కరీంనగర్ ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్ : రాజీవ్ విద్యామిషన్ కింద పనిచేస్తున్న 42 కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, మరో తొమ్మిది ఎన్జీవోల ద్వారా నడుస్తున్న పాఠశాలల్లో ప్రత్యేకాధికారుల నియామక ప్రక్రియ మొదటి నుంచి గందరగోళంగా సాగుతోంది. జిల్లాలోని కేజీబీవీలలో స్పెషలాఫీసర్ల నియామకం కోసం ఎంపికైన జాబితాను అధికారులు మార్చారంటూ అభ్యర్థులు ఆందోళనకు దిగడంతో ఇందులో అక్రమాలు జరిగానే అనుమానాలు బలపడుతున్నాయి.
జిల్లాలో 51 మంది ప్రత్యేకాధికారుల నియామకం కోసం నవంబర్ 10న నిర్వహించిన రాత పరీక్షకు 1,885 మంది అభ్యర్థులు హాజరయ్యారు. 371 మంది అర్హత సాధించగా.. రోస్టర్ కం మెరిట్ ఆధారంగా 49 పాఠశాలలకు 49 మందిని ప్రత్యేకాధికారులుగా ఎంపిక చేశారు. ఈ నెల 4న డ్వామా సమావేశ మందిరంలో వీరికి కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలన పూర్తి చేశారు. ఎంపిక చేసిన వారిలో నియామకం కోసం ఒక్కొక్కరికి మూడు పాఠశాలల్లో ఆప్షన్‌లు తీసుకుని పంపించారు. రోస్టర్ విధానంలో అవకతవకలున్నాయని, రెండు రోజుల తర్వాత కలెక్టర్‌కు దళిత సంఘాలు ఫిర్యాదు చేశాయి. రోస్టర్ విధానంలో నిబంధనలు పాటించాలని ఆర్వీఎం పీవోను కలెక్టర్ ఆదేశించారు. దీంతో తిరిగి ఆప్షన్ల మార్పు కోసం అభ్యర్థులకు అధికారుల నుంచి ఫోన్లు వచ్చాయి.
ఇందులో కొంతమంది అభ్యర్థులు ఆప్షన్‌లు ఇవ్వగా.. మరికొంత మంది అభ్యర్థులు పట్టించుకోలేదు. తిరిగి మంగళవారం రాత్రి నుంచి అభ్యర్థులకు మరోసారి ఆర్వీఎం కార్యాలయం నుంచి ఫలానా చోట జాయిన్ కావాలంటూ, బుధవారం ఉదయం 9గంటలకు కార్యాలయంలో రిపోర్టు చేయాలంటూ ఫోన్లద్వారా ఆదేశాలు జారీ చేశారు. హుటాహుటిన డ్వామా కార్యాలయానికి ఉదయం చేరుకున్న అభ్యర్థులలో ఆరుగురికి తాము కోరుకున్న ఆప్షన్‌లు కాకుండా ఇష్టానుసారంగా పోస్టింగ్ కేటాయించారు. రోస్టర్ కం మెరిట్ పద్ధతికి తిలోకదకాలిచ్చి అధికారులు ఇష్టానుసారంగా పోస్టింగ్‌లు వేశారంటూ అభ్యర్థులు ఆందోళన చేశారు. తాము కోరుకున్న చోటు కాకుండా మరోచోటికి ఎలా వెళ్లేదంటూ వాగ్వివాదానికి దిగారు.
ఎస్‌ఎఫ్‌ఐ ఆందోళన
రోస్టర్ కం మెరిట్ విధానం ఎలా పాటించారో, ముందు తెలిపిన విధంగా కాకుండా ఆరుగురికి స్థాన చలనం ఎలా జరిగిందో స్పష్టం చేయాలని కౌన్సెలింగ్ హాల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అర్ల నాగరాజు, బండారి శేఖర్, రాజునాయక్, తిరుపతినాయక్ ఆధ్వర్యంలో ఆర్వీఎం పీవో శ్యాంప్రసాద్‌లాల్‌ను నిలదీస్తూ బైఠాయించారు. దీంతో గంటపాటు గందరగోళం చెలరేగింది. బాధిత అభ్యర్థులు తాము కోరుకున్న మూడు ఆప్షన్‌లలో ఎక్కడైనా పనిచేస్తామని, మారుమూల ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడమేంటని ఆంతర్యమేమిటని పీవో ముందు కంటతడిపెట్టుకున్నారు.
రాష్ట్ర డెరైక్టర్ ఆదేశాల మేరకు..
విద్యార్థి సంఘాల ఆందోళన, బాధిత అభ్యర్థుల నిరసనలతో ఏం చేయాలో తోచక ఆర్వీఎం పీవో కౌన్సెలింగ్ వాయిదా వేసి తన చాంబర్‌కు వెళ్లిపోయారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పీవో శ్యాంప్రసాద్ మళ్లీ కౌన్సెలింగ్‌హాల్‌కు చేరుకుని మెరిట్ కం రోస్టర్ జాబితా ఎంపికలో మొదటి విడతలో పొరపాటు జరిగిందని, తిరిగి ఆర్వీఎం స్టేట్ ప్రాజెక్ట్ డెరైక్టర్ ఉషారాణి పంపించిన నియమ నిబంధనలు పాటిస్తూ ఎంపిక ప్రక్రియ కొనసాగిస్తున్నామని కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తిచేశారు. ఒకవైపు కొత్తగా ఉద్యోగాలు వచ్చిన అభ్యర్థుల ఒత్తిడి, ప్రస్తుతం కేజీబీవీల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులు తమ కాలపరిమితి ఏప్రిల్ వరకు ఉందంటూ కోర్టు నుంచి స్టే తెచ్చుకునే ప్రయత్నం జరుగుతోందని వెల్లడించడంతో అభ్యర్థులతోపాటు బాధిత అభ్యర్థులు సైతం ఆగమేఘాలపై ఉత్తర్వు కాపీలను అందుకుని చేసేదేమీ లేక ఆయా పాఠశాలల్లో జాయిన్ అయ్యేందుకు పరుగులుతీశారు.
రాజకీయ ఒత్తిళ్లు...
ఆర్వీఎం ఆధ్వర్యంలో ఇదివరకు చేపట్టిన సీఆర్టీ నియామకాల్లో సైతం రాజకీయ ఒత్తిళ్లు జరిగాయని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. ప్రత్యేకాధికారుల నియామకాల్లో సైతం రాజకీయ ఒత్తిళ్లు మరోమారు చోటుచేసుకోవడం వల్లే ఎంపిక ప్రక్రియ గందరగోళంగా జరిగిందని పలువురు విమర్శించారు. జాబితాను తయారు చేయడంలో నిర్లక్ష్యం, రోస్టర్ కం మెరిట్ పాటించడంలో నిబంధనలు, కోరుకున్నచోటు కాకుండా ఇతర ప్రాంతాల్లో పోస్టులు కేటాయించడం, రాత్రుళ్లు ఫోన్‌ల ద్వారా సమాచారమందించి సత్వరమే జాయిన్ కావాలని ఆర్వీఎం అధికారులు ఆదేశించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆర్వీఎం ఇష్టారాజ్యం!
Published Thu, Dec 12 2013 3:49 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM
Advertisement
Advertisement