కర్నూలు(అగ్రికల్చర్): వ్యవసాయ రుణమాఫీపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఎలాగైన అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సాధారణ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని దాట వేస్తున్నారు. రోజుకో ప్రకటనలతో వారిని నాలుగునెలలుగా మభ్యపెడుతున్నారు. వీలైనంత వరకు నీరు రుణమాఫీని నీరుగార్చాలని ప్రయత్నిస్తున్నారు. జిల్లాలో బ్యాంకర్లకు పంట రుణాల రూపంలో ఆరు లక్షల మందికి పైగా రూ.3600 కోట్లు బకాయి పడ్డారు. ఎన్నికల సమయంలో ప్రచారం ముగింపు రోజు వరకు బ్యాంకుల నుంచి తీసుకున్న వ్యవసాయ రుణాలను ఎవ్వరు చెల్లించవద్దు. నేను అదికారంలోకి వచ్చిన తర్వాత రుణాలన్నింటిని మాఫీ చేస్తానని విస్పష్టంగా ప్రకటించారు. తీరా అధికారం చేపట్టి విధి విధానాల రూపొందించేందుకు మొదటి సంతకంతో కమిటీ వేసి జాప్యానికి తెర లేపారు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత 2013 డిసెంబర్ చివరిలోగా తీసుకున్న రుణాల్లో నిల్వ ఉన్న వాటినే మాఫీ చేస్తామంటూ ప్రకటించారు.
కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని ఒకరు ఉంటే రూ.1.50 లోలు ఇద్దరు ఉంటే రూ.75 వేలు, ముగ్గురు సభ్యులు ఉంటే రూ.50 వేలకు మాత్రమే రుణమాఫీని పరిమితం చేశారు. పంట రుణాల మాఫీ లబ్ధిదారుల జాబితాను రూపొందించారు. తర్వాత వీటికి అదనంగా రైతు సాగు చేసిన భూముల విస్తీర్ణం, పంట, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ వివరాలు కూడా రైతు వారీగా తయారు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు పంట రుణాల మాఫీకి అర్హులైన వారి జాబితాను రూపొందించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఇదిలా ఉండగా ఇటీవల మంత్రివర్గ సమావేశంలో పంట రుణాల మాఫీ కాదు.. రైతులకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించారు. రైతులకు ఆర్థిక సహాయం అందించడం కోసం రైతు సాధికార సంస్థను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా రైతులకు రుణ విముక్తి పత్రాలు అందించే నాలుగేళ్లలోగా అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందించే విధంగా నిర్ణయించారు. తొలుత సన్న, చిన్నకారు రైతులకు రూ.50 వేల ప్రకారం ఆర్థిక సహాయం చేసేలా రుణ విముక్తి పత్రాలు జారీ చేస్తామని ప్రకటించడం గమనార్హం.
రైతులను నిండా ముంచారు..: ముఖ్యమంత్రి చంద్రబాబు పంట రుణాలను మాఫీ చేస్తారనే ఉద్దేశంతో రైతులు గతేడాది తీసుకున్న రుణాలను చెల్లించలేదు. కనీసం 95 శాతం మంది రైతులు రెన్యువల్ కూడా చేసుకోలేదు. రుణమాఫీ అమలు చేయకపోవడం రెన్యువల్ గడువు ముగియడంతో రైతులు తీసుకున్న పంట రుణాలను 13.75 శాతం వడ్డీతో బ్యాంక్ అధికారులు వసూలు చేస్తున్నారు. పంట రుణాల మాఫీ కాదు.. ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రైతులు అప్పులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ తీరుతో జిల్లా రైతులపై రూ.250 కోట్ల వడ్డీ భారం పడుతోంది. డ్వాక్రా రుణాల మాఫీని నీరు గార్చిన తరహాలోనే రైతుల వ్యవసాయ రుణాల మాఫీని చంద్రబాబు నీరు గార్చే యత్నాల్లో ఉన్నట్లు ఆయన రోజుకో విధంగా చేస్తున్న ప్రకటనలు స్పష్టం చేస్తున్నాము. మభ్యపెట్టేవిధంగా ఉన్న ప్రభుత్వ వెఖరిని జన్మభూమి కార్యక్రమంలో రైతులు ఎండగడుతున్నారు.
రుణమాఫీపై నీలి నీడలు!
Published Sun, Oct 5 2014 12:21 AM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM
Advertisement
Advertisement