడౌన్ టెక్కలి నియోజకవర్గంలో ఉంటే తమకు అనుయాయులకు ఏజెన్సీ కట్టబె ట్టడం సులభతరం అవుతుందన్నది ఆ నేత ఆలోచన. అంతేకాకుండా ఏ ప్రాంతంలో గొడౌన్ పెడితే ఆ ప్రాంతంలోని హమాలీలే గొడౌన్‌లో పని చేసే అవకాశం ఉంది. ఆమదాలవలసలో గొడౌన్ ప్రారంభించినప్పుడు ఎచ్చెర్ల బెవరేజస్ గొడౌన్‌లో పని చేసిన హమాలీలు వచ్చి గొడవ పడినా ఆమదావలస హమాలీలకే ఎక్సైజ్ అధికారులు అండగా నిలవడమే ఉదాహరణ. ఈ నేపథ్యంలో టెక్కలి నియోజకవర్గానికి గొడౌన్‌ను తరలిస్తే అక్కడి హమాలలకు పని దొరికే అవకాశం ఉంది. దీని వల్ల తన నియోజకవర్గంలో కొందరికి ఉపాధి కల్పించినట్లవుతుందని ఆ నేత ఉద్దేశం.
ఆధిపత్య పోరు: గొడౌన్ ఏర్పాటు వెనుక అధికార పార్టీలోని ఆధితప్య పోరు కూడా ఉంది. ఆమదాలవలసకు చెందిన టీడీపీ నేత కావాలనే ఎక్సైజ్ గొడౌన్ తెప్పించుకున్నారని, వాస్తవానికి పాలకొండలో గొడౌన్ ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ నేత పట్టుబట్టి ఆమదాలవలసకు మార్పించారన్న ఆరోపణలున్నాయి. అయితే ఆమదాలవలస నేత కన్నా తానేమీ తక్కువ కాదని, రాష్ట్రంలోనే కీలకస్థాయిలో ఉన్నానని ఎలాగైనా గొడౌన్‌ను టెక్కలికి మార్చాలని మరో నేత ఒత్తిడి పెంచారు. ఆ మేరకు ఎక్సైజ్ అధికారులకు సదరు నేత హుకుం జారీ చేయగా, మార్చితే ఊరుకునేది లేదని ఆమదావలస నేత కూడా అదేస్థాయిలో హెచ్చరిస్తున్నట్లు సమాచారం. ఏం చేయాలో తెలి యక ఎక్సైజ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
మద్యం వ్యాపారులకు మరిన్ని ఇక్కట్లు
ఇద్దరు అగ్రనేతల మధ్య జరుగుతున్న ఆధితప్య పోరు ఫలితంగా మద్యం వ్యాపారులకు మరిన్ని అవస్థలు తప్పవనిపిస్తోంది. ఆమదాలవలసలో గొడౌన్ ప్రారంభించినప్పటికీ జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో దుకాణాలకు మద్యం సరఫరా కాలేదు. ఈ నేపథ్యంలో మళ్లీ గొడౌన్ మారిస్తే మరికొన్ని రోజులు సరఫరా నిలిచిపోయే అవకాశముంది. అందువల్ల ఎక్సైజ్ గొడౌన్‌ను ఆమదాలవలసలోనే కొనసాగించాలని మద్యం వ్యాపారులు కోరుతున్నారు. ఇప్పటికే తమకు నష్టం వాటిల్లిందని ఇకపై మరింత నష్టం జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు.