‘సాక్షి’పై కక్ష సాధింపు | vengeance on sakshi | Sakshi
Sakshi News home page

‘సాక్షి’పై కక్ష సాధింపు

Published Sun, Sep 4 2016 2:03 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

‘సాక్షి’పై కక్ష సాధింపు - Sakshi

‘సాక్షి’పై కక్ష సాధింపు

ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాలు బేఖాతర్
- గుంటూరు ‘సాక్షి’ కార్యాలయం గోడకు నోటీసు అతికించిన పోలీసులు
- మార్చి 2న ప్రచురించిన కథనాలకు ఆధారాలివ్వాలని స్పష్టీకరణ
 
 సాక్షి, గుంటూరు/శ్రీకాకుళం:
రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అవినీతి, అక్రమాలపై వార్తలు రాసిన ప్రతిసారీ పత్రికా విలేకరులపై పోలీసుల ద్వారా కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేస్తున్నారు. ముఖ్యంగా ‘సాక్షి’ పత్రికలో ప్రభుత్వ, టీడీపీ నేతల అవినీతిపై కథనాలు వచ్చినప్పుడల్లా ఏదో ఒక కేసు నమోదు చేసి, నోటీసుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నారు. రాజధానిలో టీడీపీ నేతల భూ దందాలపై ‘సాక్షి’ వరుస కథనాలు ప్రచురించిన విషయం తెలిసిందే. రాజధాని ప్రకటనకు ముందు అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలంతా అమరావతి చుట్టుపక్కల అతి తక్కువ ధరలకు భూములు కొనుగోలు చేసి, రైతులను మోసం చేసిన వైనాన్ని ఆధారాలతో సహా ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది.

ఈ కథనాలు రాష్ట్రవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించాయి. జాతీయ నేతల దృష్టికి కూడా వెళ్లాయి. అధికార పార్టీ నేతల అవినీతి బాగోతం బట్టబయలు కావడంతో ‘సాక్షి’పై అక్కసుతో రాజధాని గ్రామాలకు చెందిన టీడీపీ కార్యకర్తలతో ఫిర్యాదులు చేయించి, పోలీసులపై ఒత్తిడి తీసుకొచ్చి కేసులు నమోదు చేశారు. ‘సాక్షి’ విలేకరులు విచారణకు రాావాలంటూ పిలిపించడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీనిపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వం, డీజీపీ, గుంటూరు జిల్లా ఎస్పీలకు నోటీసులు జారీ చేసింది. దీంతో పోలీసులు కొంతకాలంపాటు మిన్నకుండిపోయారు. అయితే, ప్రభుత్వం, అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలపై ‘సాక్షి’లో కథనాలు వచ్చిన ప్రతిసారీ నోటీసుల పేరుతో బెదిరింపులకు దిగుతున్నారు.

తాజాగా శనివారం మంగళగిరి పోలీసులు గుంటూరులోని ‘సాక్షి’ కార్యాలయం గోడకు నోటీసు అతికించి వెళ్లారు. ‘‘2016 సెప్టెంబర్ 5వ తేదీ ఉదయం 10 గంటలలోపు మీ వద్ద ఉన్న సమాచారం కానీ, డాక్యుమెంట్లు కానీ మంగళగిరి రూరల్ సీఐకి అందించాలి. సాక్షి దినపత్రికలో 2016 మార్చి 2న ప్రచురించిన అంశాలు, టీవీ చానల్‌లో చూపించిన అంశాలకు సంబంధించి మీ వద్ద ఉన్న ఆధారాలు, పత్రాలు సీఐకి అందించాల్సిందిగా కోరుతున్నాం’’ అని ఆ నోటీసులో పేర్కొన్నారు. అలాగే మంగళగిరిలోని ‘సాక్షి’ యూనిట్ కార్యాలయంలో బ్రాంచ్ మేనేజర్ గదికి కూడా నోటీసు అతికించారు. ‘సాక్షి’ విలేకరులకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. వేధింపులు ఆపకపోతే ఆందోళనలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.

 కక్ష సాధిస్తే సహించం: ఏపీయూడబ్ల్యూజే  
 శ్రీకాకుళం: రాష్ట్ర ప్రభుత్వం మీడియాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే సహించేది లేదని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్(ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నల్లి ధర్మారావు, ఐవీ సుబ్బారావు పేర్కొన్నారు.
 
 పత్రికలపై దాడి అసాంఘిక చర్య

 ‘‘అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయ నాయకులు సాగిస్తున్న అక్రమాలను బయటపెడుతున్న పత్రికలపై దాడికి దిగడం అసాంఘిక చర్య.  సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనాలు నిజమా, కాదా.. అనేది విచారణ జరిపి, వాటిని బహిర్గతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.  కథనాలకు ఆధారాలు చూపమనడం సరైనది కాదు.’’
 - పెనుగొండ లక్ష్మీనారాయణ, సీనియర్ న్యాయవాది, అరసం జాతీయ కార్యదర్శి
 
 భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి
 నోటీసులను ఖండించిన ఐజేయూ
 హైదరాబాద్: సాక్షి విలేకరులకు పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) తీవ్రంగా ఖండించింది. ఇది నిస్సం దేహంగా భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడేనని విమర్శించింది. పత్రికా స్వేచ్ఛను హరించడమే అవుతుందని ఐజేయూ అధ్యక్షులు ఎస్.ఎన్.సిన్హా, సెక్రెటరీ జనలర్ అమర్, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు అమర్‌నాథ్, ప్రభాత్‌దాస్ శనివారం పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement