‘ఖర్గే’ రైలు ఆగేనా..?
- రేపు పార్లమెంట్‌లో రైల్వే బడ్జెట్
- కాజీపేట వ్యాగన్‌షెడ్‌కు గ్రీన్‌సిగ్నల్ వస్తుందని ధీమా
- డివిజన్ ఏర్పాటు, కోచ్‌ఫ్యాక్టరీపై చిగురిస్తున్న ఆశలు
- కొత్త రైళ్లు, పెండింగ్ లైన్లకుమోక్షం లభిస్తుందా..
కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : ఈసారి రైల్వే బడ్జెట్‌లోనైనా కాజీపేట జంక్షన్‌కు వరాలు కురుస్తాయని జిల్లా ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో పనులకు ప్రస్తుత బడ్జెట్‌లో మోక్షం లభిస్తుందని భావిస్తున్నారు. నాలుగేళ్ల క్రితం మంజూరైన వ్యాగన్‌షెడ్ పనుల ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తారని ఆశలు చిగురి స్తుండగా, కాజీపేట డివిజన్ కేంద్రం ఏర్పాటు, కోచ్‌ఫ్యాక్టరీ మంజూరు, పెండింగ్‌లో ఉన్న రైల్వే లేన్లు, ఆర్‌ఓబీ, ఆర్‌యూబీ లకు నిధుల మంజూరుతో పాటు కొత్త రైళ్లను ప్రకటిస్తారనే ధీ మా వ్యక్తమవుతోంది.
ఇక రైల్వే కార్మికులు, వారి పిల్లలు కూడా తమకు కేంద్ర మంత్రి వరాలు కురిపిస్తారని ఎదురుచూస్తున్నా రు. కేంద్ర రైల్వే మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే 2014-2015 సంవత్సరానికి రైల్వే బడ్జెట్‌ను బుధవారం పార్లమంట్‌లో ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో... ప్రజలు, రైల్వే కార్మికుల్లో ఉన్న ఆశలు, ఎదురుచూస్తున్న అంశాలపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం.
వ్యాగన్‌షెడ్ నిర్మాణం..
2009-10 రైల్వే బడ్జెట్‌లో కాజీపేటకు వ్యాగన్‌షెడ్ మంజూరు చేశారు. అయితే, ఆ తర్వాత నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టినా సర్వే, ఇతరత్రా పనుల కోసం అరకొరగానే నిధులు మంజూరు చేయడం, రాష్ట్రప్రభుత్వం తరఫున భూసేకరణలో జాప్యం జరగడం, కోర్టు కేసుల వల్ల వ్యాగన్‌షెడ్ అంశంలో అడుగు ముందుకు పడలేదు. ఈమేరకు ప్రస్తుత ‘ఎన్నికల బడ్జెట్’లో రైల్వే మంత్రి వ్యాగన్‌షెడ్ నిర్మాణంపై దృష్టి సారిస్తారని భావన వ్యక్తమవుతోంది.
కోచ్ ఫ్యాక్టరీ వస్తుందేమో..
ప్రధానిగా పీ.వీ.నర్సింహారావు ఉన్న సమయంలో కాజీపేటకు మంజూరైన కోచ్ ఫ్యాక్టరీని వివిధ కారణాలతో పంజాబ్ రాష్ట్రంలోని కపూర్తలాకు తరలించారు. ఇక ఆ తర్వాత ఏటా బడ్జెట్‌లో రెండు లేదా మూడు కోచ్ ఫ్యాక్టరీలు మంజూరు చేస్తున్నా జిల్లాకు స్థానం దక్కడం లేదు. ఈసారైనా మనకు కోచ్ ఫ్యాక్టరీ ఇస్తారని రైల్వే వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తర, దక్షిణ దేశాలను కలిపే ‘గేట్‌వే’ కాజీపేట జంక్షన్‌ను ప్రత్యేక డివిజన్ ఏర్పాటుచేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. కాజీపేట సబ్ డివిజన్‌గా కాజీపేట నుంచి నాలుగు పక్కల బల్లార్షా, విజయవాడ, ఆలేరు, కరీంనగర్ వరకు పాల న కొనసాగుతోంది. ఈ పరిధిలో ఏటా కోట్ల ఆదాయం వస్తుండగా.. ఇతర డివిజన్లలో కంటే కాజీపేట ద్వారా వచ్చే ఆదాయమే అధికమని అధికారులే చెబుతున్నారు. ఇలా అన్ని అర్హతలు ఉన్న కాజీపేటను డివిజన్ కేంద్రంగా మార్చాలనే డిమాండ్ వస్తోంది.
