రమ్మీ... రమ్మటోందా?
శ్రీకాకుళం: ఈజీ మనీ... క్షణాల్లో లక్షాధికారుమైపోవాలనే ఆలోచన చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. ఈ ఆలోచననే అదనుగా చేసుకుని ఊరిలో బెట్టింగ్ నుంచి ఆన్‌లైన్‌లో పేకాట వరకు అంతా మోసం చేయడానికి రెడీ అయిపోతున్నారు. యువత కూడా ఈజీగా వీరి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఫేస్‌బుక్ తెరిస్తే చాలు ఊరూ పేరూ లేని వ్యక్తులు ‘మేం అంత గెలిచాం.. ఇంత గెలిచామంటూ’ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏదో వెబ్‌సైట్ బ్రౌజ్ చేద్దామన్న రమ్మీ అంటూ రమ్మంటూ ప్రకటనలు కనిపిస్తున్నాయి.
క్షణాల్లో డబ్బులు సంపాదించాలనే యా వతో జిల్లాలోనూ చాలా మందికి వీటికి అలవాటు పడుతున్నారు. ఫలితంగా ఉన్న డబ్బులు క్షవరం చేయించుకుని మోసపోతున్నారు. బంగారు ఆభరణాలతోపాటు విలువైన వస్తువులను తనఖా పెట్టి మరీ జూదమాడి కుదేలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ కూడా ఇలాగే తయారైంది. చాలా మంది పాకెట్ మనీగా ఇళ్లల్లో ఇచ్చింది ఇలాంటి బెట్టింగులపై పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు.
బైకులు, సెల్‌ఫోన్‌లు వంటి ఖరీదైన వస్తువులను అమ్మి జూదం, బెట్టింగ్‌లకు పెడుతున్న వారూ ఉన్నారు. ఇటీవలి కాలంలో పోలీసులకు చిక్కిన నేరస్తుల్లో ఎక్కువమంది యువకులే కావడం, వీరంతా బెట్టింగ్, జూదంలోనే పట్టుబడుతుండడమే దీనికి నిదర్శనం. బెట్టింగు నిర్వహిస్తున్న వారు అన్ని వర్గాల అధికారులను తమ దారిలోకి తెచ్చుకునేందుకు నెలనెలా లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక ఆన్‌లైన్ జూదాన్ని అదుపులోకి ఎలా తేవాలన్నది ఎవరికీ తెలి యడం లేదు. అలాగే జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 20 వరకు జూదశాలలు నడుస్తున్నట్లు అనధికారిక లెక్క ప్రకారం తెలుస్తోంది. వీటిలో కొన్ని ప్రజాప్రతినిధులు, కొందరి అధికారుల కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటిని తక్షణంఅరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.