కరీంనగర్ : బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ అజెండా అని, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం అన్నివర్గాల ప్రజలు ప్రభుత్వానికి బాసటగా నిలవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. నగరంలో ని పద్మనాయక కల్యాణమండపంలో ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌స్కూల్, కేజీబీవీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు, వార్డెన్లతో ఆదివారం ఏర్పాటుచేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. బడుగు విద్యార్థుల బాగోగుల కోసం జనవరి ఒకటి నుంచి రూ.720 కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, వసతిగృహాల్లో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసేందుకు పూనుకున్నామని అన్నారు. సన్నబియ్యం పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ఇందుకోసం ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో వ్యవహరించాలని కోరారు. సన్నబియ్యం పథకం అమలులో అక్రమాలకు పాల్పడితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. ప్రధానోపాధ్యాయులు పథకం అమలుకు బాధ్యత తీసుకోవాల్సిందేనని అన్నారు. పథకం అమలు విషయంలో స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. పేదల సంక్షేమం కోసం ఉన్న చట్టాలను అవసరమైతే వంద సార్లు సవరించి అండగా ఉంటామని చెప్పారు. విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మౌలిక వసతులు, బోధనేతర సిబ్బంది నియామకాలు త్వరలోనే చేపడతామని అన్నారు. కేసీఆర్ కలలుకన్న బంగారు తెలంగాణకోసం బాటలు వేయాలని కోరారు.
జోడెడ్ల బండిలాగా సాగుదాం: కొప్పుల
ప్రభుత్వం చేపట్టే పథకాల అమలుకు అధికారులు, ప్రజాప్రతినిధులు జోడెడ్ల బండిలాగా సాగాలని చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్ అన్నారు. దేశంలోనే తెలంగాణను నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు అండగా నిలవాలని సూచించారు. కేజీ టు పీజీ విద్యతోపాటు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలైతే అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. ఉద్యోగ ధర్మాన్ని విధిగా నిర్వహించి సన్నబియ్యం పథకంతోపాటు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుదామని సూచించారు.
పునరంకితులవ్వండి : తుల ఉమ
కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఉపాధ్యాయులు పునరంకితమవ్వాలని జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ అన్నారు. నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం విద్యార్థులకు ఎన్ని కోట్లయినా వెచ్చించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు.
బోధనేతర పనులు వద్దు: ఎమ్మెల్సీ పాతూరి
ఉపాధ్యాయులను తరగతి గదులకు పరిమితం చేయాలని, బోధనేతర పనులు అప్పగిస్తూ ఫలితాలకు ఆటంకం కలిగించే చర్యలు చేపట్టవద్దని ఎమెల్సీ పాతూరి సుధాకర్‌రెడ్డి కోరారు. తెలంగాణఉద్యమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు పదో పీఆర్సీని బహుమతిగా ఇచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు.
విద్యాభివృద్ధితోనే దేశాభివృద్ధి : రసమయి
విద్యారంగం అభివృద్ధి చెందడం ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.
మోడల్ జిల్లాగా చూపిద్దాం : పుట్ట మధు
సన్న బియ్యం పథకాన్ని సక్రమంగా అమలు చేసి రాష్ట్రంలోనే కరీంనగర్‌ను మోడల్ జిల్లాగా చూపిద్దామని ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు కళ్లెం వేసి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమష్టితో కృషిచేస్తే సాధ్యమేనని పేర్కొన్నారు.
నూతన అధ్యాయాన్ని సృష్టిద్దాం : దాసరి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలను అమలుచేసి నూతన ఒరవడికి శ్రీకారం చుడదామని ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచి పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. అభివృద్ధి పథకాలతో జిల్లాను ముందు వరుసలో నిలిపేందుకు సహకరించాలని కోరారు.
అదే స్ఫూర్తితో పనిచేయండి : విద్యాసాగర్‌రావు
తెలంగాణ ఉద్యమ సమయంలో చూపిన తెగువను ప్రభుత్వ పథకాల అమలులో చూపించి రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బాసటగా నిలవాలని ఎమ్మెల్యే కె.విద్యాసాగర్‌రావు కోరారు.
ర్యాంకుల పంట పండాలి: ఎమ్మెల్యే శోభ
ఉపాధ్యాయులు అంకిత భావంతో పనిచేయాలని, రానున్న రోజుల్లో కేజీ టు పీజీ ఉచిత విద్య అందించడం ఖాయమని ఎమ్మెల్యే శోభ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించి ర్యాంకుల పంట పండించేలా చూడాలని కోరారు.
‘పది’ నంబర్‌వన్ సాధించాలి : కలెక్టర్
పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ వీరబ్రహ్మయ్య కోరారు. విద్యార్థులకు గుణాత్మక విద్యా బోధన చేయాలని, సన్నబియ్యాన్ని పక్కదారి పట్టకుండా చూడాలని అన్నారు. నాణ్యమైన భోజనాన్ని అందిస్తూనే విద్యను అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని అన్నారు. అనంతరం పదోతరగతిలో గతేడాది వంద శాతం ఉత్తీర్ణత సాధించిన ప్రధానోపాధ్యాయులకు మెమెంటోలు, సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. జిల్లా విద్యాశాఖాధికారి కె.లింగయ్య, ఆర్వీఎం పీవో రాజమౌళి, బీసీ సంక్షేమశాఖ డీడీ చంద్రశేఖర్, గిరిజన సంక్షేమాధికారి ఎర్రన్న, జిల్లా ఉప విద్యాధికారులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
పేదల సంక్షేమమే ధ్యేయం
Published Mon, Dec 29 2014 2:01 AM | Last Updated on Mon, Mar 25 2019 3:09 PM
Advertisement
Advertisement