కాజీపేట డిప్యూటీ కన్‌స్ట్రక్షన్ కార్యాలయం పరిధిలో కాజీపేట -విజయవాడ, సికింద్రాబాద్ మూడో లైన్, హసన్‌పర్తి-కరీం నగర్‌కు రైల్వే లైన్ ఏర్పాటుకు కూడా ఈ బడ్జెట్‌లో గ్రీన్‌సిగ్నల్ ఇస్తారని ఆశిస్తున్నారు. ఇంకా పెండింగ్‌లో ఉన్న ఆర్వోబీలు, ఆర్‌యూబీలకు నిధులు మంజూరై పనులు సాగుతాయని, కొ త్త లేన్ల సర్వేకు మోక్షం లభిస్తుందనే ధీమా వ్యక్తమవుతోంది.
కాజీపేట, వరంగల్ మీదుగా ఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్‌కు కొత్త రైళ్లు వస్తాయని, పద్మావతి, కరీంనగర్-తిరుపతి రైళ్లను వారం పాటు నడిపించేందుకు అనుమతిస్తారని, కాజీపేట మీదుగా వెళ్లే గౌహతి, దురంతో, గరీబ్థ్,్ర షాలీమార్ రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తారని ఆశిస్తున్నారు.
ఏ-1 రైల్వే స్టేషన్‌లైన కాజీపేట, వరంగల్‌లో ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు మంజూరు చేస్తారని ఎదురుచూస్తున్నారు. అలాగే, కాజీపేట ఫాతిమానగర్ ప్లైవర్ బ్రిడ్జి కింద బైపాస్ లేన్‌లో ట్రయాంగిల్ ప్లాట్‌పాం నిర్మాణానికి 1972లో సర్వే పూర్తికాగా, ఈసారి అనుమతి వస్తుందనే భావనే వ్యక్తమవుతోంది.
రైల్వే బడ్జెట్‌పై రైల్వే కార్మికులు, రైల్వేకార్మికుల పిల్లలు కూడా గంపెడాశలు పెట్టుకున్నారు. గతంలో రైల్వే మంత్రులుగా పనిచేసిన లాలూప్రసాద్ యాదవ్ కూలీలను గ్యాంగ్‌మెన్లుగా పర్మినెంట్ చేయగా, మమత బెనర్జీ లార్జెస్ పథకం ప్రవేశపెట్టి గ్రూప్ ‘డి’ కార్మికుల కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇచ్చారు. ఇదేరీతిన మల్లిఖార్జున్ ఖర్గే కూడా వరాలు కురిపిస్తారని ఆయా వర్గాలు ఎదురుచూస్తున్నాయి.
కాజీపేట ఎలక్ట్రిక్ లోకోషెడ్‌లో ఇంజిన్ల నిర్వహణ సామర్థ్యానికి సరిపడా సిబ్బంది లేరు. ఈసారి పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇస్తారని కార్మికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇవే కాకుండా కాజీపేట రైల్వే ఆస్పత్రికి సబ్ డివిజన్ హోదా కల్పించి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునికీకరించాలని, రైల్వే పాఠశాలలో సెంట్రల్ సిలబస్ ప్రవేశపెట్టి నాన్ రైల్వే విద్యార్థుల కోటా పెంచాలని, కాజీపేటకు మంజూరైన 24 బోగీల ఫిట్‌లేన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, ఎలక్ట్రిక్, డీజిల్ లోకోషెడ్లలో పీఓహెచ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని, కాజీపేట నుంచి బెల్లంపెల్లి వరకు పుష్‌పుల్ నడిపించాలనే డిమాండ్లు కొన్నేళ్లుగా ఉన్నాయి. వీటన్నింటినీ ఈసారి రైల్వే బడ్జెట్‌లో మంత్రి మంజూరు చేస్తారని అన్ని వర్గాల వారు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా జిల్లా నుంచి లోక్‌సభ, రాజ్యసభలో ప్రాతినిథ్యం వహిస్తున్న నాయకులు దృష్టి సారిస్తేనే ప్రజలు ఆశలు నెరవేరుతాయనడంలో సందేహం లేదు.