భారత్‌లో రష్యా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ
- రష్యా షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ అధ్యక్షుడు రక్మణోవ్
- ద్వైపాక్షిక సంబంధాలపై విశాఖలో రెండు రోజుల సదస్సు ప్రారంభం
సాక్షి, విశాఖపట్నం: రక్షణ రంగ ఉత్పత్తుల్లో భారత్‌కు సహకారం అందించడానికి రష్యా సిద్ధంగా ఉందని ఆ దేశ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ అధ్యక్షుడు అలెక్సీ ఎల్.రక్మణోవ్ తెలిపారు. రక్షణ రంగ ఉత్పత్తుల్లో అవకాశాలు, భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాలపై రెండు రోజుల సదస్సు విశాఖలో మంగళవారం ప్రారంభమైంది. కార్యక్రమంలో భారత్, ముఖ్యంగా విశాఖలో షిప్ బిల్లింగ్, రక్షణ రంగ ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటుకు ఉన్న అవకాశాలను నేవీ, ఏపీ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు వివరించారు.
సదస్సులో, మీడియాతో రక్మణోవ్ మాట్లాడుతూ రష్యా షిప్ యార్డులు, వాణిజ్య ఉత్పత్తులు, హైస్పీడ్ వెసెల్స్, రివర్-సీ-టైప్ వెసల్స్, రక్షణ ఉత్పత్తుల వివరాలను వెల్లడించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి, పరిజ్ఞానాన్ని, సాంకేతికతను పరస్పరం పంచుకోవడానికి రష్యా సిద్ధంగా ఉందన్నారు. ఈ ఏడాది డిసెంబర్‌లో భారత్‌లో ప్రాజెక్టులు ప్రారంభిస్తామన్నారు. తూర్పు నావికాదళ ఫ్లాగ్ అధికారి, వైస్ అడ్మిరల్ హెచ్‌సీఎస్ బిస్త్ మాట్లాడుతూ మేకిన్ ఇండియా పేరుతో ప్రధాని మోదీ చేస్తున్న కార్యక్రమాల్లో మొట్టమొదటిగా పాల్గొన్న దేశం రష్యా కావడం ఆనందంగా ఉందన్నారు.