అన్నింటా వెనుకబడిన కండ్రిగ.. ఇక క్రికెట్ దేవుడి దత్తపుత్రిక | Sachin Tendulkar is adopted daughter of the backward village | Sakshi
Sakshi News home page

అన్నింటా వెనుకబడిన కండ్రిగ.. ఇక క్రికెట్ దేవుడి దత్తపుత్రిక

Published Sun, Nov 16 2014 2:16 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో సీవీఆర్ విద్యార్థులతో సచిన్ ముచ్చట్లు - Sakshi

నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో సీవీఆర్ విద్యార్థులతో సచిన్ ముచ్చట్లు

పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకోనున్న సచిన్
మొత్తం 110 ఇళ్లు, 443 మంది జనాభా.. అందులో సగం మంది ఎస్సీ, ఎస్టీలే
నెల్లూరు జేసీ రేఖారాణి చొరవతో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని సచిన్ నిర్ణయం
నేడు పల్లెను సందర్శిస్తున్న సచిన్‌ టెండూల్కర్.. కండ్రిక ప్రజల హర్షాతిరేకాలు

 
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: పచ్చని చెట్ల మధ్య.. రహదారి పక్కనే ఉన్న ఆ పల్లె పేరు పుట్టంరాజు వారి కండ్రిగ. నెల్లూరు నగరానికి 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామాన్ని ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా పుట్టంరాజు వారి కండ్రిగ ప్రముఖ స్థానం సంపాదించుకుంది. దేశంలో ఎన్నో గ్రామాలు ఉన్నప్పటికీ సచిన్ ఈ గ్రామాన్నే ఎంచుకోవడం చర్చనీయాంశమైంది.
 
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం నెర్నూరు పంచాయతీ పరిధిలోని పుట్టంరాజువారి కండ్రిగ మజరా గ్రామం. 110 నివాస గృహాలు.. 443 మంది జనాభా కలిగిన పల్లె. అందులో ఎస్సీలు 178, ఎస్టీలు 61 మంది ఉన్నారు. గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 42 మంది పిల్లలున్నారు. ఒక్క గదిలో విద్యనభ్యసిస్తున్నారు. ఆపై చదువులు కావాలంటే 10 కిలోమీటర్ల దూరంలోని బాలాయపల్లెకు వెళ్లాల్సిందే. దీంతో అనేకమంది ఐదో తరగతితో చదువు మానేస్తున్నారు.  
 
ఉన్నత విద్యనభ్యసించింది ఆరుగురే...
గ్రామంలో ఉన్నత చదువులు అభ్యసించిన వారు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ప్రస్తుతం ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, బీ ఫాం చదివిన వారు ఐదుగురు మాత్రమే ఉన్నారు. వీరికి ముందు పెద్ద చదువులు చదివిన వారు ఇద్దరే. వారు చదివింది ఇంటర్‌మీడియట్. వారిద్దరూ ప్రస్తుతం గూడూరులో ఆటో నడుపుకుంటున్నారు.
 
జేసీ ద్వారా సచిన్ దృష్టికి కండ్రిగ..
ప్రధాని నరేంద్రమోదీ పిలుపుతో సచిన్ టెండూల్కర్ గూడురు మండలంలోని పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఈ గ్రామాన్నే దత్తత తీసుకోవటానికి నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ రేఖారాణి ప్రధాన కారణంగా తెలిసింది. జేసీ రేఖారాణి న్యూయార్క్ నుంచి కుమారుడు రామానుజనాయుడుని తీసుకుని భారత్‌కు విమానంలో వస్తుండగా అందులో సచిన్ టెండూల్కర్ ఉన్నారు. ఆ సమయంలో జేసీ తన కుమారుడ్ని పరిచయం చేసి.. నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా తాను పనిచేస్తున్నట్లు వివరించారు.
 
ఆ సమయంలో దత్తత విషయం గురించి ప్రస్తావించినట్లు సమాచారం. అందుకు సచిన్ ఓకే చెప్పగా.. జేసీ ఆ విషయాన్ని కలెక్టర్ శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఆ వెంటనే జిల్లాలోని బాగా వెనుకబడిన గ్రామమైన పుట్టంరాజు వారి కండ్రిగను ఎంపిక చేసి ఆ నివేదికను సచిన్‌కు పంపినట్లు సమాచారం. అలా పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామాన్ని దత్తత తీసుకునేందుకు సచిన్ ముందుకొచ్చారు. అందులో భాగంగా ఆదివారం నాడు పుట్టంరాజు వారి కండ్రిగను సందర్శిస్తున్నారు.
 
 గ్రామంలో ఒకటే చర్చ...
 టీవీల్లో క్రికెట్ చూసి సచిన్‌ను అభిమానులుగా మారిన పుట్టంరాజు వారి కండ్రిగ గ్రామస్తులు.. ఆ సచిన్ స్వయంగా తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని తెలిసి హర్షాతిరేకాలు వెల్లడిస్తున్నారు.
 
కృష్ణపట్నం పోర్టులో మొక్కలు నాటిన సచిన్
ముత్తుకూరు: సచిన్ టెండూల్కర్ శనివారం సాయంత్రం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నారు.ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన సచిన్‌కు పోర్టు ఎండీ శశిధర్, సీఈఓ అనిల్ ఎండ్లూరి పుష్పగుచ్ఛాలతో సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం సచిన్ అక్కడి సెక్యూరిటీ గార్డుల గౌరవ వందనం స్వీకరించారు. సెక్యూరిటీ కేంద్రంలో మొక్కలు నాటారు. సీవీఆర్ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ట్ర స్టు నిర్వహించే స్కూళ్ల విద్యార్థులతో ముచ్చటించి, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు.  అనంతరం జేసీ రేఖారాణితో పాటు ప్రత్యేక కాన్వాయ్‌లో ఆయన పోర్టును సందర్శించారు. జరుగుతున్న అభివృద్ధిని పోర్టు నిర్వాహకులు ఆయనకు వివరించారు. ఆయన చిల్లకూరు మండలంలోని గుమ్మళ్లదిబ్బ తీరంలో పోర్టు యాజమాన్యానికి చెందిన అతిధిగృహంలో సచిన్ బసచేశారు. ఆదివారం  కండ్రిక గ్రామాన్ని సందర్శించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement