అధికారులు సీజ్ చేసిన విజయవాడలోని నారాయణ స్కూల్
బెల్టు షాపులు అంటూ మద్యం అమ్మకాలకు సంబంధించి తరచూ వింటూ ఉంటాం.. అంటే అనుమతులు లేకుండా చిన్న బడ్డీ కొట్లలో అక్రమంగా మద్యం విక్రయించడం. ఈ జాడ్యం ఇప్పుడు విద్యావ్యవస్థకూ పాకింది. ఒక పాఠశాల నిర్వహించేందుకు అనుమతి తీసుకుంటారు.. అదే అనుమతితో రెండు మూడు సబ్ బ్రాంచ్‌లు పెట్టేస్తారు. వీటికి అనుమతులుండవు.. అధికారులు ప్రశ్నిస్తే ట్యూషన్ సెంటర్లంటూ నమ్మిస్తారు. దీంతో జిల్లాలో ‘బెల్టు’ స్కూళ్ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.
సాక్షి, అమరావతి బ్యూరో: జిల్లాలో బెల్టు షాప్‌ల మాదిరి బెల్టు స్కూళ్లు యథేచ్ఛగా పనిచేస్తున్నాయి. గుర్తింపు పొందితే అధికారుల తనిఖీలు, ఫీజులు, పద్ధతులు పాటించాల్సి వస్తుందని చాలా స్కూళ్లు అనుమతి జోలికి పోవడం లేదు. కార్పొరేట్, పేరు మోసిన ప్రైవేట్ సంస్థలు ఒక్క స్కూల్‌కు అనుమతి తీసుకొని, వాటితో రెండు మూడు బ్రాంచ్‌లను నడుపుతూ క్యాష్ చేసుకుంటున్నాయి. స్థానిక అధికారులు ప్రశ్నిస్తే ట్యూషన్లు నడుపుతున్నామని చెప్పి తప్పించుకుంటున్నారు.
గుర్తింపు లేకపోతే సరి..!
స్కూల్ పెట్టాలంటే స్థానిక సంస్థల అనుమతితో పాటు ట్రాఫిక్ పోలీసు, అగ్నిమాపక శాఖ, భవననిర్మాణ శాఖ, విద్యాశాఖ, పట్టణ పారిశుద్ధ్యశాఖల అనుమతి పొందాల్సి ఉంటుంది. వీటితో పాటు వాహనాలు ఉంటే వాటికి రవాణా శాఖ అనుమతి కూడా పొందాలి. విద్యార్థి ఒకొక్కరి పేరిట గుర్తింపు ఫీజులను చెల్లించాలి. ఇంత పెద్ద ఎత్తున ఫీజులు చెల్లించి తడిసిమోపెడు ఖర్చు చేసే బదులు ఎలాంటి గుర్తింపు లేకుండా పాఠశాలలను నడపడం, అక్కడ చదివే విద్యార్థులను ఇతర స్కూళ్ల నుంచి పరీక్షకు అనుమతించడం చాలా తేలికైన అంశంగా మారింది. ప్రతి పాఠశాల నుంచి ఎగ్జంప్షన్ ఫీజు చెల్లించి ప్రైవేటు స్టడీ విద్యార్థులు, రెగ్యులర్ విద్యార్థులు హాజరుకావచ్చు. కొన్ని స్కూళ్లు తమ స్కూళ్లలో చదవకపోయినా ఇతర స్కూళ్ల వారిని కూడా తమ విద్యార్థులుగానే రికార్డుల్లో చూపిస్తున్నాయి. వాటిని తనిఖీ చేసే యంత్రాంగం లేకపోవడంతో ఆడిందే ఆటగా వారు రాసిందే రికార్డుగా మారిపోయింది.
జిల్లాలో దాదాపు 80 స్కూళ్లు...
కృష్ణా జిల్లా పరిధిలో అనుమతులు లేకుండా అక్రమంగా నిర్వహిస్తున్న పాఠశాలలు దాదాపు 80 వరకు ఉన్నాయి. ఇందులో ఒక్క విజయవాడ నగరంలోనే 60 స్కూళ్ల వరకు గుర్తింపు లేని పాఠశాలలు ఉండగా, ఇతర ప్రాంతాల్లో మరో 20 దాకా ఉన్నాయని సమాచారం. వీటిలో అగ్రభాగం నారాయణ, శ్రీచైతన్య, తదితర కార్పొరేట్ పాఠశాలలే అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.
విద్యా వ్యవస్థ ప్రక్షాళన దిశగా..
ఇది వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉండటం, భారీగా ముడుపులు అందజేయటం వంటి కారణాల వల్ల వీటిపై దాడులు జరగకుండా పోయాయి. కొత్త ప్రభుత్వం విద్యా సంస్కరణలపై ప్రత్యేక దృష్టి చూపటంతో వీటిపై దాడులు మొదలయ్యాయి. బుధవారం విజయవాడలోని సత్యనారాయణపురంలోని అనుమతి లేని నారాయణ స్కూల్‌పై విద్యాశాఖాధికారులు దాడి చేసి లక్ష రూపాయలు జరిమానా, తాత్కాలికంగా సీజ్ చేశారు. విద్యాసంవత్సరం ఆరంభంలో కేవలం నోటీసులు, జరిమానాలతో సరిపెడుతున్నారు తప్ప కఠిన చర్యలు తీసుకోవటం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment