పత్రికలు ప్రజలకు గొంతునిస్తాయి. అవి నిజాలను చాటుతాయి. అక్రమాలను వెలికితీస్తాయి. అన్యాయాలను ఎండగడతాయి. ప్రజల పక్షాన నిలబడతాయి. పత్రికలు ప్రజలకు గొంతునివ్వడం, అవి నిజాలను చాటడం, అక్రమాలను వెలికితీసి, అన్యాయాలను ఎండగట్టడం కొందరికి సహజంగానే మింగుడుపడదు. ముఖ్యంగా అధికారం తలకెక్కిన వారికి పత్రికల తీరు అసలే కొరుకుడుపడదు. ప్రపంచంలో చాలా ప్రజాస్వామిక దేశాల్లోని రాజ్యాంగాలు పత్రికల స్వేచ్ఛకు భరోసా ఇస్తున్నా, అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమాలకు, అన్యాయాలకు తెగబడే పాలక వర్గాలు మాత్రం పత్రికల స్వేచ్ఛను కట్టడి చేయడానికి శతవిధాలా ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటాయి. రాజ్యాంగ పరిధిలో పత్రికల స్వేచ్ఛకు కళ్లెం వేసే పరిస్థితి కుదరనప్పుడు పాత్రికేయులపై బలప్రయోగం ద్వారా, వారిలో భయాందోళనలను సృష్టించడం ద్వారా పత్రికలను లొంగదీసుకునే ప్రయత్నాలు సాగిస్తుంటాయి. అధికారం అండతో పెట్రేగిపోయే నేర ముఠాలు పాత్రికేయులపై భౌతిక దాడులకు పాల్పడటం, కొన్ని సందర్భాల్లో పాత్రికేయులను ఏకంగా అంతమొందించడం వంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇంకొన్నిసార్లు నిజాలు వెల్లడిస్తూ వార్తాకథనాలు రాసినందుకు కేసుల్లో ఇరికిస్తున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి.
అతిపెద్ద ప్రజాస్వామ్యమే...
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచంలో గుర్తింపు పొందినా, పత్రికా స్వేచ్ఛలో మాత్రం మన దేశం దాదాపు అట్టడుగు స్థానంలోనే ఉంది. రాచరిక పాలనలో ఉన్న దేశాలు, నేపాల్, భూటాన్ వంటి చిన్న చిన్న పొరుగు దేశాలు, చివరకు వెనుకబడిన ఆఫ్రికన్ దేశాల్లో కొన్ని సైతం పత్రికా స్వేచ్ఛలో మనకంటే మెరుగైన పరిస్థితిలోనే ఉన్నాయి. ‘రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్’ 2017 సంవత్సరానికి విడుదల చేసిన ‘ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్’ ప్రకారం పత్రికా స్వేచ్ఛలో మనది 136వ స్థానం. ఇది 180 దేశాల జాబితా. మన దేశంలో పత్రికా స్వేచ్ఛ ఏ స్థాయిలో వర్ధిల్లుతున్నదో అర్థం చేసుకోవడానికి ఈ జాబితా చూస్తే చాలు. అంతకు ముందు ఏడాది, అంటే 2016లో ‘ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్’ జాబితాలో మన దేశం 133వ స్థానంలో ఉంటే, గడచిన ఏడాది వ్యవధిలో జరిగిన సంఘటనల నేపథ్యంలో ఇది మరో మూడు స్థానాలకు దిగజారింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇదీ పరిస్థితి...
మన దేశంలో పత్రికా స్వేచ్ఛకు సంబంధించి జమ్ము కశ్మీర్, కర్ణాటక రాష్ట్రాల్లో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. వాటి తర్వాత ఆంధ్రప్రదేశ్ పరిస్థితులనే చెప్పుకోవాలి. ప్రస్తుత ‘పచ్చ’పాలనలో రాష్ట్రంలోని పాత్రికేయులకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. పాలకపక్ష నాయకుల అండతో పాత్రికేయులపై జరిగిన దాడులు, హత్యలు పత్రికా స్వేచ్ఛలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని తేటతెల్లం చేస్తున్నాయి. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ‘ఆంధ్రప్రభ’ రిపోర్టర్ శంకర్ 2015లో మంత్రి పత్తిపాటి పుల్లరావు అనుచరుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బృందం విచారణ కూడా జరిపింది. ‘సాక్షి’ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్ సురేంద్ర కూడా మంత్రి అనుచరుల దాష్టీకానికి బలైపోయారు. మంత్రి అనుచరులు తొలుత ఆయనపై భౌతిక దాడికి పాల్పడ్డారు. తర్వాత ఆయన భూముల్లో అక్రమంగా క్వారీయింగ్ చేయించి, ఇష్టానుసారం తవ్విపారేశారు. అప్పులు తీర్చలేక, భూమిని అమ్ముకోవడానికి వీలులేని పరిస్థితుల్లో మనస్తాపం చెందిన సురేంద్ర పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.
అనంతపురం జిల్లా కదిరిలో టీడీపీ నేత, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ గుడిసె దేవానంద్ గత ఏడాది అక్టోబర్‌లో ‘సాక్షి’ ఆర్‌సీ ఇన్‌చార్జ్ సి.శ్రీనివాసరెడ్డిపై పట్టపగలు అందరూ చూస్తుండగానే హత్యాయత్నానికి తెగబడ్డారు. మటన్ కొట్టే కత్తితో శ్రీనివాసరెడ్డిపై దేవానంద్ దాడి చేశారు. స్థానికుల సాయంతో శ్రీనివాసరెడ్డి ఆ దాడి నుంచి తప్పించుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, కులం పేరిట తనను దూషించాడంటూ దేవానంద్ తప్పుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ‘సాక్షి’ పాత్రికేయుడిపై కేసు నమోదు చేశారు. దేవానంద్ స్థానిక ఒక మైనారిటీ వ్యక్తి వద్ద అప్పు తీసుకోవడమే కాకుండా అతడిని ముప్పు తిప్పలు పెడుతున్న విషయమై వార్తాకథనం రాయడం వల్లనే ఆయన ‘సాక్షి’ పాత్రికేయుడిపై ఈ దారుణానికి ఒడిగట్టారు. అనంతపురం జిల్లాలోనే తాడిపత్రిలో జేసీ సోదరుల అరాచకాలు శ్రుతిమించుతుండటంతో 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన మంత్రివర్గంలో జేసీ దివాకర్‌రెడ్డికి చోటు కల్పించలేదు. వైఎస్ నిర్ణయంపై రెచ్చిపోయిన జేసీ సోదరులకు చెందిన రౌడీ మూకలు తాడిపత్రిలోని ‘సాక్షి’ ప్రాంతీయ కార్యాలయంలో విలేకరి రాజశేఖర్‌ను బంధించి, కార్యాలయానికి నిప్పంటించారు. ఆ సంఘటనలో రాజశేఖర్ ప్రాణాలు కోల్పోయారు. తాడిపత్రిలోనే గత ఏడాది డిసెంబర్ 26న ‘సాక్షి’ విలేకరి రవిపై జేసీ రౌడీ మూకలు దాడికి తెగబడ్డాయి. కర్నూలు జిల్లాలోనైతే గడచిన ఆరు నెలల వ్యవధిలోనే నలుగురు పాత్రికేయులపై దాడులు జరిగాయి. మంత్రి అఖిలప్రియను విమర్శిస్తూ కథనాలు రాసినందుకు ఆళ్లగడ్డ ‘సాక్షి’ ఆర్‌సీ ఇన్‌చార్జ్ కృష్ణయ్యపై దీపావళి పండుగ రోజున దుండగులు దాడిచేసి తీవ్రంగా గాయపరచారు. మంత్రి అఖిలప్రియ ఇలాకాలోనే చాగలమర్రి మండలం గొడగనూరులో బెల్టుషాపులు నడుపుతున్నారనే కథనం ప్రసారం చేసినందుకు ‘మన తెలుగు’ టీవీ చానెల్ విలేకరిపై దాడి జరిగింది. ప్యాపిలి మండలంలో ‘మనం’ దినపత్రిక విలేకరి ఇబ్రహీంపైన, వెలుగోడు మండలంలో ‘విశాలాంధ్ర’ రిపోర్టర్ రామాంజనేయులుపైన కూడా దాడులు జరిగాయి.
తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం ‘సాక్షి’ విలేకరి జోగేష్‌పై 2015లో ఆర్థిక మంత్రి యనమల అనుచరులు దాడి చేశారు. నీటి సంఘాల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలను ఫొటో తీస్తుండగా, ఆయనపై దాడిచేసి, కెమెరాను ధ్వంసం చేశారు. రెండేళ్ల కిందట ఇసుక మాఫియా కార్యకలాపాలను ఫొటో తీసేందుకు ప్రయత్నించిన పి.గన్నవరం మండలం ‘ప్రజాశక్తి’ విలేకరి అల్లాడి వెంకటరమణమూర్తిపై అధికార పార్టీ అండదండలు గల కాంట్రాక్టర్ల అనుచరులు దాడిచేశారు. అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామంలో జరుగుతున్న అక్రమ మట్టి తవ్వకాలపై వార్తాకథనం రాసిన ఓ పత్రిక విలేకరి చెరుకూరి స్వామినాయుడును మట్టి మాఫియా దుండగులు చెట్టుకు కట్టేసి కొట్టారు.
– ఇన్‌పుట్స్: సాక్షి నెట్‌వర్క్ – ఆంధ్రప్రదేశ్
Comments
Please login to add a commentAdd a comment