సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాధ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావులు మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డితో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన నిర్ణయంపై తీవ్ర నిరసనతో ఉన్న ధర్మాన గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. త్వరలో కాంగ్రెస్‌ను వీడనున్నారంటూ వార్తలు వస్తున్న సమయంలో ఆయన ముఖ్యమంత్రితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగి ఉంటుందని కాంగ్రెస్‌వర్గాలు భావిస్తున్నాయి. తన నియోజకవర్గంలో ఇటీవల జరిగిన రచ్చబండలో సీఎం పాల్గొన్నారని, దానికి కృతజ్ఞతలు తెలిపేందుకే సీఎంను కలిశానని శైలజానాథ్ చెప్పారు. అయితే తెలంగాణ ముసాయిదా బిల్లుపై కేంద్ర మంత్రుల బృందం కసరత్తు, అది అసెంబ్లీకి రానుండడం తదితర అంశాలపైనా వారు చర్చించినట్లు తెలుస్తోంది.